అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య.. ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి పార్టీ నాయకుల వరకూ ఒకటే తీరు. నాడేమో కాసుల కోసం కక్కుర్తి పడి..కావల్సిన వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పి..పనులు వేగంగా జరుగుతున్నాయని ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వారి తీరు మారలేదు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా కొత్తపట్నం వంతెనపై క్షుద్ర రాజకీయానికి తెరతీశారు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..బకింగ్‌హామ్ కెనాల్ సాక్షిగా ఆయన చేస్తున్న డ్రామా పలు విమర్శలకు తావిస్తోంది.
సాక్షి, ఒంగోలు: ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలకు కడుపుమంట పుడుతోంది. అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. నాడు కమీషన్‌లకు కక్కుర్తిపడి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి కాంట్రాక్టు పనులు అప్పగించారు.. పనులు వేగంగా జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు... ఇతని రాజకీయ డ్రామాలు తెలుసుకున్న ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టారు.. దీంతో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకునే కుట్రలు పన్నుతూనే ఉన్నారు.
ప్రజలపై ఉన్న కోపమో, బాలినేనిపై అక్కసో తెలియదు గానీ పేదల ఇళ్లు దగ్గర నుంచి ఎన్నో పనులకు అడ్డుపడుతూనే ఉన్నారు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో జనార్దన్ హైదరాబాద్‌కు, బెంగళూరుకు పరిమితమయ్యారు తప్ప, వారి ఇబ్బందిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ఎమ్మెల్యే బాలినేని మాత్రం నిత్యం ప్రజలతో ఉంటూ జీజీహెచ్‌లో వంద పడకలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఆక్సిజన్, మందులు, భోజనం ఉచితంగా అందించడమే కాక, నగర ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు అందిస్తూ వారితో మమేకమయ్యారు.
దీన్ని జీర్ణించుకోలేక దామచర్ల జనార్దన్ అండ్ కో బాలినేనిపై ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ మరో రాజకీయ డ్రామాకు తెరతీశారు. అసలు బ్రిడ్జి నిర్మాణం విషయానికొస్తే జనార్దన్ జేబులు నింపుకోవడానికే దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప, ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని కొత్తపట్నంతోపాటు, ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మండి పడుతున్న పరిస్థితి. బ్రిడ్జి పనులు చేస్తున్నది తాను అప్పగించి.. తమ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్ అయినప్పటికీ బాలినేనిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారు. తాజాగా మరోసారి బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
టీడీపీ హయాంలో పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ ప్రస్తుతం సైతం పనులు చేస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ వద్ద కమీషన్‌లకు దామచర్ల జనార్దన్ కక్కుర్తి పడ్డా..బాలినేని మాత్రం బ్రిడ్జి వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ వచ్చారు తప్ప, కాంట్రాక్టర్‌ను ఎక్కడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయితే రాజకీయ కుట్రలో భాగంగా పనులు నత్తనడకన జరుగుతున్నాయని గ్రహించిన బాలినేని పనులు వేగవంతం చేయాలని, లేదంటే చర్యలు తప్పవంటూ కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో అప్పటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. దీన్ని గమనించిన జనార్దన్ త్వరలో పనులు పూర్తవుతాయని తెలుసుకుని రాజకీయ డ్రామాకు తెరతీశారు. బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టి తన ఆందోళన కారణంగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే కలరింగ్ ఇచ్చుకునే కుయుక్తులకు పథక రచన చేస్తున్నారు.
చదవండి: (పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు)
కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు సక్రమంగా పనులు జరగలేదని తెలిసినా బ్రిడ్జిని రాజకీయంగా తన రాజకీయ డ్రామాకు వాడుకునే ప్రయత్నం చేస్తుండటంపై ప్రజలు సైతం ఛీ కొడుతున్నారు. సొంత పార్టీలో ఉన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ఏవో ఉద్యమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆపార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తుండటం గమనార్హం. బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసి ఈనెల 20వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 20 తరువాత వాహనాల రాకపోకలను బ్రిడ్జిపై అనుమతించి చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే వాటిని అతి త్వరలోనే పూర్తి చేస్తామంటూ అధికారులు చెబుతుండటం విశేషం.
బ్రిడ్జి పనులు పూర్తయ్యే సమయంలో జనార్దన్ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలందరికీ తెలుసని, చీప్ పాలిటిక్స్ చేస్తూ జనార్దన్ ప్రజల్లో మరింత చులకనవుతారని గుర్తించాలని పలువురు హెచ్చరిస్తున్నారు. కరోనాతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నా వారి ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించని జనార్దన్ ఎలక్షన్‌లు దగ్గర పడుతున్న సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు చూపించే కుయుక్తులకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆటంకాలు కలిగించకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు.
కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలా..
ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌హాం కెనాల్‌పై వంతెన నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ వద్ద మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్ కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారు. 2016లో మంజూరైన బ్రిడ్జి పనులు టీడీపీ ప్రభుత్వంలో మూడున్నర సంవత్సరాలపాటు కమీషన్ల కోసం కాలయాపన చేస్తూ నిర్మాణ పనులను నిర్వీర్యం చేశాడు.
కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధులతో ప్రారంభమైన పనులు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమును రద్దు చేసిన సంగతి తెలిసి కూడా జనార్దన్ ప్రజలను మభ్యపెట్టే పనులు చేపట్టడం ఏదో సానుభూతి పొందాలని తప్ప ప్రజలకు మేలు చేద్దామని కాదు. నిర్మాణ పనులు పూర్తవుతున్న బ్రిడ్జి వద్దకు వెళ్లి ఏదో నిరసన వ్యక్తం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆయన హడావుడి చేసినందు వల్ల పనులు వేగంగా జరిగాయని బిల్డప్ ఇచ్చుకోవాలని చూస్తున్నాడు. అయితే నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ట్రయల్ రన్ పూర్తి చేసి అనంతరం బ్రిడ్జిపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగిస్తాం.
– బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment