జలరవాణా మార్గమంతా ఆధునికీకరించాలి | Water transport to modernize the way | Sakshi
Sakshi News home page

జలరవాణా మార్గమంతా ఆధునికీకరించాలి

Published Mon, Dec 22 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

జలరవాణా మార్గమంతా  ఆధునికీకరించాలి

జలరవాణా మార్గమంతా ఆధునికీకరించాలి

రెండు సంస్థలకు సర్వే బాధ్యతలు
వంతెనలు, లాకులు, అప్రోచ్ రోడ్లు తిరిగి నిర్మించాలి
10 మిలియన్ టన్నుల సరుకు రవాణా
ఐడబ్ల్యూఏఐ ఇంజినీర్ల అభిప్రాయం

 
విజయవాడ : రాష్ట్రంలో జల రవాణా మార్గమంతా ఆధునికీకరించాలని భారత అంతర్గత జలరవాణా సాధికార సంస్థ(ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఐడబ్ల్యూఏఐ) చీఫ్ ఇంజినీర్ ఎస్.దండపత్, సీనియర్ హైడ్రోగ్రాఫిక్  సర్వేయర్ టివి ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వారిద్దరూ ఆదివారం ఉదయం నీటిపారుదల శాఖ కార్యాలయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో జాతీయ జలమార్గం(ఎన్‌డబ్ల్యూఏ-4) గురించి చర్చించారు. అనంతరం దండపత్, ప్రసాద్‌లు ‘సాక్షి’తో మాట్లాడుతూ జలరవాణా గురించి వివరించారు.

కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు...

బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే భద్రాచలం నుంచి పుదుచ్చేరి వరకు 1,095 కిలో మీటర్ల మేర జలరవాణా మార్గం ఉండేది. ఆ తర్వాత కాలంలో దీన్ని ఉపయోగించకపోవడం, కాల్వలు ఆక్రమణలకు గురికావడం వల్ల జలరవాణా మార్గం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం జలరవాణా వల్ల ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఎన్‌డబ్ల్యూఏ-4పై దృష్టి సారించింది. ఇప్పటికే మూడు జలరవాణా మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో మార్గం అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. గోదావరి నది ప్రాంతంలో 171 కి.మీ, కాకినాడ కాల్వలో 50 కి.మీ. ఏలూరు కాల్వలో 139 కి.మీ., కృష్ణానది ప్రాంతంలో 157 కి.మీ., గుంటూరు జిల్లా కొమ్మనూరు కాల్వలో 113 కి.మీ., ఉత్తర బకింగ్‌హాం కాల్వలో 316 కి.మీ., దక్షిణ బకింగ్‌హాం కాల్వలో 110 కి.మీ. పుదుచ్చేరిలో 22 కి.మీ పొడవునా జలరవాణా సాగుతోంది.

 ప్రకాశం బ్యారేజీ నుంచి నెల్లూరు వరకు..

 ఉభయగోదావరి జిల్లాల్లో జలరవాణా పనులను పరిశీలించిన ఇంజినీర్ల బృందం శనివారం ప్రకాశం బ్యారేజీ నుంచి నెల్లూరు వరకు గల జలరవాణా మార్గాన్ని కూడా పరిశీలించింది. ఈ మార్గంలో కాల్వలు, వంతెలు, లాకులను పరిశీలించిన ఇంజినీర్లు ప్రస్తుత అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవని నిర్ధారించారు. బ్రిటిష్ కాలంలో చిన్నబోట్లలో సరుకు రవాణా చేసినందున వారి అవసరాలకు తగినట్టుగా కాల్వలు నిర్మించారు. కొన్నేళ్లుగా ఆక్రమణల కారణంగా కాల్వలు కుంచించుకుపోయాయి. ప్రస్తుతం 500 టన్నుల వరకు సరుకు రవాణా చేసే పెద్ద బోట్లు ఈ మార్గంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాల్వలు విస్తరించాల్సిన అవసరం ఉంది. జలరవాణాకు కాల్వల వెడల్పు 32 మీటర్లు ఉండాలి. అయితే ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద కేవలం 6 మీటర్లు మాత్రమే వెడల్పు ఉంది. నెల్లూరు, కృష్ణపట్నం వద్ద ఈ వెడల్పు ఇంకా తక్కువగా ఉంది. కాల్వలో 2 నుంచి 2.5 మీటర్ల లోతు నీరు ఉండాలి. కొన్నిచోట్ల 1.2 మీటర్లు మాత్రమే ఉంది. కాల్వల్లో లాకులు 12 మీటర్లు ఉండాల్సి ఉండగా, 6 మీటర్లే ఉన్నాయి. వంతెనలు వాటర్ లెవెల్ నుంచి 5 మీటర్లు ఎత్తులో ఉండాలి. కానీ, 3 మీటర్లు ఎత్తులోనే ఉన్నాయి. కాల్వల వద్దకు వెళ్లేందుకు కొన్నిచోట్ల అప్రోచ్ రోడ్లు కూడా లేవు. వీటిని ఏర్పాటుచేయాలి. అవసరమైన చోట జట్టీలు నిర్మించాలి.

రెండు సంస్థలు సర్వే

జలరవాణా చేయడానికి కాల్వల్లో చేపట్టాల్సిన మరమ్మతుల గురించి సర్వే చేసే బాధ్యతను రెండు సంస్థలకు వాటర్‌వేస్ అధికారులు అప్పగించారు. విజయవాడ నుంచి పెదగంజాం వరకు ఒడిశాలోని గోబెల్ ఇన్‌ఫోటెక్‌కు, పెదగంజాం నుంచి కృష్ణపట్నం వరకు కోల్‌కతాలోని పెసిషన్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఏడాది మేలోపు ఈ సంస్థలు సర్వే చేసి నివేదికను అందజేస్తాయి. ఆ తర్వాత టెండర్లు పిలిచి కాల్వల ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తారు. జలరవాణా మార్గానికి సుమా రు రూ.1,515 కోట్లు అవసరమవుతుందని అంచనా. విడుదలైన నిధులను బట్టి విడతల వారిగా పనులు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్గాన్ని పునరుద్ధరిస్తే ఏడా దికి 10 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయవచ్చని అంచనావేస్తున్నారు. జలరవాణా పనులు పూర్తికావడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. జల రవాణాను అభివృద్ధి చేయడం వల్ల సింగరేణి కాలరీస్ నుంచి కొత్తగూడేనికి బొగ్గును, కాకినాడ పోర్టు నుంచి ఫెర్టిలైజర్లు, భద్రాచలం అడవుల్లో లభించే కలపను పేపర్ మిల్లులకు, కోస్తా జిల్లాలో పండించే ధాన్యం, పప్పుధాన్యాలను రవాణా చేసే అవకాశం ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement