జూ జోలికొస్తే ఖబడ్దార్.. | Indira Gandhi Zoological Park to move | Sakshi
Sakshi News home page

జూ జోలికొస్తే ఖబడ్దార్..

Published Tue, Jan 13 2015 12:56 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

జూ జోలికొస్తే ఖబడ్దార్.. - Sakshi

జూ జోలికొస్తే ఖబడ్దార్..

విశాఖపట్నం: విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును తరలించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో చరిత్ర గల జూపార్కును తరలించడమేంటని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జూపార్కులోనే బొటానికల్ గార్డెన్‌ను అభివృద్ధి చేయవచ్చుకదా! అని అంటున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి.
 
ఇది అవివేకం

 
రియల్ భూముల కోసం జూను తరలిస్తామనడం సరికాదు. విశాఖకు పర్యాటకులు వస్తున్నారంటే అందులో సగం మంది జూని సందర్శిస్తున్నారు. పర్యాటకుల వల్ల విశాఖ అభివృద్ధి చెందుతోంది. అలాంటి జంతు ప్రదర్శన శాలను తరలిస్తామనడం అవివేకర .
 - బెహరా భాస్కరరావు,
 కాంగ్రెస్ నగర అధ్యక్షుడు
 
 జూ ఉంటేనే  నగరానికి అందం

విశాఖకు జూ పార్కు ఉంటేనే అందం. అది లేని విశాఖను ఊహించుకోలేం. ఫారెస్ట్ ఏరియా నుంచి డీనోటిఫై  చేయకుండా ఎలా తరలిస్తారో అర్థం కావడం లేదు. ఎక్కడికి తరలించినా విశాఖకు నష్టమే.
 - పి.వి.నారాయణరావు,  బీజేపీ నగర అధ్యక్షుడు
 
ఎంతో చరిత్ర ఉన్న జూ ...

హుద్‌హుద్ తుపానుకు జూ పార్కు బాగా దెబ్బతింది. జంతువులకు గాయాలయ్యాయి. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జంతువులు, పక్షుల కోసం ఖర్చు చేయలేదు. దాదాపు 800కు పైగా ఎకరాలున్న జూ పార్కును కబ్జా చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కుట్రపూరిత పనులు చేపడుతున్నారు.                   
  
- గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 
 జూ మార్పు మంచిదికాదు

జూ పార్కును ఉన్నచోట నుంచి తరలించడం సరైన పద్ధతి కాదు. మనమే కొన్ని రోజులు అలవాటు పడిన స్థలం నుంచి మార్పు చెందితే జలుబు , జ్వరం వస్తాయి. అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు పడిన ప్రాంతం నుంచి వాటిని తరలిస్తే వాటికి ఇంకెన్ని ఇబ్బందులు తలెత్తుతాయో..మనం అయితే నోరు తెరిచి మన బాధ చెప్పుకోగలం. కానీ ఆ మూగ జీవులు ఏమని చెప్పుకుంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చోటుకు అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మారిస్తే ఆ వాతావరణానికి తట్టుకోవడం కష్టం. రియల్ ఎస్టేట్ పనుల మీద తరలించడం సరికాదు.

 -జేవీ రత్నం, గ్రీన్‌క్లైమేట్ ప్రతినిధి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement