కోహిమా: జంతు ప్రేమికుల కోసం నాగాలాండ్ రాష్ట్ర ఫారెస్ట్ విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాగాలాండ్ రాజధాని కోహిమాలో గల 'నాగాలాండ్ జూలాజికల్ పార్క్'లో గల జంతువులను, పక్షులను దత్తతకు ఇస్తున్నారు. ప్రస్తుతం జంతు సంరక్షణశాలలో పక్షులు, జంతువులు కలిపి 350 జీవాలు దత్తతకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆసక్తి గల జంతు ప్రేమికులు తమకు ఇష్టమైన జంతువులు, పక్షులను దత్తతకు తీసుకొని వాటి పోషణ బాధ్యతను చూసుకోవచ్చు.
ఈశాన్య భారత్లో మొట్టమొదటి సారిగా నాగాలాండ్లో ఈ దత్తత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2013లో 121 జంతువులు, పక్షులను దత్తతకు ఇవ్వగా దీనికి మంచి స్పందన రావడం జరిగింది. జూ నిర్వహణకు కావలిసిన నిధుల కొరత ఉండడంతో జంతువుల పోషణకై అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించింది. జంతువులు, పక్షుల దత్తత కార్యక్రమంతో జూ లోని జీవుల ఆకలి తీరడంతో పాటు జంతు ప్రేమికులకు ఆత్మ సంతృప్తి మిగులుతోంది.