స్మార్ట్ ప్రణాళిక రూపొందించాలి
కడప సెవెన్‌రోడ్స్: స్మార్ట్ విలేజ్, వార్డు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి వెంటనే తమకు పంపాలని కలెక్టర్ కేవీ రమణ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. స్మార్ట్ అమలుకు ప్రభుత్వం 60 రోజుల కాల వ్యవధి ఇచ్చిందన్నారు. ఈలోపు గ్రామ, వార్డులను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సాధ్యమైనంత మేరకు నీటి రవాణాను తగ్గించాలన్నారు. పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధుల కొరత లేనందున వెంటనే పనులు చేపట్టాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 12 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 15 వేలు ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ఇస్తామని తెలిపారు. ఇసుక పాలసీపై కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని మండలాల్లో అనుకున్నదాని కన్న తక్కువ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోందన్నారు.
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మండలాల్లో ఇసుక కోసం ఆర్డర్లు చాలా తక్కువ వచ్చాయన్నారు. కొత్తగా అనుమతించిన క్వారీలలో ఏడు రీచ్‌లను వారం రోజుల్లోగా ప్రారంభిస్తున్నామన్నారు. చెక్‌పోస్టులు ఏ ప్రాంతాల్లో అవసరమో తమకు వివరాలు పంపాలన్నారు. పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నందున మాపింగ్ పంపాలన్నారు. మార్పు కార్యక్రమం ద్వారా మాతా శిశు మరణాల రేటు తగ్గించాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ రామారావు మాట్లాడుతూ ఇ-పాస్‌పుస్తకాలు మ్యూటేషన్లు, సర్కారు భూమి, కోర్టు కేసులు, జమాబందీ లెక్కలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలో 48 మండలాలు కరువు కింద ప్రకటించినందున ఉపాధి హామీ ద్వారా కూలీలకు పనులు కల్పించాల్సి ఉందన్నారు. ఇన్‌ఛార్జి ఏజేసీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ఒక మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించినందున అవసరమైన భూమి వివరాలను వెంటనే పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, రాఘవరావు, ఎల్‌డీఎం రఘునాథరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.