బకింగ్‌హాం కెనాల్లో రైల్వే ఉద్యోగి గల్లంతు | Buckingham Canal Railway employee displaced | Sakshi
Sakshi News home page

బకింగ్‌హాం కెనాల్లో రైల్వే ఉద్యోగి గల్లంతు

Published Tue, Jan 6 2015 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

Buckingham Canal Railway employee displaced

దుగ్గిరాల/తెనాలి రూరల్: తెనాలి పట్టణానికి చెందిన ఓ రైల్వే ఉద్యోగి దుగ్గిరాల లాకు వద్ద కృష్ణా పశ్చమ ప్రధాన కాలువలో సోమవారం గల్లంతయ్యాడు. ఆదివారం నిర్వహించుకున్న మీలాదున్ నబీకి సంబంధించిన పూలను నీటిలో నిమజ్జనం చేసే ప్రయత్నంలో కాలుజారి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి గంగానమ్మపేటలోని సాయి అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న పట్టణానికి చెందిన షేక్ ఫరీద్‌బాషా (34) రైల్వే డ్రైవర్‌గా విజయవాడలో పనిచేస్తున్నాడు.

సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై విజయవాడవెళ్తూ, మార్గంమధ్యలో దుగ్గిరాల పాతలాకు వద్ద ఆగాడు. లాకు తూముల వద్ద కాలువ కట్టపై బైక్, అతని బ్యాగు ఉంచి కాలువ ఒడ్డుకు వెళ్లాడు. పూలు కాలువలో వదులుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలోపడి గల్లంతయ్యాడు. కాలువ నీటిలో మునిగిపోతూ రక్షించండంటూ ఆర్తనాదాలు చేశాడని, సమీపంలో పురుషులు ఎవ్వరూ లేకపోవడంతో రక్షించలేకపోయారని స్థానిక మహిళలు చెప్పారు.

విషయం తెలిసిన ఏఎస్‌ఐ సుభాని, సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మోటారుసైకిల్, బ్యాగును స్వాధీనపరచుకుని, కాలువ వెంట కొంతదూరం గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. బ్యాగ్‌లో రెండు సెల్‌ఫోన్లు, యూనిఫాం దుస్తులు, డ్యూటీకి సంబంధించిన మూడు పుస్తకాలు, రెండు పేపర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఫోన్‌లో ఉన్న నంబర్ల ఆధారంగా తెనాలిలోని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పలువురు దుగ్గిరాల చేరుకున్నారు. కాలువ వెంట గాలింపు చర్యలు ప్రారంభించారు. తోటి ఉద్యోగి కాలువలో గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న పలువురు రైల్వే ఉద్యోగులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసునమోదు చేసి విచారిస్తున్నట్లు దుగ్గిరాల ఏఎస్‌ఐ సుభాని తెలిపారు. గల్లంతైన ఫరీద్‌బాషాకు భార్య హర్షదున్నీసా, మూడేళ్ల కుమారుడు తాజ్‌బాషా ఉండగా, తల్లిదండ్రులు షేక్ ఖాదర్‌వలి, నజీరున్నీసాలతో కలసి గంగానమ్మపేటలోని సాయి అపార్టుమెంటులో నివాసం ఉంటున్నట్లు బంధువులు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement