టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌తో శ్రీమన్నారాయణ (ఫైల్)
సాక్షి, ఒంగోలు: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చాటుమాటు పనులు అన్న చందంగా ఉంది తెలుగు తమ్ముళ్ల తీరు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు తెగబడిన టీడీపీ నాయకులు.. అధికారంలో లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, గుట్కా దందాకు తెరలేపారు. ఒంగోలు నగరానికి చెందిన టీడీపీ నాయకుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గంజాయి, గుట్కా వ్యాపారం చేస్తూ మాఫియాగా మారాడు. చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన శ్రీమన్నారాయణ తల్లి మస్తానమ్మ ప్రస్తుతం ఒంగోలు 46వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు.
ఆయన సోదరుడు కూడా టీడీపీలో క్రియాశీలకమైన పదవిలో ఉన్నాడు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఏళ్ల తరబడి గంజాయి, గుట్కాల వ్యాపారం చేస్తూ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా గంజాయి, గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు శ్రీమన్నారాయణ అత్యంత సన్నిహితుడు. దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గంజాయి, గుట్కా వ్యాపారం జోరుగా సాగించాడు. మాజీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు కూడా అత్యంత సన్నిహితుడుగా మెలుగుతూ వచ్చాడు.
యువతకు ఉపాధి కోసం టీడీపీ ధర్నాలో ప్లకార్డు పట్టుకొని నిరసన తెలుపుతున్న శ్రీమన్నారాయణ (ఫైల్)
గుడ్లూరు పోలీసులకు గంజాయితో పట్టుబడి
గుడ్లూరు పోలీసులకు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ గత ఏడాది గంజాయితో పట్టుబడ్డాడు. 2021 ఏప్రిల్ 25వ తేదీన గుడ్లూరు పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుంచి కారులో గంజాయితో వస్తూ దీనిని గమనించిన గుట్లాపల్లి శ్రీమన్నాయణ బృందం కారును తిరిగి కావలి వైపునకు తిప్పడంతో పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అప్పట్లో వారి వద్ద కారులో 10 కేజీల గంజాయి దొరికింది. గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీమన్నారాయణతో పాటు తెట్టుకు చెందిన తిరుమలరాజు వెంకటేశ్వరరాజు, ఏకొల్లు కృష్ణార్జున రావు, బెంగళూరుకు చెందిన శంకర్ మోహన్, ప్రధాన నిందితుడు శ్రీమన్నారాయణ కారు డ్రైవర్ రమేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: (ఫ్రస్ట్రేషన్‌లో చంద్రబాబు)
)
గుట్కా ప్యాకెట్లతో నిందితులు శ్రీమన్నారాయణ, కారు డ్రైవర్
ఒంగోలులో గుట్కాల నిల్వలతో...
ఒంగోలు నగరంలో కారులో గుట్కాలు తరలిస్తున్నట్లు ఎస్పీ మలికాగర్గ్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఎస్‌ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రారావు తన సిబ్బందితో దాడి చేసి కారును పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని కారు నడుపుతున్న ముల్లూరి వెంకట నాగ శివ చరణ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 27,375 గుట్కాప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు గుట్లాపల్లి శ్రీమన్నారాయణ అక్రమ వ్యాపారం బయటపడింది.
ఒంగోలు నగరంలోని బృందావన్ నగర్ 11 వ లైన్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్ల గుట్టు రట్టయింది. ఆ ఇంట్లో 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ ఇల్లు 46వ డివిజన్ టీడీపీకి చెందిన కార్పొరేటర్ గుట్లాపల్లి మస్తానమ్మ, కుమారుడు గుట్లాపల్లి శ్రీమన్నారాయణది అని తేలింది. మొత్తం గుట్కా ప్యాకెట్ల విలువ రూ.3,43,224 గా ఎస్‌ఈబీ పోలీసులు తేల్చారు. ఇలా గంజాయి, గుట్కా అక్రమ వ్యాపారంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment