లవ్‌ ఫెయిల్యూరా?.. సంతానం లేదా? బాబాను కలవండి  | Mumbai: Hundreds Of Ad Stickers Appearing On Local Trains | Sakshi
Sakshi News home page

లవ్‌ ఫెయిల్యూరా?.. సంతానం లేదా? బాబాను కలవండి 

Published Thu, Jul 1 2021 12:36 AM | Last Updated on Thu, Jul 1 2021 12:36 AM

Mumbai: Hundreds Of Ad Stickers Appearing On Local Trains - Sakshi

దాదర్‌: ప్రేమ విఫలమయిందా? వ్యాపారంలో నష్టపోతున్నారా? సంతానం లేదా? అయితే మీ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తాం, అందుకు ఈ బాబాను సంప్రదించండి అంటూ లోకల్‌ రైళ్లలో ప్రకటనల స్టిక్కర్లు వందలాదిగా దర్శనమిస్తున్నాయి. అనుమతి లేకున్నా పలువురు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో కూడిన స్టిక్కర్లు రైళ్లలో అంటించి పోతున్నారు. ఇలాంటి ప్రకటనల స్టిక్కర్లు, పోస్టర్ల వల్ల అమాయక ప్రయాణికులు సంప్రదించడం, ఆపై మోసపోవడం షరా మామూలుగా జరుగుతోంది. రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) బలగాలు లోకల్‌ రైళ్లలో అక్రమంగా రాకపోకలు సాగించే వారిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పట్టించుకునే నాథుడే లేకపోవడంతో మాంత్రిక బాబాల పోçస్టర్లు, స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

కొత్త బోగీలపైనా.. 
నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రైల్వే బోగీలలో, రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో, ప్లాట్‌ఫారాలపై ఎలాంటి ప్రకటన బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు అంటించరాదు. కానీ, రైల్వే నిర్లక్ష్యం వల్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పాత ఐసీఎఫ్‌ బోగీలతోపాటు కొత్తగా వచ్చిన బాంబార్డియర్‌ కంపెనీ రైల్వే బోగీలలో మాంత్రిక బాబాల ప్రకటనల స్టిక్కర్లు అంటించిన దృశ్యాలు దాదాపు అన్ని రైళ్లలో కనిపిస్తున్నాయి. ప్రేమ విఫలం కావడం, వ్యాపారంలో నష్టాలు, ఇంటిలో గొడవలు, భార్య, భర్తల మధ్య ఘర్షణలు, సంతానం లేకపోవడం తదితర సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తామంటూ, అందుకు ఫలాన బాబాను సంప్రదించాలని ప్రకటనల స్టిక్కర్లు, పోస్టర్లు అంటిస్తున్నారు. స్టిక్కర్లపై బాబా పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా, సంప్రదించు వేళలు తదితర వివరాలుంటున్నాయి. తమ మంత్రశక్తులతో మీ సమస్యలు మటుమాయం చేస్తామని ధైర్యంగా రాస్తున్నారు. వీటికి ఆకర్షితులైన అమాయక ప్రయాణికులు ఇలాంటి నకిలీ బాబాలను సంప్రదించి మోసపోతున్నారు. తొలుత వందల్లో, ఆ తరువాత వేలల్లో, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే లక్షల్లో డబ్బులు గుంజుతారు. బాధితులు చివరకు మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తారు. అప్పటికే ఈ నకిలీ బాబాలు అక్కడి నుంచి జారుకుంటారు.  

లాక్‌డౌన్‌ అనంతరం.. 
గతంలో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ మాంత్రిక బాబాలపై చర్యలు తీసుకోవడంతో స్టిక్కర్లు, పోస్టర్లు అంటించే బెడద తగ్గిపోయింది. కాని కరోనా కారణంగా అమలుచేసిన లాక్‌డౌన్‌తో లోకల్‌ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో లోకల్‌ రైళ్లలో రద్దీ అంతంగా ఉండటం లేదు. దీంతో ధైర్యంగా స్టిక్కర్లు, పొస్టర్లు అంటించి జారుకుంటున్నారు. ఇలాంటి స్టిక్కర్లను అర్ధరాత్రి దాటిన తరువాత అంటిస్తున్నారు. దీంతో రైల్వే పోలీసులకు చిక్కడం లేదు. అనుమతి లేకున్నా అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న సామాన్యులపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. స్టిక్కర్లు అంటిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. వీరి నిర్వాకంవల్ల బోగీలన్నీ వికృతంగా కనిపిస్తున్నాయి. పోస్టర్లకు, స్టిక్కర్లకు జిగురు (గమ్‌) చాలా పట్టించడం వల్ల తొలగించడానికి వీలులేకుండా పోతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement