గోదావరిపై మళ్లీ జల రవాణా
- నౌకాయానం పునరుద్ధరణకు ప్రయత్నాలు: మంత్రి తుమ్మల
- సామర్లకోట-బకింగ్‌హామ్ కెనాల్ వరకు నౌకాయానం
సాక్షి, హైదరాబాద్: గోదావరిపై మళ్లీ జల రవాణా (నౌకాయానం)ను పునరుద్ధరించేం దుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వాతంత్య్రానికి పూర్వం వెంకటాపురం- చెన్నై వరకు గోదావరిలో జల రవాణా జరిగేదని ఆయన గుర్తుచేశారు. దుమ్ముగూడెం, ధవళేశ్వరం, కృష్ణా కెనాల్, కృష్ణా బ్యారేజీ తదితర మార్గాల మీదుగా జల రవాణా సాగేదన్నారు. అత్యంత తక్కువ ధరలతో, కాలుష్య రహితంగా రవాణా అవసరాలు తీర్చే జల రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇన్ ల్యాండ్ వాటర్ వే బిల్లును తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
సామర్లకోట-బకింగ్‌హామ్ కెనాల్ వరకు గోదావరిపై జల రవాణా సౌకర్యం ప్రవేశపెట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారన్నారు. గోదావరి పుష్కరాలు, రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులపై మంత్రి తుమ్మల సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు.
అనంతరం ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మతో కలసి విలేకరులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని తుమ్మల పునరుద్ఘాటించారు. స్నానఘాట్లకు మరమ్మతులు చేయడంతోపాటు అవసరమైన సంఖ్యలో కొత్త ఘాట్లను నిర్మిస్తున్నామన్నారు. భక్తుల ప్రయాణాలకు ఉపయుక్తంగా నాణ్యతా ప్రమాణాలతో రహదారుల నిర్మాణాన్ని జూన్‌లోగా పూర్తి చేస్తామన్నారు.
కేజ్ వీల్స్‌తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో రహదారులకు రూ. 6 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా అందులో రూ. 3 వేల కోట్లను పాత రోడ్ల మరమ్మతులకే వెచ్చించాల్సి వస్తోందని తుమ్మల చెప్పారు. రోడ్లు ధ్వంసం కాకుండా రక్షించుకుంటే అనవసర వ్యయాన్ని నిర్మూలించవచ్చన్నారు. ట్రాక్టర్లను కేజ్ వీల్స్‌తో రోడ్లపైకి తెచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.