సాక్షి, కావలి (నెల్లూరు): అధికార పార్టీ నాయకుల హోదాలో కావలి టీడీపీ నాయకులైన బీద సోదరులు ప్రభుత్వ నిధులను లూటీ చేయడాన్ని అడ్డూ అదుపు లేకుండా ఐదేళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అల్లూరు చెరువును అడ్డాగా చేసుకొని నిధుల దోపిడీకి రంగం సిద్ధం చేశారు. అయితే ఇరిగేషన్‌శాఖ అధికారులు బీద సోదరుల అడ్డమైన దోడిడీకి సహకరించి తాము ఎందుకు బలైపోవాలని ఆత్మపరిశీలన చేసుకున్నారు. రూ.3 కోట్లకు సరిపడే బిల్లులును అల్లూరు చెరువు, పంట కాలువలు మరమ్మతుల పేరుతో చెల్లింపులు చేయాలని బీద సోదరులు చేస్తున్న వత్తిళ్లకు అధికారులు లొంగలేదు.
చెరువును అడ్డం పెట్టుకుని..
అల్లూరు చెరువు నుంచి 25 వేల ఎకరాలకు పైచిలుకు సాగునీరు అందుతుంది. అలాగే అల్లూరులోని 30 వేల జనాభాకు తాగునీరు అందించే వసతి ఉంది. అలాగే ఈ చెరువు నుంచి మరో మూడు చెరువులకు నీరు చేరుతోంది. ఇలా అల్లూరు చెరువుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సరిగ్గా ఈ అంశాన్ని టీడీపీ నాయకులు అడ్డం పెట్టుకొని చెరువు కట్టను, పంట కాలువ మరమ్మతులను, సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ పనులు ఇలా తమకు తోచిన పనులు అర్జెంట్‌గా చేయాల్సి ఉందని అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి అత్యవసరంగా రూ.3 కోట్లు నిధులు మంజూరు చేయాలని సదరు నివేదికలో అధికారులు పొందుపరిచేలా చేశారు. ఆ ప్రతిపాదనలకు సంబంధించిన ఫైలును అల్లూరు నుంచి జిల్లా కేంద్రమైన నెల్లూరు, అక్కడ్నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి చేరేలా పరుగులు తీయించారు. ఎట్టకేలకు ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసింది. దీంతో టీడీపీ నాయకులైన బీద సోదరులు బినామీలుగా అవతరించి ఈ కాంట్రాక్ట్ పనులను సొంతం చేసుకొన్నారు.
అధికారులపై గుర్రుగా బీద సోదరులు
కాలువలు కాంక్రీట్ లైనింగ్ పనులు, చెరువు కట్ట బండ బలోపేతం చేసే పనులు, కలుజు మరమ్మత్తులు తదితర పనులు చేయాలని సోమశిల జలాలను సైతం చెరువు రాకుండా అడ్డుకొన్నారు. రైతులు తమ పొలాలకు నీరు ఇవ్వకపోతే పంటలు ఎలా పండించుకోవాలని అల్లూరు రైతులు నెత్తినోరు బాదుకున్నా బీద సోదరులు లెక్క చేయలేదు. అదేమంటే చెరువు, కలుజు, కాలువలు మరమ్మతు పనులు చేస్తున్నారు, సాగుకు నీరు వదిలితే పనులు ఆగిపోతాయని రైతులపైనే బీద సోదరులు గుడ్లురిమారు. క్రమంలో అల్లూరు చెరువు, పంట కాలువలు మెరుగుపడుతాయని రైతులు, అల్లూరు ప్రజలు ఆశించారు.
అయితే బీద సోదరులు మొక్కుబడిగా ఈ పనులు చేసి రూ.3 కోట్లకు బిల్లులు చేసి, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను తమ బ్యాంక్ ఖాతాలో జమచేయాలని ఇరిగేషన్ అధికారులను వేపుకుతిన్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు బీద సోదరుల దోపిడీ దూకుడును గమనించి భీతిల్లిపోయారు. కనీసం కంటికి కనిపించే పనులు కూడా చేయకుండా రూ.3 కోట్ల నిధులను టీడీపీ నాయకులకు అప్పనంగా అప్పగిస్తే, అనంతరం వచ్చే సమస్యలకు తాము బలైపోవాల్సి వస్తుందని అధికారులు భావించారు. దీంతో బిల్లులు చేయకుండా పక్కన పెట్టేశారు. బీద సోదరులు మాత్రం తమ బిల్లులు చేయకుండా ఉంటారా.. అంటూ ఇరిగేషన్ అధికారులపై కత్తులు నూరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment