సోమవారం సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి అడవిలో మొక్క నాటుతున్న హీరో ప్రభాస్. ఎంపీ సంతోష్‌కుమార్. చిత్రంలో మంత్రి ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్/జిన్నారం: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ హీరో ప్రభాస్ అర్బన్ ఫారెస్టును దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ సమీపంలో 1,650 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ నిర్ణయం వల్ల ఔటర్ రింగ్‌రోడ్డు వెంట దుండిగల్ పరిసర ప్రాంత వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ పార్కు, ఎకోటూరిజం సెంటర్ అందుబాటులోకి రానుంది. సోమవారం సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా ప్రభాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అర్బన్ పార్క్ మోడల్, ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటారు.
ఎంపీ సంతోష్ స్ఫూర్తితోనే: ప్రభాస్
ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తి, ప్రేరణతో పర్యావరణ మేలు కోసం తన వంతు సామాజిక బాధ్యతగా రిజర్వు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఈ అటవీ ప్రాంతం అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పారు. ముందస్తుగా రూ.2 కోట్ల విలువైన చెక్కును ప్రభుత్వానికి ఆయన అందజేశారు. దశల వారీగా అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తానని వెల్లడించారు. తన తండ్రి వెంకట సూర్యనారాయణ రాజు పేరు మీదుగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మాట నిలబెట్టుకున్న ఎంపీ సంతోష్‌కుమార్..
గతేడాది మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద కీసర అడవిని ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా గత ఏడాది ఆగస్టు 31న కీసరలో అటవీ పునరుజ్జీవన చర్యలు, ఎకో టూరిజం పార్కు అభివృద్ధికి మొక్కలు నాటి శంకుస్థాపన చేశారు. ఆ రోజు జరిగిన సభలో మాట్లాడిన సంతోష్‌కుమార్ తన స్నేహితులు, సన్నిహితులను కూడా ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు ఏడాదిలోనే దీనిని కార్యరూపంలోకి తెచ్చారు. కాగా, ఈ ఏడాది జూన్ 11న నాలుగో విడత గ్రీన్ చాలెంజ్‌ను ప్రారంభించి మొక్క నాటిన హీరో ప్రభాస్, ఎంపీ సంతోష్ సూచన మేరకు రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు అటవీ శాఖతో సంప్రదింపులు జరిపిన మీదట ఖాజీపల్లి అటవీ ప్రాంతం ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment