Indira Gandhi Zoological Park
-
సందడి ముగిసింది.. తెల్లపులి కుమారి ఇకలేదు..
సాక్షి, విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కులో తెల్ల పులి కుమారి(19) సందడి ఇక ముగిసింది. వృద్ధాప్యంతో పాటు అనారోగ్యం కారణంగా కుమారి సోమవారం మృతి చెందింది. విశాఖ జూ పార్కులో సుమారు 16 సంవత్సరాలు పాటు సందర్శకులను అలరించడంతో పాటు తన సంతతిని ఉత్పత్తి చేసింది. ఎన్‌క్లోజరులో హుషారుగా తిరుగుతూ చెట్లు ఎక్కుతూ, పరుగెత్తుతూ సందర్శకులకు కనువిందు చేసేది. ఇప్పుడు ఆ కుమారి దూరం కావడంతో జూ అధికారులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. 2007 కంటే ముందు ఇందిరాగాంధీ జూ పార్కులో తెల్ల పులులు ఉండేవి కాదు. దీంతో అప్పటి జూ అధికారులు హైదరాబాద్‌లో నెహ్రూ జూలాజికల్ పార్కు నుంచి కుమారితో పాటు మరో మగ తెల్ల పులి(జత తెల్ల పులులు)ని 2007లో ఇక్కడకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి హుషారుగా ఎన్‌క్లోజర్‌లో తిరుగుతూ మూడు సార్లు గర్భం దాల్చింది. మొత్తం 9 కూనలకు(పిల్లలు) జన్మనిచ్చి జూలో వాటి సంతతిని పెంచింది. వాటిలోనే కొన్నింటిని జంతు మార్పిడి పద్ధతి ద్వారా ఇక్కడ అధికారులు ఇతర జూ పార్కులకు తరలించి అక్కడ నుంచి కొన్ని జంతువులకు విశాఖ జూకి తీసుకొచ్చారు. కాన్పూర్ జూకి రెండు తెల్ల పులులను ఇచ్చి అక్కడ నుంచి ఒక మగ ఖడ్గ మృగాన్ని ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇతర జూ పార్కులకు తరలించగా, కుమారి మృతి అనంతరం ప్రస్తుతం జూలో ఐదు తెల్ల పులులున్నట్లు ఇన్చార్జి క్యూరేటర్, ఏసీఎఫ్ మంగమ్మ తెలిపారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని అవయవాలు కూడా పనిచేయకపోవడంతో కుమారి మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు ఆమె పేర్కొన్నారు. చదవండి: మోచా తుపాను మనకు లేనట్టే! -
పెద్ద పులి ఎక్కడ?
ఇందిరా గాంధీ జూ పార్కులో పెద్ద పులులు కనిపించడం లేదు. అలా అని జూ నుంచి తప్పించుకుని జనారణ్యంలో తిరుగుతున్నాయేమోనని భయపడకండి. ఆ పులులు జూ లోపలే ఉన్నాయి. అయితే సందర్శకులకు మాత్రం కనిపించకుండా నైట్క్రాల్స్కే పరిమితమయ్యాయి. జూ పార్కు అనగానే ఏనుగులు, పులులు గుర్తుకొస్తాయి. అవి కనిపిస్తేనే జూకి వెళ్లి జంతువులను చూశామన్న సంతృప్తి సందర్శకులకు కలుగుతుంది. ఇక్కడ చింపాంజీలు, చిరుతల ఎన్క్లోజర్లు దాటిన తర్వాత పెద్ద పులుల ఎన్‌క్లోజర్ ఉంది. ఇందులో రెండు పులులున్నాయి. అవి సందర్శకులను ఎంతగానో అలరిస్తుండేవి. అయితే ఏడాది నుంచి ఇక్కడ పెద్ద పులులు వాటి ఎన్‌క్లోజర్‌లో కనిపించడం లేదు. ఎన్‌క్లోజర్ వెనుక భాగంలో గోడ కూలిపోయింది. దీంతో పులులను ఎన్‌క్లోజర్‌లో విడిచిపెడితే బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు.. నైట్క్రాల్స్లో ఉంచి ఆ గోడ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. నాలుగు, ఐదు నెలల్లో గోడ నిర్మాణం పూర్తి చేసి ఎన్‌క్లోజర్ సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఏడాది గడుస్తున్నా ఈ గోడ పనులు పూర్తి కాలేదు. సరికదా మరో ఆరు నెలలు గడిచినా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని ఇక్కడ సిబ్బంది అంటున్నారు. గోడ పూర్తయితే గానీ పెద్ద పులులు సందర్శకులకు కనిపించవు. నిర్మాణ పనుల్లో జాప్యంపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌క్లోజర్‌కు సమీపంలో తెల్ల పులులు చూస్తూ.. ఒకింత సంతృప్తి చెందుతున్నారు. వెంటనే గోడ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. – ఆరిలోవ(విశాఖ తూర్పు) -
దత్తత తీసుకుందాం రండి..!
కరోనా మహమ్మారి మీతో పాటు మమ్మల్నీ ఇబ్బంది పెడుతోంది..అది మీ శరీరంలో ప్రవేశించి ప్రాణాలు తీస్తుంది. మమ్మల్ని ఆకలితో అలమటించేటట్లు చేస్తోంది... కొందరు దాతలు పేదలకు భోజనాలు పెడుతున్నారు.. అలాంటి దాతలే ముందుకొచ్చి మమ్మల్ని దత్తత తీసుకొని మా ఆకలి తీర్చండి.. ఇదీ ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాల వేదన.. ఆరిలోవ (విశాఖ తూర్పు) ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణులను దత్తత ఇస్తున్నారు.. జూ అధికారులు ఇక్కడ జంతువులు, పక్షుల ఆకలి తీర్చడానికి వాటిని దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులకు అవకాశం కల్పిస్తున్నారు. వాటిని మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరంలేదు. దత్తత తీసుకొన్నవారు వాటిని జూలోనే ఉంచి ఆహారం మాత్రమే అందిస్తారు. ఖర్చు మాత్రమే మనం జూ అధికారులకు ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బులతో వన్యప్రాణులకు వారే ఆహారం సరఫరా చేస్తుంటారు.. రెండేళ్లు నుంచి ఆకలి బాధలు.. జూ పార్కు నగరంలో ప్రధానమైన పర్యాటక కేంద్రం. సాధారణ రోజుల్లో 3,000 పైగా సందర్శకులు వెళుతుంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య 4,000 దాటుతుంది. దీని ప్రకారం రోజులో రూ 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు ఆదాయం లభిస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి ఆ ఆదాయానికి గండిపడింది. 2020 మార్చి 23 నుంచి అక్టోబర్ వరకు లాక్డౌన్లో భాగంగా జూ పార్కు మూసేశారు. దానివల్ల సుమారు రూ.4 కోట్లు ఆదాయం కోల్పోయింది. 2021లో మళ్లీ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దానివల్ల మరింత ఆదాయం కోల్పోయింది. సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ వన్యప్రాణులకు జూ అధికారులు ఆహారం అందిస్తారు. ఆదాయం రాకపోవడంతో గతంలో ఆదా చేసిన డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోంది. జూ నిధి ఖాళీ అవుతోందని జూ అధికారులు ఆందోళనలో పడ్డారు. దాతలు ఆదుకోకపోతే ఇక్కడ వన్యప్రాణుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.. ఎంతైనా ఇవ్వవచ్చు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. వాటి కోసం ఒక రోజుకు, నెల రోజులకు, ఏడాదికి వాటికయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయ పన్నులో మినహాయింపు ఉంటుంది. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పండ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పండ్ల ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పండ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికి వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.. జూలో 810కు పైగా వన్యప్రాణులు జూలో ప్రస్తుతం 90 జాతులకు చెందిన 810కు పైగా వన్యప్రాణులున్నాయి. వాటిలో ఏనుగులు, జీబ్రాలు, పులులు, సింహాలు, జింకలు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, నీటి ఏనుగులు, కోతులు, చింపాంజీలు, ఖడ్గమృగం, అడవి కుక్కలు, కణుజులు, అడవిదున్నలు, పాములు, మొసళ్లతో పాటు నెమళ్లు, నిప్పుకోళ్లు, ఈమూలు, హంసలు, మరికొన్ని రంగురంగుల పక్షులు ఉన్నాయి. వాటన్నింటికీ ఆహారం కోసం రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు సహకరించాలని జూ అధికారులు జంతు ప్రేమికులను కోరుతున్నారు. వ్యక్తులు, స్వచ్ఛంద సంఘాలతో పాటు కొన్ని పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఇవ్వడానికి ఇప్పటికే ముందుకొచ్చాయి. మరింత ఎక్కువమంది ఇక్కడ వన్యప్రాణుల దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని జూ అధికారులు కోరుతున్నారు.. ఖడ్గమృగాన్ని మూడేళ్లు దత్తత తీసుకున్న ఐఓసీఎల్ జూలో నకుల్ అని పిలవబడే ఇండియన్ ఖడ్గమృగాన్ని (మగది) ఐఓసీఎల్ ప్రతినిధులు మూడేళ్లు పాటు దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. దీనికోసం జూ క్యూరేటర్ నందనీ సలారియాతో ఐఓసీఎల్ ప్రతినిధులు వరుసగా మూడేళ్లు పాటు దత్తత తీసుకొన్నట్లు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13న ఒక ఏడాదికి సరిపడగా రూ.3 లక్షలు చెక్కును ఐవోసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ జూ క్యూరేటర్ నందనీ సలారియాకు అందజేశారు. ఒక జంతువు/పక్షికి దత్తతకు చెల్లించాల్సిన మొత్తం.. ► ఏనుగుకు ఒక రోజుకు–రూ.1200 ► ఖడ్గమృగానికి ఒక రోజుకు–820 ► నీటి ఏనుగుకు ఒక రోజుకు–600 ► సింహానికి ఒక రోజుకు–600 ► పెద్ద పులికి ఒక రోజుకు రూ.600 ► జిరాఫీకి ఒక రోజుకు రూ.500 ► చిరుత పులికి ఒక రోజుకు రూ400 ► ఎలుగుబంటి ఒక రోజుకు రూ.300 ► చింపాంజీకి ఒక రోజుకు రూ.210 ► అడవి దున్నకు ఒక రోజుకు రూ.200 ► జీబ్రా రెండింటికి ఒక రోజుకు రూ.330 ► తోడేళ్లు రెండింటికి ఒక రోజుకు రూ.300 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 ► చుక్కల దుప్పి ఒక రోజుకు రూ.100 ► రింగ్‌టైల్డ్ లెమూర్కు ఒక రోజుకు రూ.100 ► మొసలి/ఘరియల్ రెండింటికి ఒక రోజుకు రూ.150 ► హంసలు రెండింటికి రెండు రోజులకు రూ.100 ► నక్షిత్ర తాబేళ్లు పదింటికి ఐదు రోజులకు రూ.150 ► సారస్ కొంగ/నిప్పుకోడి/ పాములకు నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 గుడ్లగూబలు నాలుగింటికి ఒక రోజుకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 మకావ్‌లు నాలుగింటికి మూడు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 పీజియన్/నెమళ్లు నాలుగింటికి నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 రామ చిలుకలు/ఆఫ్రికన్ చిలుకలకు ఐదు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 లవ్ బర్డ్స్ పదింటికి ఐదు రోజులకు రూ.100 దాతలు ముందుకు రావాలి... కరోనా కారణంగా రెండేళ్లగా జూ ఆదాయం తగ్గిపోయింది. సందర్శకులు జూకి రావడం మానేశారు. దీంతో ఆదాయానికి గండిపడింది. దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలి. సంచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి వాటి ఆకలి తీర్చడంలో భాగస్వాములు కావాలి. వాటిని దత్తత తీసుకోవడానికి చెల్లించే మొత్తానికి ఆదాయం పన్ను మినహాయింపు ఉంది. ఈ దత్తత పద్దతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులు దత్తత తీసుకొన్నారు. ఇటీవల ఐవోసీఎల్సంస్థ ముందుకొచ్చి ఖడ్గమృగాన్ని మూడేళ్లు పాటు దత్తత తీసుకొంది. స్పందించిన దాతలు 9440810160, 0891–2552081 ఫోన్ నంబర్లకు సంప్రదించాలి. – నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
‘జూ’మ్మంది ఆనందం
-
జూలో యానిమల్ కీపర్ ఆత్మహత్య
ఆరిలోవ (విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న యానిమల్ కీపర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ నుంచి కొన్నేళ్ల క్రితం విశాఖ వచ్చిన కొందరు జూలో ఏనుగుల ఎన్‌క్లోజర్‌లో యానిమల్ కీపర్లుగా పనిచేస్తున్నారు. వారిలో కాలియప్పన్ (32) భార్యతో కలసి మధురవాడ ప్రాంతం కొమ్మాదిలో నివాసముంటున్నాడు. ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం నుంచి ఎన్‌క్లోజర్ వద్ద కనిపించలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటాడని తోటి కీపర్లు భావించారు. జింకల సఫారీ సమీపంలో ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. శనివారం విధులకు హాజరైన సిబ్బంది ఈ విషయాన్ని గమనించి జూ క్యూరేటర్ నందనీ సలారియాకు సమాచారమందించారు. క్యూరేటర్ ఫిర్యాదు మేరకు ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌రాజు, ఎస్ఐ అప్పారావు జూకు చేరుకొని వివరాలు సేకరించారు. కాలియప్పన్ భార్య, కుటుంబ సభ్యులను విచారించారు. అయితే కాలియప్పన్ మృతికి కారణాలు తెలియరాలేదు. -
విశాఖ జూపార్క్‌కు సందర్శకుల నిలిపివేత
-
అడ్డగోలుగా భూ పందేరం
చట్టాలు, తీర్పులు బేఖాతరు చేసి మరీ.. 625 ఎకరాల జూపార్కుభూములపై పెద్దల కన్ను పీపీపీ విధానంలో అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేయత్నం జూపార్కును కంబాలకొండకు తరలించే వ్యూహం వన్యప్రాణి చట్టాలు అడ్డురావు.... న్యాయస్థానం తీర్పులూ పట్టవు. అస్మదీయులకు భూపందేరమే లక్ష్యం అన్నట్లుగా తయారైంది ప్రభుత్వ తీరు. అందుకే వన్యప్రాణుల ఆవాసాలకు పెనుముప్పు కలిగిస్తూ మరీ భూపందేరానికి పన్నాగం పన్నుతోంది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు కు చెందిన 625 ఎకరాలను లక్ష్యంగా చేసుకుంది. అక్కడి నుంచి జూపార్కును తరలించి ఆ భూములను నైట్‌సఫారి, రిసార్టుల పేరుతో పీపీపీ విధానంలో ఆ భూములను తమ అనుకూల సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తోంది. ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం తన పంతం నెగ్గించుకునే దిశగా పావులు కదుపుతోంది. విశాఖపట్నం గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. కంబాలకొండ రిజర్వు ఫారెస్టుకు జూపార్కును తరలిస్తామని కూడా వెల్లడించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజానీకం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. విశాఖపట్నంలో ఆందోళనలు నిర్వహిస్తున్నా మంత్రి గంటా మాత్రం తాము జూపార్కును తరలిస్తామని పునరుద్ఘాటిస్తున్నారు. ఇందుకోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందించాలని వుడా అధికారులను కూడా ఇప్పటికే మౌఖికంగా ఆదేశించారు. ప్రభుత్వం చట్టాలు, న్యాయస్థానం తీర్పులను బేఖాతరు చేస్తోంది. పాంథర్ బయోస్పీయర్ నేచరల్ పార్కుకు ముప్పు : శివారులోని 16వేల చదరపు కి.మీ.లలో విస్తరించిన కంబాలకొండ అరుదైన చిరుతపులలకు సహజసిద్ధ ఆవాసంగా ఉంది. అందులో 8కిపైగా చిరుతపులులు సంచరిస్తున్నట్లు 2007లోనే అటవీశాఖ గుర్తించింది. చిరుతల సంఖ్యను పెంచేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర అటవీశాఖ 2013లో సర్వే నిర్వహించి కంబాలకొండను ‘పాంథర్ బయోస్పియర్ నేచురల్ పార్కు’గా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ప్రకారం కంబాలకొండ అభయారణ్య ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ మంత్రి గంటా ఆ కంబాల కొండలో 200 ఎకరాల్లో జూపార్కును ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. జూపార్కు ఏర్పాటు చేయాలంటే కంబాలకొండ అభయారణ్యంలో భవన, రోడ్లు నిర్మాణాలు చేపట్టాలి. ఇది కేంద్ర నిబంధనలకు విరుద్ధం. సుప్రీం కోర్టు తీర్పూ బేఖాతరు : అభయారణ్యాల్లో పర్యాటకాభివృద్ధి పేరుతో నైట్సఫారీలు ఏర్పాటు చేయకూడదని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పులులు సంచరించే అభయారణ్యాల్లో నైట్సాఫారీలు, రిసార్టులు ఏర్పాటు చేయమని కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఈ తీర్పును పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం జూపార్కును కంబాలకొండ అభరాణ్యానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కంబాల కొండను ఆనుకుని ఉన్న జూపార్కులో నైట్సఫారీ, రిసార్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. జూపార్కుకు చెందిన విలువైన 625 ఎకరాలను తమ అనుకూల సంస్థలకు కట్టబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చట్టాలు, న్యాయస్థానాల తీర్పులను బేఖాతరు చేస్తోందని స్పష్టమవుతోంది. -
'జూ'ను తరలించవద్దంటూ సీపీఎం నాయకుల ధర్నా
విశాఖపట్నం : విశాఖపట్నం కంబాలకొండ రిజర్వ్ ఫారెస్టులోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌ను తరలించవద్దంటూ సీపీఎం నాయకులు విశాఖ కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నాకు దిగారు. జూ పార్కు ఉన్న ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టాలనే ఆలోచనతో ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు కొన్ని రోజుల కిందట పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే.. జూపార్కును తరలిస్తున్నారనే ఊహాగానాలు వెలువడటంతో సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. సుమారు 625 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును 1977లో ఏర్పాటు చేశారు. -
జూ జోలికొస్తే ఖబడ్దార్..
విశాఖపట్నం: విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును తరలించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో చరిత్ర గల జూపార్కును తరలించడమేంటని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జూపార్కులోనే బొటానికల్ గార్డెన్‌ను అభివృద్ధి చేయవచ్చుకదా! అని అంటున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ఇది అవివేకం రియల్ భూముల కోసం జూను తరలిస్తామనడం సరికాదు. విశాఖకు పర్యాటకులు వస్తున్నారంటే అందులో సగం మంది జూని సందర్శిస్తున్నారు. పర్యాటకుల వల్ల విశాఖ అభివృద్ధి చెందుతోంది. అలాంటి జంతు ప్రదర్శన శాలను తరలిస్తామనడం అవివేకర . - బెహరా భాస్కరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జూ ఉంటేనే నగరానికి అందం విశాఖకు జూ పార్కు ఉంటేనే అందం. అది లేని విశాఖను ఊహించుకోలేం. ఫారెస్ట్ ఏరియా నుంచి డీనోటిఫై చేయకుండా ఎలా తరలిస్తారో అర్థం కావడం లేదు. ఎక్కడికి తరలించినా విశాఖకు నష్టమే. - పి.వి.నారాయణరావు, బీజేపీ నగర అధ్యక్షుడు ఎంతో చరిత్ర ఉన్న జూ ... హుద్‌హుద్ తుపానుకు జూ పార్కు బాగా దెబ్బతింది. జంతువులకు గాయాలయ్యాయి. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జంతువులు, పక్షుల కోసం ఖర్చు చేయలేదు. దాదాపు 800కు పైగా ఎకరాలున్న జూ పార్కును కబ్జా చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కుట్రపూరిత పనులు చేపడుతున్నారు. - గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జూ మార్పు మంచిదికాదు జూ పార్కును ఉన్నచోట నుంచి తరలించడం సరైన పద్ధతి కాదు. మనమే కొన్ని రోజులు అలవాటు పడిన స్థలం నుంచి మార్పు చెందితే జలుబు , జ్వరం వస్తాయి. అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు పడిన ప్రాంతం నుంచి వాటిని తరలిస్తే వాటికి ఇంకెన్ని ఇబ్బందులు తలెత్తుతాయో..మనం అయితే నోరు తెరిచి మన బాధ చెప్పుకోగలం. కానీ ఆ మూగ జీవులు ఏమని చెప్పుకుంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చోటుకు అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మారిస్తే ఆ వాతావరణానికి తట్టుకోవడం కష్టం. రియల్ ఎస్టేట్ పనుల మీద తరలించడం సరికాదు. -జేవీ రత్నం, గ్రీన్‌క్లైమేట్ ప్రతినిధి.