కుందూ నది ద్వారా నెల్లూరుకు వెళ్తున్న నీరు
కోవెలకుంట్ల: ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి భారీగానే వరద నీరు చేరింది. ఈ నీటితో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతుల అవసరాల నిమిత్తం ఈ జిల్లాల్లోని రిజర్వాయర్లు నింపకుండానే రాష్ట్ర ప్రభుత్వం నీటి తరలింపునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు తరలించేందుకు సిద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ నది ద్వారా శుక్రవారం నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని తరలిస్తోంది. దీనివల్ల రానున్నరోజుల్లో రెండు జిల్లాల రైతులకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది.
గోరుకల్లు, అవుకు నింపకుండానే..
జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ సామర్థ్యం 13 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్ సామర్థ్యం 4.8 టీఎంసీలు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల సాధారణ నీటిమట్టం చేరితే ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తారు. ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీల నీటిని కేటాయించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 870 అడుగులకు పైగా నీరు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల క్రాస్ ద్వారా నీటి విడుదల జరుగుతోంది. ఇక్కడి నుంచి ఎస్సార్బీసీకి 1,300 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా.. 400 క్యూసెక్కులు అవుకు రిజర్వాయర్‌కు, 100 క్యూసెక్కులు గోరుకల్లుకు చేరుతున్నాయి. బైపాస్ కెనాల్ ద్వారా 1,200 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. ఈ నీరు కుందూనదిలో చేరుతోంది.
నది ద్వారా నెల్లూరు జిల్లాకు తరలిపోతోంది. పంట పొలాలకు సాగునీటి పేరుతో ఎస్సార్బీసీ ద్వారా నీటి విడుదల జరుగుతుండగా ప్రస్తుతం రైతులు కొద్దిమేర మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఈ నీరంతా తిరిగి కుందూలో చేరి నెల్లూరు తరలిపోతోంది. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపకుండా పంట పొలాలకు సాగునీటి పేరుతో నెల్లూరుకు తరలిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ రిజర్వాయర్లలో నీరు లేక సాగునీటి సమస్య తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం గోరుకల్లులో 1.2 టీఎంసీల(డెడ్ స్టోరేజీ) నీరు మాత్రమే ఉంది. రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకు సాగునీరు అందించేందుకు ఎస్సార్బీసీకి నీటి కేటాయింపులు జరగ్గా.. ఇప్పటి నుంచే నీటిని విడుదల చేసి ¯ð నెల్లూరు జిల్లాకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కుందూ నది ద్వారా దాదాపు 10 టీఎంసీల నీటిని నెల్లూరు జిల్లాకు తరలించాలన్న దిశగా.. రోజుకు రెండువేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు.
గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపాలి:
శ్రీశైలం జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున జిల్లాలోని గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపిన తర్వాతే నెల్లూరుకు తరలించాలి. ఈ రిజర్వాయర్లు నింపకుండా నీటిని తరలిస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది. గోరుకల్లులో కనీసం ఐదు టీఎంసీలు, అవుకులో మూడు, వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్‌లో ఐదు, మైలవరంలో నాలుగు టీఎంసీల నీరు నింపితే రెండు జిల్లాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. కామని వేణుగోపాల్‌రెడ్డి,రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీకోఆర్డినేటర్, కోవెలకుంట్ల
Comments
Please login to add a commentAdd a comment