ఐదేళ్లుగా అన్నీ కష్టనష్టాలే.... | Shake Abdul Basheer Interview With Sakshi | Sakshi
Sakshi News home page

ఐదేళ్లుగా అన్నీ కష్టనష్టాలే....

Published Sun, Mar 24 2019 8:52 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Shake Abdul Basheer Interview With Sakshi

సాక్షి, ప్రకాశం: ‘గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టనష్టాలకు గురయ్యారు. టీడీపీ అభివృద్ధి, హామీలన్నీ కాగితాలు, మాటలకే పరిమితం కావడంతో వ్యవస్థలన్నీ దెబ్బతిని ప్రజానీకం అవస్థల పాలైంది. ప్రధానంగా సామాన్యుడి సగటు ఆదాయం దెబ్బతింది. ప్రభుత్వ విధానాల ఫలితంగా వారిలో కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. ప్రధాన రంగాలన్నీ కుదేలయ్యాయి’ అంటూ ఎన్జీవో సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ బషీర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన బషీర్‌.. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన ఏ మాటనూ నిలబెట్టుకోలేదన్నారు. అబ్దుల్‌ బషీర్‌ ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి...

సాక్షి : మీరు సామాజిక సమస్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా.. సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పరిస్థితి ఎలా ఉంది?
బషీర్‌ : సంతోషంగా ఉన్న కుటుంబాల సంఖ్య బాగా పడిపోయింది. ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా సామాన్యుడి సగటు ఆదాయం తగ్గిపోయింది. నిత్య జీవనానికే కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ వర్గం వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వీరి ఆదాయం పెరగనందునే కుటుంబంలో చిన్నచిన్న అవసరాల నుంచి విద్య, వైద్యం వంటి అంశాలను అందిపుచ్చుకోలేకున్నారు. పొట్ట నింపుకోవడానికే నానా అవస్థలు పడుతున్నారు. ఏదైనా పెద్ద ఖర్చు పడిందంటే వారికి ప్రభుత్వం నుంచి తగిన భరోసా లేదు.
సాక్షి : ఉద్యోగుల కోర్కెలు తీర్చామంటోంది ప్రభుత్వం.. ఉద్యోగ వర్గం సంతోషంగా ఉన్నారా?
బషీర్‌ : ఉద్యోగుల అనేక డిమాండ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీర్ఘకాలం నుంచి పోరాటాలు చేస్తున్నా వారిని మభ్యపెట్టి, బుజ్జగించి ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఉద్యోగుల హక్కులలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఏళ్ల నాటి పీఆర్సీ బకాయిలను గతేడాది డిసెంబర్‌లో మంజూరు చేసింది. ఐఆర్‌ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టింది. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన అంశాలపై ప్రశ్నిస్తే లోపాయికారి బెదిరింపులతో ప్రభుత్వం ఉద్యోగుల కోర్కెలను పెండింగ్‌లో ఉంచింది. ఏ అంశంపైనా నోరు మెదిపి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికలు  సమీపిస్తున్న నేప«థ్యంలో కొన్ని ప్రధాన డిమాండ్లు.. అదీ ఆర్థికభారం లేని వాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏ ఒక్క ఉద్యోగికీ వారి కోర్కెల సాధన జరగకు సంతోషంగా లేరు.
సాక్షి : సీపీఎస్‌ విధానంపై ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది?
బషీర్‌ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం దుర్మార్గమైంది. దీనిని రద్దు చేయాలన్న ఉద్యోగ జేఏసీ డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత వారి మనుగడకు పెన్షన్‌ భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వం పెన్షన్‌ మొత్తాన్ని షేర్‌ మార్కెట్‌లో పెట్టి ఉద్యోగుల జీవితాలతో జూదమాడుతోంది. దీనిని ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నారు. సీపీఎస్‌ పట్ల కాలయాపన తగదు.
సాక్షి : ప్రభుత్వ పరంగా ప్రజలకు అందాల్సిన సేవలు దూరమవుతున్నాయి. వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
బషీర్‌ : ప్రభుత్వ శాఖల్లో వివిధ కేడర్లలో ఉద్యోగుల ఖాళీలు బాగా పెరిగాయి. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా నియామకాలు లేవు. పొరుగు సేవలు, కాంట్రాక్టు ఉద్యోగులను కీలకమైన విభాగాల్లో నియమిస్తున్నారు. వీరి వల్ల లాభం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. కీలకమైన రెవెన్యూతో పాటు ప్రజలతో నిత్యం సంబంధాలున్న వివిధ శాఖల్లో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడం ద్వారానే ప్రజలకు అందాల్సిన సేవలు అందుతాయి. ప్రభుత్వ శాఖల పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. ఉద్యోగులపైనా పనిభారం పెరుగుతోంది.
సాక్షి : ఈ ఐదేళ్ల పాలనపై మీ అభిప్రాయం ఏమిటి?
బషీర్‌ : అన్ని రంగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాలేదు. ఏ వ్యవస్థా సరిగ్గా పని చేయడం లేదని నా అభిప్రాయం. అభివృద్ధి కార్యక్ర మాలు ప్రకటించిన విధంగా జరిగింది లేదు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఓవర్‌డ్రాఫ్ట్‌కి వెళ్లిందంటే ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోటుపాట్లు గోచరించాయి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. సామాన్యులతో పాటు ఎగువ మధ్య తరగతి కుటుంబాలు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారు. ఈ వ్యవస్థలో మార్పు, నిజాయితీ, విశ్వసనీయత రావాలన్న అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు.
సాక్షి : కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెనుకబడిన జిల్లాలకు మేలు కలుగుతుందని ప్రజలు భావించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?
బషీర్‌ : నిజమే.. అందరూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చే ప్రాజెక్టుల్లో మన జిల్లాకు ప్రాధాన్యం లభిస్తుందని అనుకున్నారు. అందుకు భిన్నంగా జరిగింది. జిల్లాకు చెందిన పాలకులు ఐదేళ్లు కాలహరణం చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు. కరవుతో కుదేలైన జిల్లా ప్రజలకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులకూ నిధులివ్వలేదు. రామాయపట్నం ఓడరేవు కల చెదిరింది. జిల్లాలో వనరులు అపారంగా ఉన్నా వాటికి అనుగుణంగా పరిశ్రమలు రాలేదు. ఉపాధి అవకాశాలు మెరుగుకాలేదు. జిల్లా నుంచి 5 లక్షల మంది వలస వెళ్లారు. తాగేందుకు నీళ్లు లేవు. పశువులకు నీళ్లిచ్చే ఆలోచన కూడా లేదు. ఫ్లోరైడ్‌ బాధితుల కష్టాలు తొలగనేలేదు. కిడ్నీ బాధితులకు మేలు జరగలేదు. విద్య, వైద్య రంగాల అభివృద్ధే లేదు. ఐదేళ్లుగా జిల్లా ప్రజలు ఎంతో మోసపోయారు.
సాక్షి : జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందింది. ఆ రంగాలు ఎలా ఉన్నాయి?
బషీర్‌ : ప్రాధాన్యతా రంగాలకు నిధులు అంతంత మాత్రంగానే కేటాయించారు. సుమారు రూ.180 కోట్లే కేటాయించగా, చిన్నతరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం లేదు. మధ్యతరహా పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయి. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో ఉంటేనే జిల్లాలో ఉపాధి కళకళలాడుతుంది. కానీ, ఇక్కడ పారిశ్రామిక రంగం బాగా దెబ్బతింది. వ్యవసాయ రంగాన్ని నీరుగార్చారు. రైతులకు తగిన ప్రోత్సాహం లేదు. ఏటా రూ.12 వేల కోట్ల బడ్జెట్‌ను అమలు చేస్తున్నా.. ప్రాధాన్యతా రంగాల నుంచి ఆశించిన పురోగతి కనిపించలేదు. ఇప్పట్లో ఇవి కోలుకోలేవు.

సాక్షి : ఉద్యోగుల ఆరోగ్యానికి హెల్త్‌కార్డు భరోసా కదా.. ఆ కార్డు ద్వారా ఏ విధంగా సేవలందుతున్నాయి?
బషీర్‌ : ఉద్యోగుల అనేక పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చి హెల్త్‌కార్డు ఇచ్చింది. ఈ కార్డు ఎంత మాత్రం అమలులో ఉందన్న సమీక్ష ప్రభుత్వం వైపు నుంచి లేకుండా పోయింది. హెల్త్‌కార్డు వల్ల తగిన భరోసా లేదు. ఆస్పత్రికి వెళితే హెల్త్‌కార్డు ఉన్న వారిని దొంగల్లా చూస్తున్నారు. డబ్బు కట్టి వైద్యం చేయించుకోమంటున్నారు. ప్రభుత్వం ఇందుకు కేటాయించాల్సిన డబ్బు ఇవ్వనందునే సమస్య వచ్చింది. ఇటీవల ఓ విశ్రాంత ఉద్యోగి చికిత్స చేయించుకుంటే కార్డు పని చేయలేదు. రూ.6 లక్షలు కట్టి బయటకు రావాల్సి వచ్చింది. ప్రభుత్వం మాత్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. ఉద్యోగులు హెల్త్‌కార్డుల కోసం కట్టిన డబ్బు రూ.కోట్లలోనే ఉంది. ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల వైద్యానికి డబ్బు కేటాయించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement