Local trains
-
గుడ్ న్యూస్ : ముంబైలో 300 కొత్త లోకల్ రైళ్లు, మెగా టెర్మినల్
ముంబై, సాక్షి: ముంబై రైల్వే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ పథకాలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 300 కొత్త అదనపు లోకల్ రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు వసాయ్‌లో భారీ రైల్వే టెరి్మనల్‌ను నిర్మించనున్నట్లు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ముంబై సెంట్రల్ అలాగే వెస్ట్రన్ సబర్బన్ రైల్వే లైన్లలో ప్రతిరోజు 3,200 రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో సెంట్రల్ రైల్వేలో 40 లక్షల మంది, పశి్చమ రైల్వేలో 35 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే, భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కొత్త లోకల్ రైళ్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వసాయ్‌లో మెగా టెర్మినల్ ముంబై రైల్వే హబ్‌లపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు వసాయ్ ప్రాంతంలో ఒక మెగా రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది సబర్బన్ అలాగే సుదూర రైళ్లకు సర్వీసులు అందించడమే కాకుండా, ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యమైన ఇతర అభివద్ధి పథకాలు: తూర్పు భారతదేశంతో కనెక్టివిటీ: ముంబై పోర్ట్ కనెక్టివిటీ మెరుగుపరచడానికి ప్రత్యేక కారిడార్‌ను రూపొందించనున్నారు. కీలక టెర్మినల్స్: విస్తరణ: పరేల్, ఎల్టీటీ, కల్యాణ్, పన్వేల్ టెరి్మనల్స్ సామర్థ్యాన్ని పెంచి ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నారు. సెంట్రల్ అలాగే బాంద్రా టెర్మినల్స్: అభివృద్ధి: పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ హబ్‌ల సామర్థ్యాన్ని విస్తరించనున్నారు. జోగేశ్వరి, వసాయ్ టెర్మినల్స్: ఈ కొత్త టెరి్మనల్స్ సబర్బన్ ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నాయి. వచ్చే ఐదేళ్లలోపు పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులు ముంబై నగరానికి రైల్వే కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి దోహదపడతాయి. ఈ అభివృద్ధి లక్షలాది మంది ప్రజల జీవన ప్రమాణా లను మెరుగుపరచడంతో పాటు ముంబైని తూర్పు రాష్ట్రాలకు మరింత సమీపంగా తీసుకువస్తాయి. ఈ చర్యలు ముంబై మహానగరాన్ని ఒక శక్తివంతమైన రైల్వే కేంద్రంగా మార్చడమే కాకుండా, ప్రజల కోసం మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
South Central Railway: వందే భారత్ సరే... ఇంటర్సిటీ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: సుమారు పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు, లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఆరు కిలోమీటర్ల మేర అదనపు సదుపాయం అందుబాటులోకి వచ్చినా రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఠంచన్‌గా కేంద్ర బడ్జెట్ మాత్రం వచ్చిపోతూనే ఉంది. కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం రెడ్ సిగ్నలే పడడం గమనార్హం. రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణలో భాగంగా స్టేషన్ల ఆధునికీకరణ వంటి కొన్ని లాభదాయకమైన ప్రాజెక్టులు మినహాయించి లక్షలాది మంది ప్రయాణికలు ఆధారపడిన కొత్త రైళ్లు, లైన్ల విస్తరణకు మాత్రం నిధులు లభించడం లేదు. మరో వారం పది రోజుల్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసే ఎంపీల సమావేశం కూడా ఈసారి ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రవేశపెట్టనున్న కేంద్రబడ్జెట్లో హైదరాబాద్ ప్రజల రైల్వే ప్రయాణ అవసరాలు ఏ మేరకు ప్రతిబింబిస్తాయనే సందేహంగా మారింది. మరోవైపు గతంలో ప్రారంభించిన పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు మధ్య ఏర్పడిన పీటముడి కారణంగా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. వందే భారత్ సరే...ఇంటర్సిటీ ఏదీ... సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రూ.100 నుంచి రూ.150 వరకు చార్జీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వందేభారత్‌లో ప్రయాణం చేయాలంటే వరంగల్ వరకు కనీసం రూ.450 చెల్లించాలి. సికింద్రాబాద్ నుంచి నేరుగా విశాఖకు వెళ్లే ప్రయాణికులకు కూడా చార్జీలు భారమే అయినా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొంటే భారత్ ప్రయోజనకరమే. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ప్యాసింజర్లుగా నడిచిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా పేరు మార్చి చార్జీలు పెంచారు. అదే సమయంలో హాల్టింగ్ స్టేషన్లను తగ్గించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్సిటీ రైళ్లను పెంచాలనే ప్రతిపాదన ఆచరణకు నోచడం లేదు. వందేభారత్ కంటే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన ఇంటర్సిటీ, ప్యాసింజర్ రైళ్లను ఈ బడ్జెట్లోనైనా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రెండో దశకు పన్నెండేళ్లు .... రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే నగరంలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యతనివ్వాలని అప్పట్లో కేంద్రం భావించింది, ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. మొదటిదశలో పట్టాలెక్కిన రైళ్లు తప్ప కొత్తగా ఒక్క రైలు కూడా అందుబాటులోకి రాలేదు.పైగా గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటిని 78కి తగ్గించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల ఆధునికీకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. తాజాగా భారత్ అమృత్ స్టేషన్స్ పథకం కింద హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, లింగంపల్లి స్టేషన్లను గుర్తించారు. మిగతా 23 స్టేషన్లలో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు వంటివి కూడా తగినన్ని లేకపోవడం గమనార్హం. సుమారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు స్టేషన్లతో అనుసంధానమయ్యే రెండో దశ వల్ల రవాణా సదుపాయాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఆరు మార్గాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మూడు లైన్లు మాత్రం పూర్తయ్యాయి. ఈ మార్గాల్లో నడిపేందుకు రైళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. నగరంలో నాలుగో టర్మినల్‌గా భావించే చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌పైన ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఒక్క స్టేషన్ నుంచే రోజుకు 200 రైళ్లు నడుస్తున్నాయి. పుణ్యక్షేత్రాలకు రైళ్లు లేవు.. నగరం నుంచి యాదాద్రికి వెళ్లేందుకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాయగిరి స్టేషన్ అభివృద్ధికి మాత్రం రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. లక్షలాది మంది భక్తులు సందర్శించే యాదాద్రికి ఎంఎంటీఎస్ లేకుండా కేవలం స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అది అలంకారప్రాయమే కానుంది. -
మృత్యు శకటాలు.. 8 నెలల్లో రైలు నుంచి పడి 415 మంది మృతి
సాక్షి, ముంబై: ముంబైకర్లకు లైఫ్ లైన్‌గా పేరుగాంచిన లోకల్ రైళ్లు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. గడచిన ఎనిమిది నెలల్లో సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాలలో నడుస్తున్న రైళ్ల నుంచి కిందపడి ఏకంగా 415 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇదే ఎనిమిది నెలల్లో మూడు రైల్వే మార్గాలపై 1,605 మంది వివిధ కారణాలవల్ల మరణించినట్లు ముంబై లోకల్ రైల్వే పోలీసు రికార్డుల్లో నమోదైంది. అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రైలు నుంచి కిందపడి, వివిధ కారణాలవల్ల మొత్తం 2,020 మంది మరణించినట్లు స్పష్టమవుతోంది. కరోనా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసింది. దీంతో ముంబై జనజీవనం యథాతథంగా గాడిన పడింది. కాని లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ గతంతో పోలిస్తే లోకల్ రైళ్లలో ప్రతీరోజు 20 లక్షల మంది ప్రయాణికులు తగ్గిపోయారని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో రద్దీ తగ్గిపోయి డోరు బయట వేలాడే వారి సంఖ్య తగ్గిందని రైల్వే పోలీసులు అంటున్నారు. మరోపక్క ఏసీ లోకల్ రైళ్లు ప్రవేశపెట్టడం వల్ల వాటి డోర్లు మూసుకోవడంతో రైలు నుంచి కిందపడే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. కాని వాస్తవ పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో (సబర్బన్ రైల్వే స్టేషన్లలో మరియు చుట్టుపక్కల), రైలు సర్వీసులు లేవని భావించి, లైన్లు దాటడం ద్వారా ప్రజలు షార్ట్ కట్లను తీసుకుంటారని, ఇదే ప్రమాదానికి కారణమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ఇలాంటి అనేక ప్రమాదాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. అయితే, రైల్వే లైన్లలో మరణాలకు అక్రమ ఎంట్రీ పాయింట్లే కారణమని పౌరులు పేర్కొంటున్నారు. ‘రైల్వేలు రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిపే ట్రాక్‌ల మధ్య కంచెలు వేయాలి, ట్రాక్ క్రాసింగ్‌ల సంఖ్యను తగ్గించాలి. రద్దీ, నడుస్తున్న రైళ్ల నుండి పడిపోయే వ్యక్తుల సమస్యను తగ్గించడానికి లోకల్ రైళ్ల తలుపులు మూయడం లాంటి మరిన్ని ప్రయోగాలు చేయాలి’ అని వారు అంటున్నారు. ఒకప్పుడు లోకల్ రైళ్లలో ఉదయం, సాయంత్రం వేళ్లలో మాత్రమే విపరీతంగా రద్దీ ఉండేది. ఇంటికి తొందర చేరుకోవాలనే తపనతో డోరు వద్ద వేలాడుతూ ప్రయాణించేవారు. కాని ఇప్పుడు అనేక ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్ధలు తమ ఉద్యోగులకు వేర్వేరు షిప్టుల్లో విధులు అప్పగించడంతో పగలు కూడా రద్దీ ఉంటుంది. ఫలితంగా పనులకు చేరుకునే సమయంలో, విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వేలాడుతూ ప్రయాణించక తప్పడం లేదు. దీంతో ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో నడుస్తున్న రైలు నుంచి కందపడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగినట్లు స్పష్టమైతోంది. ముఖ్యంగా రైలు పట్టాలు దాటుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య మొదటి స్ధానంలో ఉండగా రైలు నుంచి పడి మృతి చెందుతున్నవారి సంఖ్య రెండో స్ధానంలో ఉంది. ఎనిమిది నెలల్లో వివిధ కారణాలవల్ల మొత్తం 1,605 మంది మృతి చెందగా, అందులో పట్టాలు దాటుతూ 767 మంది మృతి చెందిన వారున్నారు. రైల్వే పోలీసులు అందించిన వివరాల ప్రకారం 2019 జనవరి నుంచి ఆగస్టు వరకు నడుస్తున్న రైలు నుంచి కిందపడి 405 మంది మృతి చెందగా అంతే సంఖ్యలో గాయపడ్డారు. అదేవిధంగా 2020లో అదే ఎనిమిది నెలల్లో 306 కిందపడి గాయపడగా 142 మంది మరణించారు. 2021లో 244 మంది గాయపడగా 142 మృతి చెందారు. కాని 2022లో ఎనిమిది నెలల్లో రైలు పట్టాలు దాటుతూ 767 మంది మృతి చెందగా 140 గాయపడ్డారు. గడచిన ఎనిమిది నెలల్లో లోకల్ రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల కిందపడి గాయపడిన, మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మృతుల్లో, గాయపడిన వారిలో పురుషులే ఎక్కువ ఉన్నారు. కాగా ఈ ఎనిమిది నెలల్లో లోకల్ రైలు నుంచి కిందపడి 642 మంది గాయపడగా 415 మంది చనిపోయారు. మృతుల్లో 38 మంది మహిళలుండగా 377 మంది పురుష ప్రయాణికులున్నారు. -
కూ.. చుక్ చుక్ రైలు వచ్చేది ఎప్పుడో..
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు ఎప్పుడు మోక్షం లభిస్తుందా అని నగరవాసులు నిరీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు పచ్చజెండా లభించినా టెండర్ల ప్రక్రియ దశలోనే ఉంది. సుమారు రూ. 15,700 కోట్ల ఖర్చుతో అతి భారీ ప్రాజెక్టు అయిన సబర్బన్ రైల్వే యోజనకు ఆరంభంలోనే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. బెంగళూరు ట్రాఫిక్ రద్ధీని తగ్గించడంతో పాటు నగర శివార్లను సులభంగా కలిపేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. నాలుగు ప్రాంతాలకు అనుసంధానం.. ► సబర్బన్ రైల్వే ప్రాజెక్టు పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) మోడల్లో చేపట్టారు. మొత్తం 148.17 కిలోమీటర్ల దూరంలో నాలుగు ప్రత్యేక కారిడార్లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ► బెంగళూరు–దేవనహళ్లి (41.40 కి.మీ.), బైయ్యప్పనహళ్లి–చిక్కబాణవర (25.01 కి.మీ.), కెంగేరి–బెంగళూరు కంటోన్మెంట్ (35.52 కి.మీ.), హీలలిగే– రాజనుకుంటే (46.24 కి.మీ.) రూట్లతో నగరవాసుల ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ► ఈ ప్రాజెక్టులో మొత్తం 62 స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 101.7 ఎకరాల భూమి అవసరం. ఈ భూమి స్వాధీనం కోసం రూ. 1,419 కోట్ల ఖర్చు అవుతుంది. కేటాయింపులు ఈ విధంగా.. ప్రాజెక్టు నిధులను 20 శాతం చొప్పున కేంద్ర రాష్ట్రాలు భరించి, మిగతా 60 శాతాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. కర్ణాటక ప్రభుత్వం రూ. 5,087 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 3,242 కోట్లు ఇస్తాయి. రుణం ద్వారా రూ. 7,438 కోట్లను తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ దశలో ఉంది. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఆకర్షణీయ హామీగా మారిందే తప్ప సాకారం అయ్యేదెన్నడు అనే ప్రశ్న వినిపిస్తోంది. చదవండి: భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం! -
లోకల్ రైళ్లలో అందరినీ అనుమతించండి
సాక్షి, ముంబై: ముంబైకర్ల సహనం కట్టలు తెంచుకోకముందే లోకల్ రైళ్లలో సామాన్యులందరికి ప్రయాణాలకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా అందరికోసం లోకల్ రైళ్లు ప్రారంభిస్తే ఎంతో మంచిదని ఆ లేఖలో పేర్కొన్నారు. సాధారణ ప్రజానీకం సహనం నశించకముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తరువాత లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పేద, సామాన్య ప్రజలు, కూలీలు, కార్మికులు, కష్టజీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రూ.100–150 బస్సు చార్జీలు చెల్లించే ఆర్థిక స్థోమత లేక సతమతం అవుతున్నారు. దీంతో అనేక మంది విధులకు వెళ్లలేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. ప్రస్తుతం ముంబైలోని దాదాపు అన్ని కార్యాలయాలు, షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అందరికి ఇంటి నుంచి విధులు నిర్వహించే సౌకర్యం లేదు. లోకల్ రైళ్లలో అనుమతి లేకపోవడంతో శివారు ప్రాంతాల నుంచి ముంబైకి విధులకు రావాలంటే చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, రాష్ట్రంలో ఇంకా లాక్డౌన్ కొనసాగింపుపై రాజ్ ఠాక్రే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లాక్డౌన్ ఇంకా ఎన్ని నెలలు అమలులో ఉంటుంది..? గత ఏడాదిన్నర నుంచి సామాన్యులు, పేదలు లోకల్ రైలు సేవలను ఉపయోగించుకోలేక పోతున్నారు. గంటల తరబడి రోడ్డు మార్గం ద్వారా ముంబైకి చేరుకుంటున్నారు. బస్సుల్లో అనుమతిస్తున్నప్పటికీ రద్దీ విపరీతంగా ఉంటోంది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. రద్దీవల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమూ లేకపోలేదు. వారి సహనం, ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే లోకల్ రైళ్లలో అనుమతించాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. లాక్డౌన్ పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అర్ధరాహిత్యమని ఆ లేఖలో రాజ్ ఠాక్రే విమర్శించారు. ప్రభుత్వానికి లాక్డౌన్ అమలు చేయడం తప్ప ఇతర ప్రత్యామ్నాయ ఆలోచనలు రావడం లేదా అంటూ నిలదీశారు. ‘ఇదివరకే ముంబైకర్లందరి కోసం లోకల్ రైలు సేవలు ప్రారంభించాల్సి ఉంది. జాప్యం జరిగినప్పటికీ ప్రజలు ఎంతో సహనం పాటించారు. ఇక వారి ఓపిక నశించి ఉండవచ్చు’అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా వ్యవహరించని పక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. లోకల్ రైళ్లలో అనుమతించాలని డిమాండ్ చేస్తూ సామాన్యులు, కూలీలు, కష్టజీవులు, ఇతర ప్రయాణికులు ఆందోళనలు చేపడితే ఎమ్మెన్నెస్ వారికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అందరినీ కాకుండా కనీసం కరోనా రెండు డోసుల టీకాలు తీసుకున్న వారినైనా లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని రాజ్ ఠాక్రే ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. -
లవ్ ఫెయిల్యూరా?.. సంతానం లేదా? బాబాను కలవండి
దాదర్: ప్రేమ విఫలమయిందా? వ్యాపారంలో నష్టపోతున్నారా? సంతానం లేదా? అయితే మీ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తాం, అందుకు ఈ బాబాను సంప్రదించండి అంటూ లోకల్ రైళ్లలో ప్రకటనల స్టిక్కర్లు వందలాదిగా దర్శనమిస్తున్నాయి. అనుమతి లేకున్నా పలువురు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో కూడిన స్టిక్కర్లు రైళ్లలో అంటించి పోతున్నారు. ఇలాంటి ప్రకటనల స్టిక్కర్లు, పోస్టర్ల వల్ల అమాయక ప్రయాణికులు సంప్రదించడం, ఆపై మోసపోవడం షరా మామూలుగా జరుగుతోంది. రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాలు లోకల్ రైళ్లలో అక్రమంగా రాకపోకలు సాగించే వారిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పట్టించుకునే నాథుడే లేకపోవడంతో మాంత్రిక బాబాల పోçస్టర్లు, స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త బోగీలపైనా.. నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రైల్వే బోగీలలో, రైల్వే స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్‌ఫారాలపై ఎలాంటి ప్రకటన బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు అంటించరాదు. కానీ, రైల్వే నిర్లక్ష్యం వల్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పాత ఐసీఎఫ్ బోగీలతోపాటు కొత్తగా వచ్చిన బాంబార్డియర్ కంపెనీ రైల్వే బోగీలలో మాంత్రిక బాబాల ప్రకటనల స్టిక్కర్లు అంటించిన దృశ్యాలు దాదాపు అన్ని రైళ్లలో కనిపిస్తున్నాయి. ప్రేమ విఫలం కావడం, వ్యాపారంలో నష్టాలు, ఇంటిలో గొడవలు, భార్య, భర్తల మధ్య ఘర్షణలు, సంతానం లేకపోవడం తదితర సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తామంటూ, అందుకు ఫలాన బాబాను సంప్రదించాలని ప్రకటనల స్టిక్కర్లు, పోస్టర్లు అంటిస్తున్నారు. స్టిక్కర్లపై బాబా పేరు, ఫోన్ నంబరు, చిరునామా, సంప్రదించు వేళలు తదితర వివరాలుంటున్నాయి. తమ మంత్రశక్తులతో మీ సమస్యలు మటుమాయం చేస్తామని ధైర్యంగా రాస్తున్నారు. వీటికి ఆకర్షితులైన అమాయక ప్రయాణికులు ఇలాంటి నకిలీ బాబాలను సంప్రదించి మోసపోతున్నారు. తొలుత వందల్లో, ఆ తరువాత వేలల్లో, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే లక్షల్లో డబ్బులు గుంజుతారు. బాధితులు చివరకు మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తారు. అప్పటికే ఈ నకిలీ బాబాలు అక్కడి నుంచి జారుకుంటారు. లాక్డౌన్ అనంతరం.. గతంలో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ మాంత్రిక బాబాలపై చర్యలు తీసుకోవడంతో స్టిక్కర్లు, పోస్టర్లు అంటించే బెడద తగ్గిపోయింది. కాని కరోనా కారణంగా అమలుచేసిన లాక్‌డౌన్‌తో లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో లోకల్ రైళ్లలో రద్దీ అంతంగా ఉండటం లేదు. దీంతో ధైర్యంగా స్టిక్కర్లు, పొస్టర్లు అంటించి జారుకుంటున్నారు. ఇలాంటి స్టిక్కర్లను అర్ధరాత్రి దాటిన తరువాత అంటిస్తున్నారు. దీంతో రైల్వే పోలీసులకు చిక్కడం లేదు. అనుమతి లేకున్నా అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న సామాన్యులపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. స్టిక్కర్లు అంటిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. వీరి నిర్వాకంవల్ల బోగీలన్నీ వికృతంగా కనిపిస్తున్నాయి. పోస్టర్లకు, స్టిక్కర్లకు జిగురు (గమ్) చాలా పట్టించడం వల్ల తొలగించడానికి వీలులేకుండా పోతున్నాయి. -
Mumbai: బ్యాడ్‌న్యూస్.. లోకల్ రైలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, ముంబై: సామాన్యులకు లోకల్ రైళ్లలో ప్రవేశించేందుకు అనుమతి ఇప్పట్లో లభించే అవకాశాలు కన్పించడం లేదు. భయాందోళనలు సృష్టిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌తోపాటు థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినం చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి సామాన్య ప్రయాణికులకు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతి లభించేలా కన్పించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజ మార్గదర్శకాలనుసారం లోకల్ రైళ్లలో కేవలం అత్యవసర సేవలందించే వారి జాబితాలో ఉన్నవారికే అనుమతి కొనసాగనుందని తెలుస్తోంది. పాజిటివ్ కేసులు తగ్గినా.. సెకండ్ వేవ్‌లో ముంబైతోపాటు మహారాష్ట్రను హడలెత్తించిన కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. థానేతోపాటు పలు జిల్లాల్లో పాజిటివ్ రేట్ 5 శాతం కంటే తక్కువ కావడంతో ఆంక్షలన్నీ ఎత్తివేశారు. దీంతో తొందర్లోనే లోకల్ రైళ్లలో అందరికీ ప్రయాణించేందుకు అనుమతి లభించనుందని భావించారు. దీనిపై అధికారులు కూడా రెండు మూడు రోజులలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటనలు చేశారు. కాని అంతలోనే డెల్టా వేరియంట్ రాష్టంలో ప్రవేశించింది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా నిపుణులు చెప్పే డెల్టా వేరియంట్‌తో రత్నగిరి జిల్లాల్లో ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. దీంతోపాటు థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయని, అలాగే ఈ థర్ఢ్ వేవ్‌లో సుమారు 50 లక్షల మంది కరోనా బారిన పడే అవకశాలున్నాయని రాష్ట ఆరోగ్య శాఖ పేర్కొంది. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి ఆంక్షలను కఠినం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లోకల్ రైళ్లలో సామాన్య ప్రజలకు ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుందని భావించిన వారి ఆశలు ఆడియాశలే అయ్యాయి. వచ్చే నెలలో లోకల్ రైళ్లల్లో ప్రయాణించేందుకు సామాన్యలకు అవకాశాలు లేనట్టేనని తెలుస్తోంది. 80 లక్షల మంది ప్రయాణించే లోకల్ రైళ్లలో ప్రస్తుతం అత్యవసర సేవలందించే వారికి అనుమతిస్తున్నారు. దీంతో ప్రతి రోజులు ప్రస్తుతం సుమారు 22 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలకు అనుమతించినట్లయితే ప్రయాణికుల రద్దీపై నియంత్రణ బాధ్యతల విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని తెలిసింది. అయితే ఈ సారి మాత్రం కరోనా కేసులు కూడా కొంత మేర తగ్గుతుండటంతో తొందర్లోనే అందరికీ అను మతి లభించే అవకాశాలున్నాయని అందరు భావించారు. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్గదర్శకాలతో మరికొన్ని రోజులపాటు వేచి చూడాల్సి రానుంది. కరోనా మూడో దఫా (థర్డ్ వేవ్) వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్ సంక్రమణకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు అన్ని విధాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చదవండి: Delta Variant: మళ్లీ కఠిన ఆంక్షలు -
డ్రోన్లతో శాంతి భద్రతల పర్యవేక్షణ
సాక్షి, ముంబై: లోకల్ రైల్వే పరిధిలో నేరాలను నిరోధించేందుకు డోన్ల ద్వారా నిఘా వేయాలని, శాంతి భద్రతలు పర్యవేక్షించాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ముంబై రీజియన్ పరిధిలోని రైల్వే యార్డులు, వర్క్ షాపులు, రైల్వే స్టేషన్లు, స్టేషన్ బయట రైల్వే హద్దులో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నారు. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ‘నింజా యూఏవీ డ్రోన్’లను కొద్దిరోజుల ముందే కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఒక డ్రోన్ సెంట్రల్ రైల్వే ఆధీనంలోకి వచ్చింది. మరికొన్ని డ్రోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. లోకల్ రైల్వే హద్దులో రైలు పట్టాల వెంబడి అక్కడక్కడ జూదం అడ్డాలున్నాయి. అక్కడ మద్యం సేవించడం, పేకాట ఆడటంలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. వీటితోపాటు వర్క్ షాపులు, యార్డులు, లూప్లైన్లో ఆగి ఉన్న రైలు బోగీల నుంచి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. రైల్వే ట్రాక్‌కు ఆనుకుని ఉన్న మురికివాడల ప్రజలు ఈ చోరీలకు పాల్పడుతున్న వెలుగులోకి వచ్చింది. వర్క్ షాపులు, యార్డుల నుంచి రాత్రి వేళల్లో చోరీలు జరుగుతున్నాయి. అందుకు రైల్వే సిబ్బంది సహకారం ఉంటుందని పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు. అదేవిధంగా రైల్వే ట్రాక్‌లపై, ప్లాటఫారాల పక్కన చెత్త వేయడం, స్టేషన్ బయట రైల్వే హద్దులో అక్రమంగా స్థలం ఆక్రమించుకుని వ్యాపారులు చేసుకోవడం. వచ్చిపోయే ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంతో పాటు వీటన్నింటిపై నిఘా వేయడానికి రైల్వే డ్రోన్ల సాయం తీసుకుంటోంది. పశ్చిమలో కొత్త సీసీటీవీ కెమెరాలు రైల్వే స్టేషన్, పరిసరాల్లో నేరాలను నియంత్రించేందుకు అదనంగా మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే ఇటీవలె నిర్ణయం తీసుకుంది. వీటిని చర్చిగేట్–విరార్ స్టేషన్ల మధ్య లోకల్ రైల్వే హద్దులో ఏర్పాటు చేయనుంది. పాత సీసీటీవీ కెమెరాలు తొలగించి వాటి స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన 2,729 కెమెరాలను అమర్చనున్నారు. దీంతో ఏదైనా నేరం జరిగితే ఈ కెమెరాల ద్వారా దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. రైల్వే పోలీసులు నేరస్తులను సునాయాసంగా పట్టుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ మార్గంలో లోకల్ రైల్వే స్టేషన్ పరిధిలో 1,200 సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిని తొలగించి వాటి స్థానంలో 2,729 అధునాతన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంటే అదనంగా 1,529 సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. తెరపైకి మహిళల భద్రత.. రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులపై ప్రధానంగా మహిళలు, యువతులను ఈవ్‌టీజింగ్ చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటివి జరుగుతున్నాయి. దీంతో మహిళా ప్రయాణికుల భద్రత తెరమీదకు వచ్చింది. ఇదివరకే మహిళ బోగీలలో సీసీటీవి కెమెరాలు బిగించారు. కానీ, అనేక సందర్భాలలో అవి పని చేయకపోవడం, రైలు కదలడం వల్ల అందులో రికార్డయిన వీడియో క్లిప్పింగులు స్పష్టంగా కనిపించకపోవడం లేదా కెమెరాల డైరెక్షన్ మారిపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. దీంతో ప్లాట్‌ఫారాలపై, రైల్వే స్టేషన్ ఆవరణలో అదనంగా మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం గతంలోనే తీసుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కెమరాల వల్ల అందులో రికార్డయిన క్లిప్పింగులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో రైల్వే పోలీసులు ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే నేరస్తులను పట్టుకోవడంలో సఫలీకృతులవుతారు. రైల్వే స్టేషన్, పరిసరాల్లో 2,729 ఆధునిక సీసీటీవీ కెమెరాలు అమర్చడంవల్ల మహిళలతోపాటు సామాన్య ప్రయాణికులకు మరింత భద్రత కల్పించినట్లవుతుందని అధికారులు తెలిపారు. ఆధునిక కెమెరాలు అమర్చే స్టేషన్లు బోరివలి (అత్యధికంగా)–325, ముంబై సెంట్రల్ టెర్మినస్–315, బాంద్రా టెర్మినస్–170, అంధేరీ–192, చర్చిగేట్–157, గోరేగావ్–137, జోగేశ్వరీ–136, కాందివలి–116, బోయిసర్–115, దహిసర్–113 స్టేషన్లతోపాటు మెరైన్ లైన్స్, చర్నిరోడ్, గ్రాంట్రోడ్, మహాలక్ష్మి, లోయర్ పరేల్, ప్రభాదేవి, దాదర్, మాటుంగా, మాహీం, బాంద్రా, ఖార్, శాంతకృజ్, విలేపార్లే, రామ్‌మందిర్, మలాడ్, మీరారోడ్, భాయిందర్, నాయ్‌గావ్, నాలాసోపారా, విరార్ స్టేషన్లలో నూతన కెమెరాలు అమర్చనున్నారు. -
బాప్రే! రైలెక్కితే రూ.5.. ఎక్కకపోతే రూ.50
సాక్షి, ముంబై: రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అలోచించాలని, ప్లాట్ఫారం చార్జీలు పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపడం సరైన పద్దతి కాదని రైల్వేపై ప్రయాణికుల సంఘటనలు మండిపడుతున్నాయి. లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కనీస టికెట్ చార్జీ రూ.5 ఉండగా కేవలం ప్లాట్ఫారం టికెట్‌కు రూ.50 ఎలా వసూలు చేస్తున్నారని ప్రయాణికుల సంఘటన నిలదీసింది. ప్లాట్ఫారం టికెట్‌పై రైళ్లలో ప్రయాణించేందుకు అవకాశమే లేదని, అయినప్పటికీ రూ.50 వసూలు చేయడమేంటని సంఘటన ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. రూ.5 చెల్లించి లోకల్ రైలు టికెట్ తీసుకుని ప్లాట్‌ఫారంపై వెళ్లడం గిట్టుబాటవుతుందని కొందరు భావిస్తున్నారని తెలిపింది. కాగా, రద్దీని నియంత్రించే మార్గం ఇదికాదని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అలోచించాలని రైల్వే అధికారులకు సూచించారు. మార్చి నుంచే అమలు.. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రద్దీగా ఉండే ప్రముఖ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ), దాదర్ టర్మినస్, కుర్లా టెర్మినస్, బాంద్రా టర్మినస్, ముంబై సెంట్రల్ తదితర ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్లాట్‌ఫారాల చార్జీలు ఐదు రేట్లు పెంచింది. మొన్నటి వరకు రూ.10 ఉన్న ప్లాట్ఫారం చార్జీలను మార్చి ఒకటో తేదీ నుంచి ఏకంగా రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అయితే రద్దీని నియంత్రించడానికి ప్రత్నామ్యాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది. కాని స్వగ్రామాలకు, పర్యటనకు, పుణ్య క్షేత్రాలకు బయలుదేరే తమ బంధువులను సాగనంపేందుకు స్టేషన్‌కు వచ్చే వారి నుంచి ఇలా భారీగా ప్లాట్ఫారం చార్జీల వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని సంఘటన ప్రశ్నించింది. త్వరలో వేసవి సెలవులు, శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. పెద్ద సంఖ్య జనాలు స్వగ్రామాలకు, పర్యాటక ప్రాంతాలకు బయలుదేరుతారు. పిల్లపాపలు, వృద్ధులు, వికలాంగులు, భారీ లగేజీతో స్టేషన్‌కు వస్తారని తెలిపింది. వారిని సాగనంపేందుకు ఒకరిద్దరు దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు వస్తారని, కానీ, ప్లాట్ఫారం చార్జీలు రూ.50 చొప్పున వసూలు చేయడంవల్ల అనేక మంది స్టేషన్ బయట నుంచి తిరిగి వెళ్లిపోతున్నారని సంఘటన గుర్తుచేసింది. కాగా, రైల్వేస్టేషన్స్‌లో ప్రయాణికులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారని, జనాల రద్ధీని తగ్గించేందుకు రైల్వే ప్లాట్ఫారం టికెట్ల ధరలు పెంచేసి యాభై రూపాయలు చేసింది. ఈ పెంచిన ధరలు జూన్ 15 వరకు అమలులో ఉంటాయని మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి శివాజీ సుతార్ ఇదివరకే తెలిపారు. రద్దీని తగ్గించేందుకే రేట్లను పెంచామని చెప్పారు. చదవండి: (వారంపాటు లాక్డౌన్.. కుటుంబాలు రోడ్డున పడతాయి) -
హైదరాబాద్ ఎంఎంటీఎస్‌పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్... సిటీజనులకు అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి లోకల్ ట్రైన్. 2003లో పాతబస్తీలోని ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి స్టేషన్ల నుంచి లింగంపల్లి వరకు ఒక ‘లైఫ్‌లైన్’గా మొదలైన ఎంఎంటీఎస్ రైలు కరోనా కారణంగా మొట్టమొదటిసారి నిలిచిపోయింది. ఇక అన్‌లాక్ తర్వాత మెట్రో రైళ్లు, సిటీ బస్సులను పునరుద్ధరించారు. ముంబయి లోకల్ రైళ్లు మూడు నెలల క్రితమే పట్టాలెక్కాయి. కానీ ఎంఎంటీఎస్ మాత్రం 9 నెలలుగా నిలిచిపోయింది. అంతేకాదు. గ్రేటర్ హైదరాబాద్‌ని శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 8 ఏళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ సైతం ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. కోవిడ్ సాకుతో ఒకవైపు ఇప్పటికే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు పూర్తవుతాయా అనే సందేహం నెలకొంది. అక్కడ అలా... ఇక్కడ ఇలా... లాక్‌డౌన్‌తో అన్ని దూరప్రాంత రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులను మార్చి 23వ తేదీ నుంచి నిలిపివేశారు. నిబంధనల సడలింపు తరువాత దశలవారీగా 200 రెగ్యులర్ రైళ్ల స్థానంలో సుమారు 72 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించారు. ఇదే సమయంలో ముంబయి, కోల్కత్తా వంటి నగరాల్లో రాకపోకలు సాగించే లోకల్ రైళ్లలో 50 శాతానికి పైగా నడుస్తున్నాయి. నగరంలో లింగంపల్లి–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి స్టేషన్ల మధ్య నడిచే 121 రైళ్లలో ఇప్పటి వరకు ఒక్క సర్వీసును కూడా పునరుద్ధరించకపోవడం గమనార్హం. ఈ 9 నెలల్లో ఎంఎంటీఎస్ రైళ్లపైన దక్షిణమధ్య రైల్వే రూ.కోటి వరకు ఆదాయాన్ని కోల్పోయింది. కానీ అంతకంటే ముఖ్యంగా కేవలం రూ.15 టిక్కెట్‌తో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం నగరవాసులకు దూరమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎంఎంటీఎస్ రైళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెలవారీ పాస్‌లపైన రాకపోకలు సాగించే సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఆ సదుపాయానికి దూరమయ్యారు. రెండో దశపైన ప్రతిష్టంభన... ఎనిమిదేళ్ల క్రితం 2013లో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. పటాన్చెరు, ఘట్కేసర్,మేడ్చెల్, ఉందానగర్, శంషాబాద్,తదితర నగర శివార్లను కలుపుతూ చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో ఇప్పటి వరకు తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 5.75 కిలోమీటర్లు, బొల్లారంమేడ్చెల్ (14 కిలోమీటర్లు) మాత్రం పూర్తయ్యాయి. బొల్లారంసికింద్రాబాద్ మధ్య రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు కూడా పూర్తి చేసి రైళ్లు నడిపేందుకు అనుకూలమేనని సర్టిఫికెట్ ఇచ్చింది. సుమారు రూ.850 కోట్ల అంచనాలతో 88.05 కిలోమీటర్ల మేర రెండో దశ కింద చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన సుమారు రూ.500 కోట్లు అందకపోవడం వల్లనే బోగీల కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడిందనీ, దాంతో పూర్తయిన మార్గాల్లో రైళ్లను నడుపలేకపోతున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కానీ రైళ్ల ప్రైవేటీకరణ కారణంగానే కొత్త ప్రాజెక్టులపైన నిర్లక్ష్యం కొనసాగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లడం కష్టమే!) -
ఇప్పట్లో లోకల్ రైళ్లు లేనట్లే..
ముంభై: కరోనా అన్‌లాక్ ప్రక్రియ మొదలై అన్ని మెల్లమెల్లగా తెరుచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రజా రవాణా సౌకర్యాలు తెరచుకున్నాయి. అయితే ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకూ లోకల్ రైళ్లు పట్టాలెక్కలేదు. ఇది సామాన్య ప్రజలకి భారంగా మారుతోంది. నూతన సంవత్సర వేడుకల తర్వాత సబర్బన్ లోకల్ రైళ్లలో ప్రయాణికులను అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఓ ప్రకటన చేశారు. అయితే రెండు రోజుల అనంతరం అలాంటిదేమీ లేదని సీనియర్ అధికారులు స్పష్టం చేశారు. క్రిస్మస్ తరువాత స్థానిక రైళ్లపై ప్రభుత్వం నిర్ణయించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయని, అయితే, దీనిపై ఎటువంటి స్పష్టత లేదన్నారు. లోకల్ రైళ్లను నడిపే అవకాశం ఇప్పట్లో లేదని సీనియర్ అధికారులు వెల్లడించారు. అయితే, ప్రయాణికుల సంఖ్యను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలు వంటిదని అధికారులు తెలిపారు. కాగా కోవిడ్ నేపథ్యంలో రైళ్లు నడిపే విషయంలో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు. రైళ్లు తీసుకెళ్లే సామర్థ్యం కంటే అధికంగా ప్రయాణికులను తీసుకు వెళుతుంటాయి. అయితే ఇప్పుడు సామర్థ్యం కంటే సగంమంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇవ్వాలనుకుంటున్నాం. అయితే దీన్ని అమలు చేయడం చాలా కష్టమని సీనియర్ అధికారి పేర్కొన్నారు. -
లోకల్ రైళ్లల్లో పిల్లలకు నిషేధం
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లల్లో చిన్న పిల్లలతో కలసి ప్రయాణం చేయడంపై రైల్వే నిషేధం విధించింది. అత్యవసర విధులు నిర్వహించే వారి కోసం ప్రారంభించిన లోకల్ రైళ్లలో, ప్రస్తుతం పలు విభాగాలకు చెందిన ప్రయాణికులందరినీ ప్రయాణం చేసేందుకు అనుమతించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించింది. ఈ క్రమంలో చాలా మంది మహిళలు తమ పిల్లలతో కలసి లోకల్ రైళ్లలో ప్రయాణిస్తుండటం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో చిన్న పిల్లలతో లోకల్ ప్రయాణం ప్రమాదకరమని, పిల్లలతో కలసి లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలను రైళ్లల్లో అనుమతించబోమని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళలు మాత్రమే లోకల్ రైళ్లల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం ఇకపై ముంబైలోని రైల్వే స్టేషన్లో గేట్ల వద్ద ఆర్పీఎఫ్ జవాన్లను మోహరించనుంది. -
ముంబైలో పవర్ కట్
ముంబై: ముంబై సోమవారం విద్యుత్ అంతరాయంతో స్తంభించింది. ఉదయం 10 గంటలపుడు సంభవించిన ఈ పరిణామంతో లోకల్ రైళ్లు ఎక్కడివక్కడే ఆగాయి. భవనాల్లో లిఫ్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో లక్షలాది మంది ఇళ్లలో ఉండి అందించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్, ఇతర అత్యవసర రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల కోసం డీజిల్ జనరేటర్లను యంత్రాంగం తరలించాల్సి వచ్చింది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటలకు సేవలను క్రమక్రమంగా పునరుద్ధరించగలిగింది. కాగా, ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యుత్, తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యుత్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశమై, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్ అంతరాయం ఘటనపై తక్షణం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ(ఎంఎస్ఈటీసీఎల్)కు చెందిన కల్వా– ఖర్ఘార్ సబ్స్టేషన్లలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో అంతరాయం ఏర్పడిందని విద్యుత్ మంత్రి నితిన్ తెలిపారు. లోడ్ భారమంతా మోస్తున్న రెండో సర్క్యూట్లో లోపం తలెత్తడమే ఇందుకు కారణమన్నారు. కల్వా సబ్‌స్టేషన్ వరకు విద్యుత్‌ను తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర విద్యుత్ సంస్థది కాగా, అక్కడి నుంచి టాటా, అదానీ సంస్థలు నగరానికి సరఫరా చేస్తుంటాయన్నారు. ముంబైతోపాటు సబర్బన్‌లోని థానే, పన్వెల్, డోంబివిలి, కల్యాణ్‌లో విద్యుత్ అంతరాయం తలెత్తింది. కంపెనీలు, సంస్థల్లో మాదిరిగా బ్యాక్–అప్ సౌకర్యం లేని ఇళ్లలోని లక్షలాది మంది ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’ సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయడంతో కోవిడ్ వైద్య కేంద్రాల్లోని వారి కోసం డీజిల్ జనరేటర్లను, సినిమా షూటింగ్‌ల కోసం వాడే మొబైల్ డీజిల్ జనరేటర్లను తెప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పని చేయించేందుకు ఏర్పాటు చేసిన రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి పనిచేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని ఓ అధికారి వివరించారు. -
రైళ్లను కబ్జా చేస్తున్న బ్యాగులు!
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో లోపలికి దూరేందుకు స్థలం లభించకపోవడానికి ప్రధాన కారణం ప్రయాణికులు తమ భుజాలకు వేసుకున్న బ్యాగులేనని ఓ రైల్వే అధికారి వెల్లడించారు. భుజానికి వెనక వేలాడుతున్న ఒక్కో బ్యాగు ఒక ప్రయాణికుడి స్థలం ఆక్రమించుకుంటోందని అధ్యయనంలో తేలిందని ఆయన స్పష్టంచేశారు. సుమారు 200 మంది నిలబడే చోట బ్యాగుల కారణంగా వంద మంది నిలబడి ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీంతో రద్దీ సమయంలో లోపలికెళ్లేందుకు స్థలం లేక బయటే వేలాడాల్సి వస్తోందని అన్నారు. మరణాలకూ దారితీస్తోంది! లోకల్ రైళ్లలో రద్దీ కారణంగా డోరు దగ్గర వేలాడుతున్న వారిలో ప్రతీ రోజు సగటున ముగ్గురు కింద పడి మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకు కారణం లోపలికేందుకు చోటు లభించకపోవడమే. సాధారణంగా ఒక్కో లోకల్ రైలులో రెండు వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. కానీ, ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఈ సంఖ్య ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఉంటుంది. నడిచే రైలులోంచి కిందపడి మృతి చెందుతున్న వారి సంఖ్య ఈ సమయంలోనే అధికంగా ఉంటుంది. ప్రయాణికుల భుజాలకు బ్యాగులు వేసుకోవడంవల్ల అదనంగా స్థలం ఆక్రమించుకుంటుందని అధికారులు నిర్ధరణకు వచ్చారు. దీంతో ప్రయాణికులు తమ బ్యాగులు భుజాలకు వేలాడదీయకుండా లగేజీ ర్యాక్‌పై పెట్టాలని తరుచూ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రయాణికుల్లో మార్పు రావడం లేదు. సీట్లపై కూర్చుండేవారు ర్యాక్‌పై బ్యాగులు పెట్టడంవల్ల ర్యాక్‌లు ఫుల్ అవుతున్నాయి. ఇక నిలబడిన ప్రయాణికులు భుజాలపై బ్యాగులు ఉంచుకోక తప్పడం లేదు. దీంతో అదనంగా స్థలం ఆక్రమించుకుంటుంది. సీటు కింద కూడా ఖాళీ స్థలం ఉంటుంది. కానీ, అక్కడ పెట్టడానికి ముఖం చాటేస్తారు. బ్యాగులు భుజాలకు వేసుకోవద్దని, ర్యాక్‌పై పెట్టాలని, సాధ్యమైనంత వరకు చిన్న బ్యాగులు వెంట తెచ్చుకోవాలని తరుచూ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కానీ, ముంబైకి వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య జనాలతోపాటు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల్లో అధిక శాతం దూరప్రాంతాల నుంచి వచ్చేవారుంటారు. రెండున్నర నుంచి మూడున్నర గంటలు ప్రయాణ సమయం పడుతుంది. దీంతో ఆ బ్యాగుల్లో లంచ్ బాక్స్, సాయంత్రానికి అల్పహార బాక్స్, వాటర్ బాటిళ్లు, ల్యాప్‌టాప్, ఇతర కీలకమైన పత్రాలు, వర్షా కాలంలో గొడుగు తదితరాలుంటాయి. దీంతో బ్యాగు వెంట తెచ్చుకోవడం మినహా మరో ప్రత్నామ్నాయ మార్గం లేదు. సెంట్రల్, హార్బర్, పశి్చమ మార్గంలోని లోకల్ రైళ్లలో నిత్యం రాకపోకలు సాగించే వారిలో దాదాపు వంద మందిలో 90 శాతం ప్రయాణికుల వద్ద బ్యాగులుంటాయి. ఈ బ్యాగుల కారణంగా రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ వెంట తీసుకురాక తప్పడం లేదని ప్రయాణికులు అంటున్నారు. దొంగతనాలకు ఆస్కారం.. లోకల్ రైల్వే హద్దులో గడచిన ఆరేళ్లలో ప్రయాణికుల నుంచి రూ.8.28 కోట్లు విలువచేసే సొత్తు చోరీకి గురైందని పోలీస్ రికార్డుల్లో నమోదైన కేసులను బట్టి తెలిసింది. రైల్వే స్టేషన్లు, రైలు బోగీల్లో రద్దీగా ఉంటుండటంతో దొంగలు కూడా చోరీలు సులువుగా చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ చోరీ సంఘటనలు చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. షకీల్ అహ్మద్ షేక్ అనే సామాజిక కార్యకర్త 2013 నుంచి 2018 కాలం వరకు లోకల్ రైల్వే హద్దులో ఎన్ని చైన్ స్నాచింగ్, చోరీ కేసులు నమోదయ్యాయో వివరాలు వెల్లడించాలని రైల్వే పోలీసులను కోరారు. వారి రికార్డుల్లో నమోదైన కేసుల్లో మొత్తం రూ.8,28,24,860 విలువచేసే సొత్తు చోరీకి గురైందని పోలీసులు వెల్లడించారు. ఆరేళ్లలో మొత్తం 2643 కేసులు నమోదుకాగా అందులో 860 పరిష్కరించారు. అదేవిధంగా రైల్వే పోలీసులు నేరస్తుల నుంచి రూ.3,32,39,921 విలువచేసే సొత్తు రికవరీ చేసుకున్నారు. ప్రయాణికుల భద్రతలో భాగంగా రైల్వే బోర్డు ప్లాట్‌ఫారాలపై, స్టేషన్ ఆవరణలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆరీ్పఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసు (జీఆరీ్ప) ఇలా వివిధ పోలీసు దళాలలను మోహరించింది. అయినప్పటికీ నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. కాగా, రైల్వేలో రద్దీ తగ్గితే దొంగతనాలకు చెక్పడే అవకాశం సైతం ఉంది. డోరువద్ద వేలాడుతు మరణించిన వారి సంఖ్య.. (జనవరి నుంచి జూన్ వరకు) సెంట్రల్ రైల్వే మార్గంలో–202 మృతి చెందగా అందులో 184 పురుషులు, 18 మహిళలున్నారు. పశ్చిమ మార్గంలో–302 మృతి చెందగా 278 మంది పురుషులుండగా 24 మంది మహిళలున్నారు. -
సిటీ పోలీసులకు ‘లోకల్’ ఉచితం
సాక్షి, ముంబై : డ్యూటీలో ఉన్న ముంబై (సిటీ) పోలీసులకు లోకల్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లభించనుంది. అందుకు ఈ నెలాఖరు వరకు ముంబై పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అయితే ఈ ఒప్పందం కేవలం ఒక సంవత్సరం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తరువాత పొడగించాలా..? వద్దా...? అనేది నిర్ణయం తీసుకుంటారు. ఆర్పీఎఫ్కు సాయం చేస్తారని.. గతేడాది ఎల్ఫిన్‌స్టోన్ రోడ్–పరేల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగిన తరువాత కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులకు లోకల్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించాలనే విషయంపై ముంబై పోలీసు కమిషనర్, గోయల్ మధ్య చర్చ జరిగింది. ‘‘కొద్ది కాలంగా లోకల్ రైళ్లలో నేరాల సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ బలగాలకు తోడుగా ముంబై పోలీసుల సహకారం ఉంటే అధిక శాతం నేరాలు అదుపులోకి వస్తాయి. అందుకు ముంబై పోలీసులకు లోకల్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తే వారు డ్యూటీకి వచ్చేటప్పుడు, డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్లేటప్పుడు లోకల్ రైళ్లలో ప్రయాణిస్తారు. దీంతో అత్యవసర సమయంలో వీరి సాయం వెంటనే లభిస్తుంది. అంతేగాకుండా ప్లాట్‌ఫారాలపై, రైళ్లలో చోరీచేసే చిల్లర దొంగలకు, నేరస్తులకు కొంత భయం పట్టుకుంటుంది. ఫలితంగా నేరాలు కొంతమేర అదుపులోకి వస్తాయి’’ అని ముంబై కమిషనర్ అభిప్రాయపడ్డారు. యూనిఫార్మ్ కచ్చితం.. కమిషనర్ ప్రతిపాదనకు గోయల్ అప్పట్లో ప్రాథమికంగా అంగీకరించడంతో ప్రతిపాదన రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆ మేరకు ముంబై పోలీసులకు ఏ బోగీలో ప్రయాణించేందుకు అనుమతివ్వాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే సివిల్ డ్రెస్‌లో కాకుడా ఒంటిపై యూనిఫార్మ్ కచ్చితంగా ఉండాలనేది ప్రధాన షరతు. అప్పుడే చిల్లర దొంగలు, నేరస్తులు భయపడతారు. ప్రస్తుతం సెంట్రల్, పశ్చిమ మార్గంలోని అన్ని లోకల్ రైళ్లలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళా బోగీలలో రైల్వే పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఇక ముంబై పోలీసులు కూడా రాకపోకలు సాగిస్తే శాంతి, భద్రతలు కొంత అదుపులో ఉంటాయని ముంబై పోలీస్ కమిషనర్ భావిస్తున్నారు. ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దిన తరువాత ప్రత్యక్షంగా అమలులోకి వస్తుందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. -
సెల్‌రేగిపోతున్నారు..
పిఠాపురం : పిఠాపురంలో కొందరు దొంగలు ‘సెల్’రేగిపోతున్నారు. నెమ్మదిగా వెళుతున్న రైళ్లలో గేట్ల వద్ద ఉన్న ప్రయాణికుల చేతుల్లో సెల్ఫోన్లను లాక్కొని పారిపోతున్నారు. ఆటోలు మోటారు సైకిళ్లపై వెళుతున్న ప్రయాణికుల జేబుల్లో సెల్ఫోన్లు రెప్పపాటులో ఎగరేసుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. ఆదమరిచి ఉంటే చాలు రైల్లో ఉన్నా, మోటారు సైకిల్‌పై ఉన్నా, ఆటోలో ఉన్నా సెల్ఫోన్లు చిటికెలో మాయమవుతున్నాయి. మంగళవారం సామర్లకోట నుంచి వస్తున్న ఒక రైలులో డోరు వద్ద కూర్చొని తన(రూ 60 వేల విలువైన) సెల్ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను పిఠాపురం గోర్స రైల్వే గేటు దగ్గరకు వచ్చే సరికి కొందరు యువకులు చాకచక్యంగా తస్కరించారు. గేమ్ ఆడుకుంటున్న యువకుడి చేతిపై కర్రతో కొట్టడంతో సెల్ ఎగిరిపడగా దానిని అందుకున్న ఆ దొంగలు సెల్ అందుకుని పరారయ్యారు. షాక్‌కు గురైన ఆ యువకుడు తేరుకున్న తరుకున్న తరువాత తన స్నేహితుడి ద్వారా పిఠాపురం పోలీసులకు సమాచారమిచ్చాడు. అయితే అప్పటికే ఆ దొంగలు పరారయ్యారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రెండు రోజుల క్రితం రోడ్డు పక్క ఓ వ్యక్తి గాయాలతో ఉండడం చూసి ఒక ఆటో డ్రైవరు తన ఆటోను ఆపి దెబ్బలు తగిలిన వ్యక్తి దగ్గరకు వచ్చి చూసి మళ్లి ఆటో దగ్గరకు వెళ్లే సరికి తన జేబులో ఉన్న సుమారు రూ.17 వేల విలువైన సెల్‌ఫోన్ మాయమైందని బాధితుడు లబోదిబోమంటూ పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ప్రతిరోజూ పదికి పైగా సెల్ఫోన్లు పోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పిఠాపురం రథాలపేట, ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు చెడు వ్యసనాలకు బానిసలై ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారిపై నిఘా ఉంచారు. -
హోలీ.. వికృత కేళి!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో హోలీ పండుగ వికృత చేష్టలకు తెరతీసింది. దీంతో కొంత మంది గాయాలపాలయ్యారు. కొందరు ఆకతాయిలు వెళ్తున్న రైళ్లపై రంగు నింపిన వాటర్ బెలూన్లును విసురుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. ములుండ్ సమీపంలోని లోకల్ రైలు మొదటి తరగతి మహిళల కోచ్ వద్ద పోలీసులు భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వారిపై వాటర్ బెలూన్లను విసిరారు. ట్రాక్ పక్కన నివసిస్తున్న కొందరు గ్రూప్‌లుగా ఏర్పడి ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు కుర్లా, సియోన్, బాంద్రాల్లోనూ చోటుచేసుకున్నాయని తెలిపారు. సాధారణ దుస్తులు ధరించి మఫ్టిలో తాము డ్యూటీ చేశామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. ములుండ్ ప్రాంతాన్నే కొందరు టార్గెట్‌గా చేసుకొని ఈ పనికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితులను తాము గుర్తించామని, త్వరలో వారిని పట్టుకుంటామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పలువురికి గాయాలు.. హోలీ ఆడుతున్న ఆనందంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. కుర్లా ప్రాంతంలో నివసిస్తున్న రామ్ దుబే (28) హోలీ ఆడుతూ గేట్ మధ్యలో వేలు ఇర్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సియోన్ ఆస్పత్రికి తరలించారు. వడాలకు చెందిన మరో వ్యక్తి వాటర్, రంగులు నింపిన బెలూన్లను కుక్కపై విసరడంతో అది అతనిపై దాడి చేసి గాయపరిచింది. వెంటనే అతన్ని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటివి 17 కేసులు నమోదయ్యాయని ఆ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 17 కేసుల్లో 12 కంటికి సంబంధించినవని తెలిపారు. మరోవైపు సియోన్ ఆస్పత్రిలో కూడా 20, నాయర్ ఆస్పత్రిలో 2 కేసులు నమోదైయ్యాయని పేర్కొన్నారు. హోలీ నింపిన విషాదం పుణే: హోలీ పండుగ ఓ కుటుంబంలో విషాదం నింపింది. హోలీ ఆడుతూ బస్సు నుంచి కింద పడి సతీశ్ కాంబ్లె (14) అనే విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం, కాంబ్లె కుటుంబం పుణేలోని లక్ష్మీ నారాయణ ప్రాంతంలో నివసిస్తున్నారు. మోజే హై స్కూల్లో సతీశ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్ అయిపోయాక బస్సులో ఇంటికి వస్తున్నాడు. ఆ క్రమంలో బస్సులో స్నేహితులతోపాటు సతీశ్ హోలీ ఆడుతున్నాడు. అందులో కొంత మంది సతీశ్‌పై వాటర్ బెలూన్లు విసిరారు. వాటిని తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు నుంచి కింద పడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
సికింద్రాబాద్, చెన్నైల్లోను ఏసీ లోకల్ రైళ్లు
న్యూఢిల్లీ: త్వరలో కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్ లోకల్ రైల్వే వ్యవస్థలో ఏసీ కోచ్‌లు, ఆటోమెటిక్ డోర్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కొద్ది రోజుల్లో ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో 12 కోచ్‌లతో కూడిన ఏసీ రైలును నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘లోకల్ రైళ్లలో అనేక మార్పులు తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాం. 2019–20 మధ్యలో అన్ని కొత్త ఈఎంయూ రైళ్లలో ఏసీ, ఆటోమెటిక్ డోర్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆ రైళ్లను చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, సికింద్రాబాద్ నగరాల్లోను ప్రవేశపెట్టే ఆలోచనతో ఉన్నాం’ అని తెలిపారు. -
5 నిమిషాల్లో రైల్వే టైంటేబుల్ రూపకల్పన
ముంబై: 5 నిమిషాల్లోనే లోకల్ రైళ్లకు టైం టేబుల్ రూపొందించగల సాఫ్ట్‌వేర్‌ను బాంబే ఐఐటీ అధ్యాపకులు రూపొందించారు. రైలు చేరుకునే సమయానికి పలు స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు ఖాళీ లేకపోవడం తదితర ఇతర సమస్యలకూ ఈ సాఫ్ట్వేర్ పరిష్కారం చూపగలదు. టైం టేబుళ్లను రూపొందించే విధానాన్ని సరళీకరించేందుకు ఐఐటీ అధ్యాపకులు నారాయణ్ రంగరాజ్, మధు బేలూర్లు గత రెండేళ్లుగా కృషి చేసి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి గురువారం ప్రదర్శించారు. ముంబై లోకల్ రైళ్ల కోసం దీనిని రూపొందించినా, చిన్న మార్పులతో దేశంలోని అన్ని లోకల్ రైల్ నెట్‌వర్క్‌లకు అన్వయించుకోవచ్చని తెలిపారు. -
డిస్కవరీలో ముంబై ‘లోకల్’
ముంబై: ముంబైకర్ల లైఫ్ లైన్‌గా ప్రఖ్యాతి చెందిన లోకల్ రైళ్ల చరిత్ర ఈ నెల 7 న ప్రముఖ డిస్కవరీ చానెల్లో ప్రసారం కానుంది. ప్రయాణికుల రాకపోకలు, రైల్వే సేవల తీరు, రైల్వే సిబ్బంది పనితీరు, రైళ్ల సంఖ్య వంటి ముఖ్యమైన విషయాలు ప్రసారం చేయనుంది. అంతేగాకుండా ముంబైలో అత్యంత కీలకమైన, రద్దీ స్టేషన్లలో ఒకటైన ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి ప్రతిరోజు 1,250 రైళ్లు బయలు దేరుతాయి. రోజు 30 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తారు. ప్రతి మూడు నిమిషాలకో లోకల్ రైలు నడపటం ఎలా సాధ్యం..? రైళ్లను సమయానుసారంగా (టైం టేబుల్ ప్రకారం) నడిపేందుకు కృషి చేస్తున్న స్టేషన్ మేనేజరు మొదలుకుని ఆపరేషన్ రూంలోని కంట్రోలర్లు, సిగ్నల్ మెన్, మోటర్‌మెన్ (డ్రైవర్లు), గార్డులు, ప్లాట్‌పాంలపై విధులు నిర్వహించే రైల్వే పోలీసులు, కూలీల వివరాలు, ఇతర అనేక అంశాలు ప్రపంచానికి తెలియజేయనున్నట్లు డిస్కవరీ నెట్ వర్క్ (ఆసియా) కార్యనిర్వాహక ఉపాధ్యాక్షుడు, జీఎం రాహుల్ జొహరీ చెప్పారు. ముంబై లోకల్ రైళ్లే ఎందుకంటే.. రోజూ దాదాపు 70.5 లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఘనత ముంబై లోకల్ రైళ్లు దక్కించుకున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో ప్రయాణికులను చేరవేసే రైల్వే వ్యవస్థ కేవలం ముంబైలో మాత్రమే ఉంది. రోజులో రెండు గంటలు మాత్రమే ఈ రైళ్లకు విరామం ఉంటుంది. ఇందుకే లోకల్ రైళ్లంటే ముంబైకర్లకు ప్రీతి. ఇదే విషయాన్ని గ్రహించిన డిస్కవరీ.. ముంబైకర్ల హృదయాలను దోచుకున్న లోకల్ రైళ్ల చరిత్ర ప్రసారం చేయాలని నిర్ణయించింది. -
మహిళల్లో ఓపిక నశించి పోతుంది
-
రైల్వే స్టేషన్లో తెగిన ఓవర్ హెడ్ వైర్
- థానేలో ఘటన.. పలు లోకల్ రైళ్లు రద్దు - తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు - ఆలస్యంగా ముంబై చేరుకున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సాక్షి, ముంబై: థానేలో శుక్రవారం ఉదయం ఫ్లాట్ నెంబరు రెండు వద్ద ఓవర్‌హెడ్ వైర్ తెగిపోవడంతో కొన్ని లోకల్ రైళ్లు రద్దు కాగా, మరి కొన్ని దారి మళ్లించి నడిపినట్లు అధికారులు తెలిపారు. వైర్ తెగిపోవడంతో స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లతోపాటు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఉదయం 9.53 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది హుటాహుటిన ఓవర్‌హెడ్ వైరుకు మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో థానే రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాం నెంబరు ఒకటి, రెండు, మూడు, నాలుగుపై లోకల్ రైళ్ల సేవలు ఆగిపోయాయి. అనంతరం స్లో లోకల్ రైళ్లన్నింటిని ఫాస్ట్ అప్, డౌన్ ట్రాక్‌లపై మళ్లించి నడిపించారు. సుమారు రెండు గంటల తర్వాత నాలుగో నెంబర్ ఫ్లాట్‌ఫాంపై ముంబై సీఎస్టీ వైపు స్లోలోకల్ రైళ్లను ప్రారంభించారు. మిగిలిన ఫ్లాట్‌ఫాంలపై చాలా సేపు లోకల్ రైళ్లు నడవలేదు. వీటన్నింటి కారణంగా దూరప్రాంతాల నుంచి వచ్చే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా ముంబైకి చేరుకున్నాయి. కల్వా-థానే మధ్య లోకల్ రైలు రద్దు కావడంతో అనేక మంది కాలిబాటన థానే వరకు నడుచుకుంటూ వెళ్లారు. రైలు నిలిపివేయడంపై ప్రయాణికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా థానే రైల్వే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో కోపోద్రిక్తులైన ప్రయాణికులు మోటర్‌మెన్, గార్డులపై దాడి జరిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పాత ఘటనల దృష్ట్యా రైలు నడిపే మోటర్‌మెన్, గార్డుల వద్ద పోలీసులను భద్రత కోసం ఏర్పాటు చేశారు. కాగా, రైళ్లు ఆలస్యంగా నడవడంతోపాటు కొన్నింటిని రద్దు చేయడంతో రద్దీ తీవ్రంగా పెరిగింది. థానే రైల్వేస్టేషన్‌లోని ఐదు, ఆరో నంబరు ఫ్లాట్ఫాంలన్ని ప్రయాణికులతో నిండిపోయాయి. వైర్ తెగిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సీవీఎంల తొలగింపుతో ఇబ్బందులు
- సాఫ్ట్వేర్ ఏజెన్సీ, సీఆర్ఐఎస్ మధ్య సమన్వయ లోపంతోనే.. - ఏటీవీఎంలో టీఈ సౌకర్యం కల్పించాలంటున్న ప్రయాణికులు సాక్షి, ముంబై: లోకల్ రైళ్ల టికెట్ జారీ చేసే కూపన్ వాలిడేటింగ్ మిషన్లను తొలగించడంతో నగర ప్రయాణికులు ఇబ్బందులను గురవుతున్నారు. వాటిని తొలగించడంతో లక్షల మంది ప్రయాణికులు టికెట్ కౌంటర్లు, ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు (ఏటీవీఎం), మొబైల్ టికెటింగ్ వ్యవస్థపై ఆధారపడుతున్నారు. ప్రధానంగా సీజన్ పాస్ హో ల్డర్లు ప్రయాణాన్ని పొడగింపు విషయంలో ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేలో సాఫ్ట్వేర్ ఏజెన్సీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ (సీఆర్ఐఎస్) మధ్య సమన్వయం లోపించడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. ఏటీవీఎంల ద్వారా జర్నీని పొడగించుకునే వెసులుబాటును కల్పించాలని ఏడాది నుంచి వెస్టర్న్ రైల్వే కోరుతున్నట్లు సంబంధిత అధికారి తెలి పారు. ఏటీవీఎం కార్డులను రీఫిల్ చేసుకునే వెసులుబాటును రైల్వే స్టేషన్‌లోని ప్రతి టికెట్ కౌంటర్లో కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఏటీవీఎంలలో జర్నీ పొడగించుకునే వెసులుబాటు కల్పించాలనే సూచనలు అందుతున్నాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. సీఆర్ఐఎస్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కాని కొన్ని కారణాల వల్ల ఇందులో జాప్యం జరుగుతోందని తెలిపింది. వెస్టర్న్ రైల్వేలో దాదాపు 450, సెంట్రల్ రైల్వేలో 600 ఏటీవీఎంలు ఉన్నా యి. నగరంలో ఉన్న ప్రతి ఏటీవీఎంలలోనూ అధికారులు మొబైల్ టికెటింగ్ వెసులుబాటు కల్పించారు. ఈ విధానాన్ని కేంద్ర రైల్వే మం త్రి సురేశ్ ప్రభు ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతానికి ఈ మిషన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
ముంబై రైల్వే ‘పోలీస్ మిత్ర’
♦ నేరాలు అరికట్టడానికి కొత్త నిర్ణయం ♦ కమిషనర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం ♦ హమాలీలు, స్టాల్స్ యజమానులను చేర్చుకోవాలని నిర్ణయం సాక్షి, ముంబై : లోకల్ రైళ్లు, ప్లాట్‌ఫారాలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ముంబై రైల్వే విభాగం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ‘పోలీసు మిత్ర’ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. రైల్వే కూలీలు, ప్లాట్‌ఫారాలపై ఉపాధి పొందుతున్న తినుబండారాలు, పుస్తకాలు విక్రయించే స్టాల్ యజమానులను పోలీసు మిత్రులుగా చేర్చుకోవాలని నిర్ణయించింది. పథకాన్ని రైల్వే పోలీసు కమిషనర్ మధుకర్ పాండే చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ దీపాలి అంబురే చెప్పారు. లోకల్ రైళ్లలో నేరాల సంఖ్య ప్రస్తుతం బాగా పెరిగింది. రాత్రులందు మహిళల బోగీలలో ప్రత్యేక పోలీసులను నియమించినప్పటికీ ప్లాట్‌ఫారాలు, స్టేషన్ ఆవరణలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే పోలీసుల కొరత కారణంగా అంతట దృష్టి సారించలేకపోతున్నారు. అయితే హమాలీలు, బూట్ పాలీష్ చేసేవాళ్లు, స్టాల్స్ యజమానులు ఎక్కువ కాలం ప్లాట్ఫారాలపైనే ఉంటారు. వచ్చిపోయే ప్రయాణికులపై దృష్టి సారించే ందుకు వీరికి అవకాశం ఎక్కువ. కాబట్టి వీరిలో కొందరిని పోలీసు మిత్రులుగా చేర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. అనుమానితుల కదలికలపై వీరు నిఘా పెడతారు. అనుమానాస్పద బ్యాగులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు. ఫిర్యాదుదారులను నేరుగా పోలీసుల వద్దకు తీసుకెళ్లడం, రహస్య సమాచారం చేరవేయడం లాంటి బాధ్యతలు వీరిపై ఉంటాయి. ప్రతీ ప్లాట్‌ఫారంపై ముగ్గురు, స్టేషన్ ఆవరణలో 10 మందిని పోలీసు మిత్రులుగా నియమించనున్నట్లు అంబురే చెప్పారు. -
త్వరలో ‘ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టమ్’ లోకల్ రైళ్లు
సాక్షి, ముంబై: ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టమ్స్ లోకల్ రైళ్లు త్వరలో నగర వాసులకి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే వారం ప్రయోగాత్మకంగా ఒక బోగీని ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న లోకల్ రైలుకు ఈ బోగీని అమర్చనున్నారు. అయితే తేదీ ఇంకా ఖరారు చేయలేదని పశ్చిమ రైల్వే ప్రజా సంబంధాల అధికారి శరద్ చంద్రాయన్ వెల్లడించారు. రద్దీ సమయంలో నడుస్తున్న లోకల్ రైళ్లలోంచి ప్రయాణికులు కిందపడి మరణించడం, గాయపడటం లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఫుట్ బోర్డుపై ప్రయాణించొద్దని మార్గదర్శక శిబిరాలు నిర్వహించినప్పటికీ మార్పు లేకపోవడంతో ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్డ్ సిస్టం ప్రవేశపెట్టాలని రైల్వే పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముంబైలోని మహాలక్ష్మి వర్క్ షాపులో 12 బోగీలతో కూడిన లోకల్ రైలుకు సాంకేతిక మార్పులు చేస్తున్నారు. వర్క్‌షాపులో నిర్వహించిన పరీక్షలు సఫలీకృతమవడంతో వచ్చేవారం ప్రయోగత్మకంగా ఒక ఖాళీ బోగీ నడపనున్నట్లు చంద్రాయన్ తెలిపారు. బోగీ కంట్రోల్ ప్యానెల్ మోటర్ గార్డు వద్ద ఉంటుందని, డోరు మూసుకున్నాకే రైలు కదులుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నగరంలోని లోకల్ రైళ్లకు ఇలాంటి డోర్లు అమర్చాలంటే సుమారు రూ. 1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 12 బోగీల ఒక్కో రైలుకు రూ. 4.5 కోట్లు ఖర్చవుతుందన్నారు. -
లోకల్ రైళ్లలో పైలట్ ప్రాజెక్టుగా సీసీ కెమెరాలు
ఫలితాలను బట్టిసబర్బన్ రైళ్లలోనూ ఏర్పాటు బోగీకి ఆరు కెమెరాలు...? ముంబై: మహిళల రక్షణ కోసం సబర్బన్, దూరప్రాంత రైళ్లలో సీసీ టీవీలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించడంతో పైలట్ ప్రాజెక్టుగా లోకల్ రైళ్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. లోకల్‌రైళ్లలో సీసీ టీవీలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి, వాటి ఫలితాల ఆధారంగా అన్ని సబర్బన్ రైళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఎంచుకున్న బోగీలలో మాత్రమే వాటిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే రైలు కదిలే సమయంలో సీసీ టీవీల్లో దృశ్యాలు సక్రమంగా నమోదు కావడం ప్రధాన సమస్యగా మారిందని, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. లోకల్ రైళ్లలోని మహిళా బోగీల్లో కనీసం ఆరు కెమెరాలను అమర్చాలని ప్రతిపాదించామని, అయితే ఎన్ని అవసరమవుతాయో బోగీ పొడవుపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ఒక్క బోగీలో కెమెరా అమర్చేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఏజెన్సీ నిర్ణయం తర్వాత టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు. వాటిని ఎక్కడ, ఏ దిశలో అమర్చాలి అనే అంశాలపై ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. మెట్రో రైళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయనున్న ఏజన్సీనే సబర్బన్ రైళ్లలో కూడా సర్వే నిర్వహించనుందని ఆయన వెల్లడించారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేల్లో నడుస్తున్న 215 రైళ్లను పర్యవేక్షించడం కష్టంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముంబై-ఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పెలైట్ ప్రాజెక్టుగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల చెరో సీసీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. -
ఈ సారికింతే...
సాక్షి, ముంబై: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ముంబైకర్లను కొంత నిరాశకు గురిచేసింది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల కోసం కొత్త టెర్మినల్స్‌ను నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించడం నగర ప్రజలకు కొంతలో కొంత ఊరటినిచ్చే అంశం. ఈ టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం లోకల్ రైళ్లపై పడుతున్న అదనపు భారం చాలా వరకు తగ్గిపోనుంది. ఫలితంగా కొత్తగా లోకల్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. నగర విస్తరణ, రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మూడు కొత్త టెర్మినల్స్ నిర్మించాలనే ప్రతిపాదనను పశ్చిమ, సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగాలు రైల్వే బోర్డుకు పంపించాయి. ఇందులో పన్వేల్, ఠాకుర్లీ, వసయిరోడ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో రెండు టెర్మినల్స్‌కు మంజూరు లభించే అవకాశముందని సూచన ప్రాయంగా మంత్రి వెల్లడించారు. పనులు పూర్తిచేసుకుని వినియోగంలోకి వస్తే ముంబైలో లోకల్ రైళ్లపై పడుతున్న దూరప్రాంతాల రైళ్ల భారం చాలా వరకు తగ్గిపోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఐదు టెర్మినల్స్ ఉన్నాయి. జనాభాతో పోలిస్తే ముంబైలో టెర్మినల్స్ సంఖ్య రెట్టింపు ఉండాలి. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబైలో ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్, బాంద్రా, లోక్మాన్య తిలక్ (కుర్లా), ముంబై సెంట్రల్ టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి. వీటికి మరో మూడు అదనంగా చేరితే ముంబై వాసుల సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సెంట్రల్ రైల్వే పన్వేల్, ఠాకుర్లిలో, పశ్చిమ రైల్వే వసయిరోడ్లో టెర్మినల్స్ నిర్మించాలనే ప్రతిపాదనను సంబంధిత బోర్డులు పంపించాయి. గత బడ్జెట్లోనే పన్వేల్‌లో టెర్మినస్, కలంబోలి ప్రాంతంలో రైలు బోగీల నిర్వాహణ, మరమ్మత్తుల కోసం కోచింగ్ టెర్మినస్ నిర్మించాలని మంజూరు లభించినా అది అమలుకు నోచుకోలేదు. అవి ఏర్పాటయ్యుంటే నగరంలోని వివిధ టెర్మినల్స్‌పై భారం తగ్గేది. లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచాలంటే కొత్త టెర్మినల్స్ నిర్మాణం జరగాలి. చాలా సందర్భాలలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను లూప్లైన్లో పెట్టాల్సి వస్తోంది. కొత్త టెర్మినల్స్ ఏర్పాటైతే ఈ సమస్య కొంత మేర కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
ఆశ నిరాశేనా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రజలకు అత్యంత ఆవశ్యకత కలిగిన ప్రయాణం అంటే రైల్వేనేనని ఠక్కున చెప్పవచ్చు. దూర ప్రయాణాలకే కాదు, లోకల్ రైళ్లపై కూడా రాష్ట్ర ప్రజలు అధికంగా ఆధారపడుతున్నారు. చెన్నై, తిరుచ్చి, మధురై, కన్యాకుమారీలను కలుపుతూ 738 కిలోమీటర్ల రైలు మార్గాన్ని డబుల్‌లైన్‌గా విస్తరించాలనే పథకం రాష్ట్ర ప్రజలకే కాక, పర్యాటకులకు సైతం ఎంతో ప్రయోజనకరం. ఈ పథకం వల్ల దక్షిణ రైల్వేకు అధిక ఆదాయం సమకూరడం ఖాయం. చెన్నై-కన్యాకుమారి రైల్వే పథకం తొలి దశ పనులను 2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు. దీంతో చెన్నై నుంచి మదురై వరకు డబుల్‌లైన్ పనులు పూర్తిచేశారు. ఆ తరువాత 2012-13 ైరె ల్వేబడ్జెట్‌లో మధురై, తిరునెల్వేలీ, కన్యాకుమారీ వరకు డబుల్‌లైన్ పనులకు నిధుల కేటాయింపు తగ్గుతూ వస్తోంది. ఈ కారణంగా చెన్నై-కన్యాకుమారీ మధ్య విద్యుద్దీకరణతో కూడిన డబుల్‌ైలైన్ పనులు పదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ప్రతి బడ్జెట్లోనూ కొద్ది మొత్తంలో నిధులు విదులుస్తున్న మూలంగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ పథకం పరిస్థితిని బేరీజు వేసుకుంటే తమిళనాడుపై కేంద్రానికి ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నాయో తేటతెల్లం అవుతుంది. ప్రస్తుతం ఈ పథకం కింద చెన్నై-చెంగల్పట్టు మధ్య పనులు పూర్తయ్యాయి. చెంగల్పట్టు-విళుపురం మధ్య పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. తరువాత దశగా విళుపురం నుంచి దిండుగల్లు వరకు డబుల్‌లైన్ పనులకు రూ.1300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేశారు. ఇందులో రూ.600 కోట్లు నిధులు కేటాయించారు. విళుపురం-దిండుగల్లు మధ్య 69 కిలో మీటర్ల వరకు డబుల్‌లైన్ పనులు ఇటీవలే ప్రారంభించారు. మిగతా దూరానికి రూ.700 కోట్లు కేటాయిస్తేనే పూర్తవుతుంది. అంతేగాక రూ.700 కోట్లు ఈ ఏడాది విడుదలైతేనే రాబోయే రెండేళ్లలో విళుపురం-దిండుగల్లు మధ్యను డబుల్‌లైన్ పనులు పూర్తవుతాయి. దిండుగల్లు నుంచి మధురైకి ఇప్పటికే డబుల్‌లైన్ పనులు సిద్దంగా ఉన్నందున చివరి దశగా కన్యాకుమారి వరకు డబుల్‌లైన్ పనులను ప్రారంభించవచ్చు. మధురై నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 245 కిలోమీటర్ల దూరంపై సర్వేకూడా పూర్తయింది. చివరి దశ పనులకు రూ.1916 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. చివరి దశ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఏ రాజకీయవాది, ఏ అధికారి హామీ ఇవ్వడం లేదు. విళుపురం-దిండుగల్లు పనులకు రూ.700 కోట్లు కేటాయించిన తరువాతనే చివరి దశపై దృష్టి సారిస్తారు. అప్పటి కూడా ఒకే దఫాగా నిధులు కేటాయిస్తారనే నమ్మకం లేదని తెలుస్తోంది. చివరి దశ పనులు పూర్తి కావాలంటే కనీసం 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిశీలిస్తే చెన్నై-కన్యాకుమారి మధ్య విద్యుద్దీకరణతో డబుల్ లైన్ రైలు మార్గానికి కనీసం 5 ఏళ్లు ఖాయంగా భావించవచ్చు. రూ.2700 కోట్లు కేటాయిస్తే పనులు తొందరగా పూర్తిచేయవచ్చు. అయితే చెన్నై-కన్యాకుమారి రైలు మార్గం ప్రాధాన్యత తెలిసినా దక్షిణాదికి చెందిన రాజకీయనేతలు మిన్నకుండిపోతున్నారు. ఈ పథకం పూర్తయితే కన్యాకుమారి, నెల్లై, మధురై మీదుగా చెన్నై చేరుకోవడానికి ఒక గంట సమయం ఆదా అవుతుంది. అంతేగాక కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు విద్యుత్ రైలును ప్రవేశపెట్టవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు రైలు మార్గం పథకం కింద దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నిర్మాణ పనులు పూర్తికాగా తమిళనాడు మాత్రమే డబుల్‌లైన్ విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు పోటాపోటీగా తమ పరిధిలోని రైల్వే పనులపై సమష్టిగా దృష్టి సారిస్తుండగా, తమిళనాడు నేతలు మాత్రం అనైక్యతను ప్రదర్శించడం వల్ల కేంద్రం సైతం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తాజా బడ్డెట్‌లోనూ రాష్ట్రంలోని పనులకు గణనీయమైన స్థాయిలో నిధుల కేటాయింపు జరగక పోవడంతో రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలింది. మోసగించారు: బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయిలో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశతో ఎదురుచూసున్న రైల్వే బడ్జెట్లో చివరకు అందరినీ మోసగించారని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు 60 శాతం వరకు తగ్గిన కారణంగా టికెట్టు చార్జీలను తగ్గించి ఉండవచ్చన్నారు. ఇందుకు విరుద్ధంగా సరకు రవాణా చార్జీలను పెంచివేశారని వ్యాఖ్యానించారు. కేంద్రం చేతిలో మోసపోయిన తమిళ ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. రైల్వేబడ్జెట్ సంతృప్తికరం: ప్రయాణికుల చార్జీలు పెంచకుండా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ సంతృప్తినిచ్చిందని అన్నాడీఎంకే అధినేత్రి,మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమని అన్నారు. ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల రక్షణ రైల్వేస్టేషన్లు, భోగీల్లో పారిశుధ్యం వంటివాటిపై దృష్టి సారించడం ముదావహమన్నారు. తమిళనాడులో ప్రతిపాదనలో ఉన్న హైస్పీడ్ రైళ్లకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె కోరారు. మొత్తం మీద 2015-16 రైల్వే బడ్జెట్‌ను తాను స్వాగతిస్తున్నానని అన్నారు. -
లోకల్ రైళ్లలో మహిళలకు భద్రత కరవు
సాక్షి, ముంబై: మహిళల భద్రత విషయంలో ముంబై ఎంతో సురక్షితమైనదని పలు అధ్యయనాలు చెబుతున్నప్పటికీ లోకల్ రైళ్లలో మాత్రం వారికి భద్రత కరువైంది. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లో రైళ్లలో ప్రయాణించే మహిళలపై నేరాలు శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విధులు ముగించుకుని రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లే మహిళ ప్రయాణికులు లోకల్ రైళ్లలో వేధింపులకు గురవుతున్నారు. మహిళలపై నేరాల సంఖ్య 2012తో పోలిస్తే 2014లో రెట్టింపుగా నమోదయ్యాయి. వీటిలో లైంగిక వేధింపుల కేసులు అత్యధికంగా ఉన్నాయి. లోకల్ రైళ్లలో ఈవ్‌టీజింగ్ సంఘటనలు అనేకమని, వీటిలో చాలా వరకు పోలీసుల దృష్టికి రాకుండా పోతున్నాయని అధికారులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో మహిళా బోగీల్లో రైల్వే పోలీసులను నియమించినప్పటికీ నేరాలు పెరగడంపై రైల్వే పోలీసు కమిషనర్ రవీంద్ర సింఘల్ ఆందోళదన వ్యక్తం చేశారు. నేరాలను అదుపుచేయడం తోపాటు, తాము సురక్షితంగా ప్రయాణం చేస్తున్నామనే నమ్మకం మహిళల్లో కలిగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సింఘల్ చెప్పారు. గత రెండు సంవత్సరాల కాలంలో మహిళా బోగీల్లో ప్రయాణం చేసిన 5,330 మంది పురుషులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. వీరిలో కొందరు తెలియక, మరికొందరు కావాలనే మహిలా బోగీల్లో ఎక్కినట్లు రుజువైంది. ఆకతాయిలను అరికట్టడానికి ఎప్పటికప్పుడు అనేక పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళలపై నేరాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. -
‘లైఫ్‌లైన్’కు అంతరాయాలపై ఆగ్రహజ్వాల
దివా రైల్వే స్టేషన్లో ప్రయాణికుల విధ్వంసం - పలు వాహనాలకు నిప్పు ⇒ఆరు గంటలపాటు నిలిచిపోయిన లోకల్ రైళ్లు ⇒పోలీసుల లాఠీచార్జీ ⇒పలువురికి గాయాలు సాక్షి, ముంబై: ముంబై మహానగరానికి జీవం ఇక్కడి లోకల్ రైళ్లు. అవే రైళ్లు తరచు సాంకేతిక లోపాలతో, ఇతర కారణాల వల్ల నిలిచిపోతూ ఉంటే.... ఏడాది కాలంగా ఈ తంతు కొనసాగుతుండడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొత్త సంవత్సరంలో కూడా ‘లైఫ్‌లైన్’కు అంతరాయాలు తప్పకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. వారి కోపాగ్నికి ఓ పోలీసు జీపుతో పాటు మూడు ప్రైవేటు వాహనాలు దగ్ధమయ్యాయి. కొన్ని లోకల్ రైళ్లు, మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల అద్దాలు పగిలిపోయాయి. దివా స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం ఓ లోకల్ రైలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం 6.50 గంటలకు టాకూర్లి, డోంబివలి రైల్వేస్టేషన్ల మధ్య అప్ స్లో మార్గంపై బద్లాపూర్ లోకల్ రైలు పెంటాగ్రాఫ్ తెగిపోయింది. దీంతో 6.50 గంటల నుంచి 7.26 గంటల వరకు కళ్యాణ్, దివా రైల్వేస్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేసి పెంటాగ్రాఫ్ మరమ్మత్తులు చేశారు. ఈ కారణంగా సెంట్రల్ రైల్వేమార్గంలో రైళ్ల రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. దీంతో కళ్యాణ్ నుంచి ఠాణే వరకు దాదాపు అన్ని రైల్వేస్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంత ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. కొత్త సంవత్సరంలో కూడా ఇలాంటి సంఘటన పునరావృతం కావడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఎంతసేపటికీ రైళ్లు రాకపోవడంతో ఓపిక నశించిన ప్రయాణికులు ఉదయం 8.20 గంటల సమయంలో దివా రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్‌లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇలా ప్రారంభమైన ఆందోళన చూస్తుండగానే హింసాత్మకంగా మారింది. దివా రైల్వేస్టేషన్‌లోని ఏటీవీఎంలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. ప్రయాణికులు రాళ్లు రువ్వడంతో ఓ రైల్వే ఉద్యోగి గాయపడ్డారు. దీంతో రైల్వే సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. మోటార్‌మెన్ యూనియన్ ఇచ్చిన సమ్మె పిలుపుతో అటు సెంట్రల్ రైల్వేమార్గంలో ఇటు హార్బర్ మార్గంపై కూడా రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. పలువురికి గాయాలు... దివా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకు చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. ఇంతలో కొందరు రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో పోలీసులు కూడా లాఠీలకు పని కల్పించారు. ఈ సంఘటనలో ఆర్ కె చావడా, హెచ్ జీ పటేల్ అనే ఇద్దరు మోటర్మెన్లు, జైస్వాల్ అనే ఆర్పీఎఫ్ అధికారి, ఓ హెడ్‌కానిస్టేబుల్, మరో నలుగురు సిబ్బందికి గాయలయ్యాయి. వీరిలో ఆర్ కె చావడా పరిస్థితి విషమించడంతో అతడిని బైకలా రైల్వే ఆసుపత్రికి తరలించారు. వాహనాలతోపాటు సామగ్రి ద్వంసం.... ప్రయాణికుల ఆగ్రహానికి దివా రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఓ పోలీసు వాహనంతోపాటు మూడు ప్రైవేట్ వాహనాలు దగ్ధమయ్యాయి. ఏడు ఏటీవీఎం యంత్రాలు, మూడు బుకింగ్ కౌంటర్లు, లెవల్ క్రాసింగ్ గేట్ ధ్వంసమయ్యాయి. మరోవైపు డోంబివలి రైల్వేస్టేషన్లో కూడా కొందరు ప్రయాణికులు రెండు బుకింగ్ కౌంటర్లతోపాటు ఆరు ఏటీవీఎం యంత్రాలను ధ్వంసం చేశారు. పది లోకల్ రైళ్ల బోగీలకు కూడా నష్టం వాటిల్లింది. ఠాణే జిల్లా ఇన్చార్జీ మంత్రి ఏక్నాథ్ శిందే, కళ్యాణ్ ఎంపీ శ్రీకాంత్ శిందే సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులకు నచ్చజెప్పారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా జోక్యం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం మళ్లి రైళ్ల రాకపోలు ప్రారంభమయ్యాయి. దూరప్రాంతాల రైళ్లపై ప్రభావం.... ఆందోళన ప్రభావం దూరప్రాంతాలకు వెళ్లే ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లపై పడింది. అనేక రైళ్ల సమయాలలో మార్పులు చేశారు. ముంబై-పుణే సింహగడ్ ఎక్స్‌ప్రెస్, ముంబై-నాగపూర్ సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్, ముంబై-ఫిరోజ్‌పూర్ పంజాబ్ మెయిల్, ముంబై-హౌరా ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్ల సమయాలలో మార్పులు చేయగా అనేక రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 134 లోకల్ రైళ్లు రద్దు.... దివా రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళన కారణంగా 134 లోకల్ రైళ్లను రద్దు చేశారు. వీటిలో 70 డౌన్ లోకల్స్, 54 అప్ లోకల్స్ ఉండగా పది ఠాణే షటిల్స్ ఉన్నాయి. ఇకపై జాగ్రత్త వహిస్తాం : సీఎం సాక్షి, ముంబై: దివాలో శుక్రవారం జరిగిన ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ పేర్కొన్నారు. దివా రైల్వేస్టేషన్ వద్ద జరిగిన సంఘటనపై తాము సమీక్షించామని అయితే ప్రయాణికులకు మున్ముందు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తపడతామన్నారు. లోకల్ రైళ్లకు ఎదురవుతున్న అంతరాయాలపై రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభుతో కూడా చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, రైల్వేమంత్రి సురేష్ ప్రభు మహారాష్ట్రలో కొత్తగా ఎస్వీపీ (స్పెషల్ పర్పస్ వెహికల్)ను తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ సమస్యకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నె ల 9న ప్రభు ఠాణేను సందర్శించి ప్రయాణికుల సమస్యలపై చర్చించనున్నారు. -
మొబైల్ టికెటింగ్‌తో సమయం ఆదా
రైల్వే మంత్రి సురేష్ ప్రభు సాక్షి, ముంబై: మొబైల్ టికెటింగ్ విధానంతో లోకల్ రైళ్లలో ప్రయాణించేవారికి సమయం చాలా ఆదా అవుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దాదర్ రైల్వే స్టేషన్లో శనివారం లోకల్ ‘మొబైల్ టికెటింగ్’ విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ ముంబైలోని లోకల్ రైళ్లను ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారన్నారు. కాగా, వీరు గంటల తరబడి క్యూలో నిలబడే అవసరం లేకుండా సులభంగా టికెటు పొందేందుకు ఈ మొబైల్ టికెటింగ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. త్వరలోనే సీఎస్టీ, కుర్లా, ఠాణే, కల్యాణ్ తదతర కీలక స్టేషన్లలో ఈ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్, విండోస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించేవారు డౌన్ లోడ్ చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. వినియోగదారుడు తొలుత అప్లికేషన్‌ను ఓపెన్ చేసి పేరు, మొబైల్ నంబర్, ముంబై సిటీ నమోదుచేసిన తర్వాత ఎస్సెమ్మెస్ ద్వారా అతనికి ఒక పాస్ వర్డ్ వస్తుందన్నారు. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వినియోగదారుడి పేరు నమోదు అవుతుందని చెప్పారు. అనంరతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం, ఫస్ట్, సెకండ్ క్లాస్ తదితర వివరాలు అందులో కనిపిస్తాయని, ఆ ప్రకారం నమోదు చేయడం పూర్తయితే మనం టికెటు పొందినట్లు మెసేజ్ వస్తుందన్నారు. దానిమేరకు మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చని ఆయన వివరించారు. జీరో బ్యాలన్స్తో మన పేరు రిజస్టర్ అయినప్పటికీ టికెటు పొందాలంటే అందులో రూ.100 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ బ్యాలెన్స్‌ను భర్తీ చేసుకునేందుకు ప్రస్తుతం దాదర్‌లో మాత్రమే సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ముంబై జిల్లా ఇన్చార్జి మంత్రి సుభాష్ దేశాయ్, మేయర్ స్నేహల్ అంబేకర్, ఎంపీలు రాహుల్ శేవాలే, అనిల్ దేశాయ్, సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్‌కుమార్, పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.టండన్, రైల్వే బోర్డు సభ్యుడు సంజయ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘చోరీ’ సొత్తు అప్పగింత
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో ప్రయాణికులు పొగొట్టుకున్న లేదా మర్చిపోయిన సామగ్రిని రైల్వే పోలీసు కమిషనర్ శుక్రవారం బాధితులకు అందజేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిత్యం ఉరుకులు, పరుగులతో రాకపోకలు సాగించే ముంబైకర్లు రైలు దిగే హడావుడిలో చేతి బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ సంచులు ఇలా ఏదో ఒక వస్తువు మర్చిపోవడం పరిపాటిగా మారింది. అదేవిధంగా కిక్కిరిసిన రైళ్లలో జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి దొరికినంత దోచుకుపోతుంటారు. ఇదే తరహాలో మహిళా బోగీల్లో సైతం విలువైన సామగ్రి, ఒంటిపై ఉన్న బంగారు నగలు తెంచుకుని దొంగలు నడిచే రైలులోంచి దూకి పారిపోవడం పరిపాటిగా మారింది. ఇలా ప్రతిరోజూ పశ్చిమ, సెంట్రల్, హార్బర్ లోకల్ రైల్వే మార్గాల పరిధిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతాయి. అయితే పొగొట్టుకున్న వస్తువులపై బాధితులు దాదాపు ఆశలు వదిలేసుకుంటారు. ఒకవేళ ఆ వస్తువులు తిరిగి పొందాలంటే చెప్పులరిగేలా రైల్వే పోలీసు స్టేషన్ల చుట్టు తిరగాల్సిందే. ఇదిలా ఉండగా, కొంతకాలంగా రైల్వే స్టేషన్లలో దొంగలను పట్టుకోవడానికి ఆర్పీఎఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన దొంగల నుంచి రికవరీ చేసిన చోరీ వస్తువులను, తమ వద్ద నమోదైన ఫిర్యాదులను బట్టి బాధితులకు సమాచారమందించి తిరిగి వారికి అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రైల్వే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కొందరు బాధితులను పిలిచించి, వారి వస్తువులను తిరిగి అప్పగించారు. -
లోకల్ రైళ్లకు కొత్త టైంటేబుల్
సాక్షి, ముంబై: ప్రయాణికుల సౌకర్యార్థం సెంట్రల్ రైల్వే శనివారం నుంచి లోకల్ రైళ్ల కొత్త టైం టేబుల్ అమలులోకి తెస్తోంది. దీని వల్ల కొందరికి ఇబ్బంది కాగా, మరికొందరికి మరింత సౌకర్యవంతం కానుంది. ముఖ్యంగా ఆఖరు లోకలు, మొదటి లోకల్ రైలు సమయంలో మార్పులు చేయడంవల్ల కొందరు ఉద్యోగులు, వ్యాపారులకు మేలు జరగ్గా, మరికొందరికి అన్యాయం జరగనుంది. సెంట్రల్ రైల్వే మార్గంలో కొంత కాలం నుంచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు, కొత్తగా ప్రవేశపెట్టిన లోకల్ రైళ్ల రాకపోకలు, కొన్ని రైళ్లను విస్తరించడం, అదనంగా ట్రిప్పులు పెంచడం తదితర చర్యల వల్ల రైల్వే మార్గంపై అదనపు భారం పడుతోంది. దీంతో టైం టేబుల్ ప్రకారం రైళ్లను నడపడం పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా లోకల్ రైళ్లపై ప్రయాణికుల నుంచి కూడా అనేక సూచనలు, సలహాలు వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఏ సమయంలో, ఎక్కడికి, ఎన్ని లోకల్ రైళ్లను నడిపితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందనే దానిపై రైల్వే అధికారులు అధ్యయనం చేశారు. ఆ తర్వాత కొత్త టైం టేబుల్ రూపొంధించారు. ఆ ప్రకారం ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి అర్ధరాత్రి 12.38 గంటలకు బయలుదేరే ఆఖరు లోకల్ రైలు శనివారం నుంచి 12.30 గంటలకు బయలుదేరుతుంది. ఎనిమిది నిమిషాలు ముందు వెళ్లడంవల్ల ఉద్యోగులు, వ్యాపారులు పరుగులు తీయాల్సి వస్తుంది. లేదంటే రైలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా సీఎస్టీ నుంచి తెల్లవారు జాము 4.05 గంటలకు బయలుదేరే మొదటి లోకల్ రైలు శనివారం నుంచి 4.12 గంటలకు బయలుదేరుతుంది. ఏడు నిమిషాలు ఆలస్యంగా బయలు దేరడంవల్ల ప్రయాణికులకు కొంత మేలు జరగనుంది. వీటితోపాటు రోజంతా పరుగులు తీసే రైళ్ల సమయంలో అనేక మార్పులు జరిగాయి. కాగా హార్బర్, ట్రాన్స్ హార్బర్ మార్గంలో రైళ్ల టైం టేబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే అధికారులు తెలిపారు. -
రైళ్లలో పెరిగిన వేధింపుల కేసులు
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో మహిళలపై వేధింపుల కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. 2013లో 41 వేధింపు కేసులు నమోదుకాగా, ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 47 కేసులు నమోద య్యాయి. ముఖ్యంగా ఈ కేసులు కల్యాణ్, కుర్లా, దాదర్‌లలో ఎక్కువగా నమోదవుతున్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. మరో పక్క అత్యాచారానికి సంబంధించిన కేసులు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది అత్యాచార కేసులు రెండు నమోదు కాగా, గత ఏడాది ఆరు నమోద య్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, నమోదు కాని వేధింపు కేసులు కూడా చాలా ఉన్నాయని ప్రయాణికుల అసోసియేషన్ పేర్కొంది. రైల్ యాత్రి సంఘ్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా మాట్లాడుతూ.. స్టేషన్లలో 10 శాతం మంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తారని తెలిపారు. డివిజినల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్‌యూసీసీ) సభ్యుడు రాజీవ్ సంఘాల్ మాట్లాడుతూ.. వేధింపుల కేసులను రైల్వే అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను అమర్చాలని సూచించారు. -
నిధులు కేటాయించాలి
రైల్వే మంత్రికి సీఎం వినతిపత్రం - రాష్ట్రానికి దూర ప్రాంతాల రైళ్లు, అదనంగా 50 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ - కొత్త ప్రాజక్టులు మంజూరుచేయకపోవడంపై విచారం సాక్షి, ముంబై : లోకల్ రైళ్లను ఆధునికీకరించనున్నారు. ఈ మేరకు రైళ్లకు ఆటోమెటిక్ డోర్లను అమర్చనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులను సీఎం పృథ్వీరాజ్ చవాన్ కోరారు. అలాగే రైల్వే ప్లాట్‌ఫారాల ఎత్తును కూడా పెంచాలని సూచించారు. సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రమాదాల బారిన పడి ప్రతి యేటా సుమారు 3,300 మంది మృతిచెందుతుండటంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం తగినన్ని మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరారు. రైల్వేమంత్రికి ముఖ్యమంత్రి వినతి 2014-15 రైల్వే బడ్జెట్‌కు గాను ముఖ్యమంత్రి ఓ మెమొరాండం తయారు చేసి రైల్వే మంత్రి డి.వి.సదానంద్ గౌడ్‌కు గత వారం అందజేశారు. పలు రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిందిగా ఈ నివేదికలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎంయూటీపీ-2 (ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్) కోసం నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు రూ.375 కోట్లు కేటాయించగా ఇంకా రూ.500 కోట్లు అవసరం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో భౌగోళికంగా పోల్చితే నగరంలో రైల్వే నెట్‌వర్క్‌లో చాలా తక్కువ సదుపాయాలు ఉన్నాయి. ఓ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటికి తమ వంతు వాటా చెల్లించేందుకు రాష్ట్రం కూడా సిద్ధంగా ఉందని చవాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంయూటీపీ-11 ప్రాజెక్ట్ కోసం రూ.500 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. రైల్వే నెట్‌వర్క్‌ను మరింత శక్తివంతంగా తీర్చి దిద్దేందుకు అదనంగా కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు అమల్లోకి తేనున్నారు. సబర్బన్ ప్రాజెక్టు పనులకు.. ఇప్పటికే కొనసాగుతున్న కల్యాణ్-కసారా మూడవ లైన్, నెరూల్-అర్బన్ రైల్వే లైన్, ఇతర సబర్బన్ ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించాల్సిందిగా రైల్వే మంత్రిని సీఎం కోరారని ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారి తెలిపారు. ఎంయూటీపీ-3లో భాగంగా రూ.100 కోట్లతో చేపట్టనున్న ఐరోలి-కల్వా ఎలివేటెడ్ లింక్, పన్వేల్-కర్జన్ డబుల్ లైన్ ప్రాజెక్ట్‌లకు అనుమతులివ్వాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని సూచించారని చెప్పారు. ఇటీవల ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రానికి దూర ప్రాంతాలకు సంబంధించి మరిన్ని రైళ్ల కోసం కూడా డిమాండ్ చేశారన్నారు. అదనంగా 50 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేశారు. 15 బోగీలకు చెందిన మరిన్ని రైళ్లను కూడా ప్రవేశపెట్టాల్సిందిగా ముఖ్యంత్రి డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నుంచి ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు రైల్వే మంత్రి మంజూరు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం 50 శాతం ఖర్చు భరిస్తున్నప్పటికీ వీటి అనుమతికి, అదేవిధంగా బడ్జెట్లో వీటి నిధుల కోసం డిమాండ్ చేశారని వివరించారు. -
ప్రాణాలతో పరాచికం
సాక్షి, ముంబై: లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేయడం కొందరు యువతకు నిత్యకృత్యంగా మారడంపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోగీలపై ప్రయాణించడం, ప్రవేశద్వారానికి వేలాడుతూ విన్యాసాలు చేయడం, తిరిగే ఫ్యాన్లలో వేళ్లు పెట్టడం వంటివి లోకల్‌రైళ్లలో సర్వసాధారణంగా మారాయి. బోగీలపై ప్రయాణించిన వారిలో పలువురు మరణించడం, గాయపడడం తెలిసిందే. ఇలాంటి దుస్సాహసాలు చేయవద్దని రైల్వే అధికారులు ప్రతినిత్యం అనౌన్స్మెంట్ల ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నా ఆకతాయిలు పట్టించుకోవడం లేదు. వీరి చేష్టలు సహ ప్రయాణికులకు భయం పుట్టిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న వారిలో అత్యధికులు యువకులేనని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. ప్రమాదకర విన్యాసాల నిరోధానికి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టామని ప్రకటించారు. బోగీల్లో ప్రాంణాంతక విన్యాసాలు చేస్తూ గత నెల 500 మంది జీఆర్పీకి చిక్కారు. కౌన్సెలింగ్ వల్ల పెద్దగా ఫలితాలు రాకపోవడంతో పోలీసులు మరో తరహా ప్రయత్నం మొదలుపెట్టారు. తప్పు చేసిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ప్రాంణాంతక విన్యాసాలు చేసిన 618 మందిని పశ్చిమరైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఇదే కాలంలో సెంట్రల్ రైల్వేలోని బండ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేసిన 1,208 మందిని పట్టుకున్నారు. విన్యాసాలు వికటించి చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఈ పనులు చేస్తున్న వారిలో అత్యధికులు 14 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయస్సు గల వారేనని తేలింది. ముంబై సెంట్రల్ సీనియర్ రైల్వే పోలీస్ రాజేంద్ర త్రివేది ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైళ్లలో విన్యాసాలు చేస్తున్న వారిపై నిఘా ఉంచాల్సిందిగా తమ సిబ్బందిని ఆదేశించామన్నారు. ‘వీరిని పట్టుకోవడం వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. తిరిగి ప్రాణాంతక విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. అందుకే వీళ్ల తల్లిదండ్రులను రైల్వే స్టేషన్లకే పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. విన్యాసాలు చేయడం ద్వారా యువకులు ఏ విధంగా మరణించడం..తీవ్ర గాయాలపాలైన వీడియోలను తల్లిదండ్రులకు చూపించి అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా సదరు తల్లిదండ్రులు పిల్లలను మందలించే అవకాశం ఉంటుంది. దీంతో యువకులు కూడా తిరిగి విన్యాసాలు చేయకుండా ఉంటారు’ అని త్రివేది వివరించారు. ప్రాణాంతక విన్యాసాలు చేస్తున్న వారిని పట్టుకోవడం కోసం తరచూ తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని చెప్పారు. -
‘రవాణా’లో ముంబై ముందడుగు
సాక్షి, ముంబై: ముంబై అనగానే... లోకల్ రైళ్లు మన కళ్ల ముందు కదలాడతాయి. అవును... క్షణం తీరిక లేకుండా ఉండే నగర అభివృద్ధిలో లోకల్ రైళ్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బెస్టు బస్సులు, ట్యాక్సీలు, ఆటోలతోపాటు లోకల్ రైళ్లు ముంబై నగరం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయి. వీటికి తోడుగా ఇటీవలే మోనో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఏ నగరాభివృద్ధిలోనైనా రవాణా వ్యవస్థ కీలకం. మరి అది దేశ ఆర్ధిక రాజధాని అయితే... అందుకే ఇప్పుడు ముంబై రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. త్వరలోనే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు నగరం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటూ జల రవాణా ప్రారంభించాలనే డిమాండ్ కూడా పెద్దఎత్తున ఉంది. భవిష్యత్తులో జల రవాణా వ్యవస్థ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ముంబై నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడం ఖాయం. లైఫ్లైన్లు... ముంబైలో ఇప్పటివరకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు బెస్టు బస్సులతో పాటు ప్రధానంగా సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ సేవలు ‘ముంబై లైఫ్‌లైన్’లుగా గుర్తింపు పొందాయి. ఉరుకులు, పరుగులతో నగర జీవితం నిత్యం బిజీ. తీరిక లేని ప్రజల జీవన విధానానికి తగ్గట్టుగా నగరంలో రవాణా వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి ఐదు నిమిషాల తేడాతో నడిచే బెస్టు బస్సులు, లోకల్ రైళ్లలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రతి రోజూ సుమారు 65 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. దీంతో ఇక్కడ సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్ ఇలా మూడు మార్గాల్లో లోకల్ రైళ్లను నడుపుతున్నారు. కాగా ముంబై నగరానికి అంతర్జాతీయ హోదాను దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. భారీ వ్యయంతో కూడుకున్న మోనో, మెట్రోలాంటి ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోనో రైలు సేవలు... దేశంలోనే మొట్టమొదటి రైలు ముంబై- ఠాణేల మధ్య ప్రారంభమైన విషయం విదితమే. ఇక్కడ లోకల్ రైళ్లు కూడా చాలా సంవత్సరాల కిందటే ప్రారంభమయ్యాయి. తాజాగా దేశంలోని మొట్టమొదటి మోనో రైలు సేవలు కూడా ఇక్కడే ప్రారంభం కావడం విశేషం. ఇవి మొదటి విడతలో చెంబూర్-వడాలా వరకు ప్రారంభమయ్యాయి. పూర్తిగా ఏసీ కోచ్‌లతో భూమికి సుమారు 20 అడుగుల ఎత్తుపై నుంచి ఎలాంటి శబ్దంలేకుండా వెళ్లే ఈ మోనో సేవలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య మాత్రం ఆశించినంతగాలేదని తెలుస్తోంది. రెండో విడతలో వడాలా-సాత్ రాస్తా వరకు మోనో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. మెట్రో రైలు సేవలు... రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి రానున్న మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ 11.4 కి.మీ.పొడవైన మెట్రో మార్గం పనులు పూర్తి అయ్యాయి. ఈ ‘ముంబై మెట్రో-1 కు అన్ని అనుమతులు లభించాయి. ఈ రైళ్లు ప్రారంభంలో గంటకు 50 కి.మీ. వేగంతో నగరంలో పరుగులు పెడతాయని మెట్రో-1 అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పిల్లర్ల మీదుగా సాగుతుంది. దీంతో రైళ్లకు ఎలాంటి అడ్డంకులు, ట్రాక్‌కు ఇరువైపుల మురికివాడలు, లెవెల్ క్రాసింగ్‌లు ఉండవు. అలాగే మెట్రో రైల్వే ట్రాక్‌లు ప్రత్యేక లోహంతో తయారుచేసినవి కావడంతో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమే లేదు. భవిష్యత్తులో గంటకు 80 కి .మీ. వేగంతో రైళ్లను నడపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్డీఎస్ఓ స్పష్టం చేసింది. కాగా కొన్ని ప్రమాదకర మలుపులవద్ద వేగాన్ని కొంత నియంత్రించాల్సి ఉంటుంది. మిగతా చోట్ల నిర్దేశించిన వేగంతోనే రైళ్లను నడిపేందుకు అనుమతివ్వనున్నట్లు ఆర్డీఎస్ఓ అధికారులు పేర్కొన్నారు. జల రవాణా... నగరం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకొంటూ జల రవాణా ప్రారంభించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల అతి తక్కువ సమయంలో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడంతోపాటు ట్రాఫిక్ జాం, కాలుష్య సమస్యలు కూడా ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే దీనిపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. ముంబై-నవీముంబైల మధ్య రోడ్లపై, లోకల్ రైళ్లపై భారం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని తగ్గించేందుకు రహదారులను పెంచడం, వెడల్పు చేయడం, లోకల్ రైళ్ల సంఖ్య పెంచేందుకు వీలు లేకుండాపోవడంతో ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గాన్ని ఎంచుకోక తప్పడం లేదు. ఇందులో భాగంగా నవీముంబైలోని నేరుల్ నుంచి ముంబైలోని భావుచా ధక్కా వరకు లేదా మాండ్వా నుంచి భావుచా ధక్కా వరకు జల మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం ముంబై నుంచి నవీముంబై వరకు రోడ్డు మార్గం మీదుగా చేరుకోవాలంటే కనీసం గంటన్నరకు పైగా సమయం పడుతుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే కేవలం 20 నిమిషాల్లో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించవచ్చు. లోకల్ రైళ్లే మేలు... మరోవైపు మోనో, మెట్రో రైల్వే సేవలకంటే లోకల్ రైళ్లు సౌకర్యవంతంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లోకల్ రైళ్లతో పోలిస్తే మోనో, మెట్రో రైళ్లలో ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం చాలా తక్కువ. లోకల్ రైళ్లలో రద్దీ సమయంలో గంటకు 3.60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. అయితే మెట్రో రైలులో గంటకు 60 వేల మంది, మోనో రైలులో గంటకు కేవలం 6,295 మంది మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఎలివేటెడ్ మార్గం చర్చిగేట్ నుంచి విరార్, ముంబై నుంచి ఠాణేల వరకు ప్రస్తుతం నేలపై ఉన్న రైల్వే ట్రాక్‌ల వెంబడి పైనుంచి (ఎలివేటెడ్) వెళ్లే మార్గం నిర్మించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. దీంతో లోకల్ రైళ్ల మాదిరిగా గంటకు దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా చాలావరకు తగ్గేందుకు ఆస్కారం ఉంది. దీనికోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎలివేటెడ్ రైల్వే మార్గాన్ని పక్కనబెట్టి మోనో, మెట్రో లాంటి ఖరీదైన ప్రాజెక్టులు ప్రారంభించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
సెంట్రల్ మార్గంలో 12, 15 బోగీల రైళ్లు
సాక్షి, ముంబై: సెంట్రల్ మార్గంలో లోకల్ రైళ్లలో ప్రయాణించేవారికి త్వరలో రద్దీ నుంచి ఊరట లభించనుంది. ఈ మార్గంలో మరో ఆరు నెలలోల 12, 15 బోగీల రైళ్లను ప్రారంభించనున్నారు. దీంతోపాటు ట్రిప్పుల సంఖ్యను కూడా పెంచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అదీగాక ఈ మార్గంలో గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో నడిచే ఫాస్ట్ రైళ్లను అందుబాటులోకి తేవాలని కూడా యోచిస్తున్నట్లు చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సమయం కూడా చాలావరకు ఆదాకానుంది. ఇందుకోసమే ప్రస్తుతం డెరైక్ట్ కరెంట్(డీసీ) నుంచి ఆల్టర్నేట్ కరెంట్(ఏసీ)కు మార్చే పనులు చేస్తున్నారని చెప్పారు. ఆదివారం కల్యాణ్-ఠాణే-లోకమాన్య తిలక్ టెర్మినస్ సెక్షన్లలో విద్యుత్‌ను డీసీ నుంచి ఏసీకి మార్చారు. దీంతో ప్రస్తుతం కంటే మరింత వేగంగా రైళ్లు నడువనున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాలలో ఈ ఫాస్ట్ రైళ్లు మరిన్ని ఎక్కువ ట్రిప్పులతో సేవలు అందించనున్నాయి. బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఇకపై చాలా తక్కువగా ఉంటుందని సెంట్రల్ రైల్వే అధికార ప్రతినిధి అతుల్ రాణే తెలిపారు. కల్యాణ్-ఎల్టీటీ మార్గాల మధ్య ఫాస్ట్ రైళ్లను ప్రారంభించడంతో ప్రయాణికుల సమయం దాదాపు 10 నిమిషాల వరకు ఆదా అయ్యే అవకాశముందన్నారు. డీసీ నుంచి ఏసీకి మార్చడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. గతంలోనే కొత్తగా రెండు రైళ్లను ప్రారంభించాల్సి ఉన్నా అది సాధ్యం కాలేదని, తాజా ప్రతిపాదనలతో ఈ మార్గంలో ప్రయాణించేవారికి అనేకరకాలుగా ప్రయోజనం కలగనుందన్నారు. మరో ఆరు నెలల్లో సీఎస్టీ వరకు డీసీ నుంచి ఏసీకి మార్పులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
10 లోకల్ రైళ్లు పాక్షికంగా రద్దు
సాక్షి ముంబై: సెంట్రల్ రైల్వే పరిధిలోని ఠాణే-కల్యాణ్ మార్గంలోని లోకల్‌రైళ్లలో పదింటిని తొలగించారు. రైళ్ల ఇంజిన్ల కరెంటును మార్చడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మార్గంలోని లోకల్ రైళ్ల సమయసూచికలోనూ భారీ మార్పులు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ‘ఏసీ-డీసీ’ విద్యుత్ ప్రవాహం మార్పు వల్ల ఠాణే-కల్యాణ్ మార్గంలో కొత్త సమస్యలు తలెత్తాయి. మోటార్మెన్ల సమ్మె, పట్టాలకు పగుళ్లు పడటం, సిగ్నల్ సమస్య తలెత్తడం తదితర సమస్యలతో ఈ మార్గంలో రైళ్లకు తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘ఏసీ’ విద్యుత్‌తో లోకల్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయి. ముంబై సీఎస్టీ నుంచి కళ్యాణ్ వరకు సేవలు అందించే లోకల్‌రైళ్లు ‘డీసీ’ కరెంటుతో నడుస్తున్నాయి. దీంతో సెంట్రల్ రైల్వే విభాగం రైళ్లలో కరెంటు సరఫరాను ‘డీసీ’ నుంచి ‘ఏసీ’కి మార్చే పనులను ప్రతి ఆదివారం నిర్వహించే మెగాబ్లాక్ రోజున చేపట్టింది. మొదటి విడతలో ఠాణే నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు ఐదు, ఆరో లైన్లను ‘డీసీ’ నుంచి ‘ఏసీ’ విద్యుత్‌కు మార్చారు. రెండో విడతలో ఠాణే నుంచి కల్యాణ్ వరకు పనులు పూర్తి చేశారు. ఈ పనుల వల్ల సెంట్రల్ రైల్వేకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఇకపై ‘డీసీ’ కరెంటుతో ప్రయాణించే 10 లోకల్ రైళ్లు కేవలం సీఎస్టీ నుంచి ఠాణే వరకు మాత్రమే నడుస్తాయి. ఠాణే తర్వాత ఏసీ కరెంటు లభించదు కాబట్టి వీటి సేవలు ఉండబోవు. ఇది వరకు మొత్తం 75 లోకల్ రైళ్లు ఠాణే తరువాత కూడా నడిచేవి. ఇప్పులు కేవలం 65 మాత్రమే సేవలు అందిస్తాయి. మరో సమస్య ఏమిటంటే.. లోకల్ రైళ్ల టైమ్ టేబుల్లో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘డీసీ’ రైళ్ల సంఖ్య తగ్గింది కాబట్టి ఇతర రైళ్లతో టైమ్ టేబుల్‌ను కలపాల్సి వస్తుంది. దీంతో లోకల్ రైళ్ల సమయాలు చాలా వరకు మారిపోనున్నాయి. ఒక లోకల్ రైలు రోజుకు 10 ట్రిప్పులు వేస్తుంది. ఆ ప్రకారంగా సుమారు 100 ట్రిప్పులపై ప్రభావం పడనుంది. సీఎస్టీ-ఠాణే మార్గంలో ప్రతి రోజు ‘డీసీ’ లోకల్ రైళ్లు 218 ట్రిప్పులు ఉండేవి. వాటిలో సీఎస్టీ-కుర్లా, సీఎస్టీ-ఘాట్కోపర్, దాదర్-ఠాణే రైళ్లు కూడా ఉన్నాయి. సీఎస్టీ వరకు అన్ని లైన్లలో ‘ఏసీ’గా మార్చేందుకు సెంట్రల్ రైల్వేకు మే నెల వరకు సమయం పడుతుంది. -
‘లోకల్’లో పెరిగిన నేరాలు
సాక్షి, ముంబై: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది లోకల్ రైళ్లలో నేరాల సంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రైళ్లలో చోరీలు, మహిళా ప్రయాణికులను వేధించడం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వీటి సంఖ్య పెరిగిందని అధికారి తెలిపారు. అయితే హత్యల సంఖ్య తగ్గిందన్నారు. సెంట్రల్ లైన్‌లోని కుర్లా, ఠాణే, కళ్యాణ్ అదేవిధంగా హర్బర్ మార్గంలోని మాన్కుర్డ్, వడాలా మార్గాలలో ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి. చాలామంది నిరుద్యోగులు మురికివాడల్లో ఉంటూ ఈ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారని ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ఇదిలా వుండగా నేరాలను నియంత్రించేందుకు జీఆర్పీకి చెందిన మహిళా పోలీసు అధికారులను మహిళా బోగీల్లో నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీరిని బృందాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో బృందంలో ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక అధికారి ఉంటారన్నారు. వీరు యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రస్సుల్లో రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎవరైనా ఆ బోగీల్లోకి చొరబడి ప్రయాణికుల విలువైన వస్తువులు, బ్యాగులు అపహరించేందుకు చూసినా లేదా ఆభరణాలు చోరీ చేయడానికి ప్రయత్నించినా వారిని వెంటనే పట్టుకుంటారని తెలిపారు. ఇదిలా ఉండగా, బాంద్రా, మాహిమ్ ఏరియాల్లో రైల్ ఫుట్బార్ వద్ద నిల్చొని ఉన్న ప్రయాణికుల బ్యాగులు, ఇతర విలువైన వస్తువుల చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే, కొంతమంది యువకులు ఎలిఫిన్స్టన్, దాదర్ రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కి ప్రయాణికులపై దాడిచేసి దోచుకుంటున్నారు. వీరు ప్లాట్‌ఫాంపై ఉన్న భద్రతా సిబ్బందిపై కూడా చేయి చేసుకోవడమే కాకుండా మహిళా ప్రయాణికులను కూడా వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది బాంద్రా టర్మినస్ వద్ద ప్రీతీ రాథీ అనే మహిళపై జరిగిన యాసిడ్ దాడి కేసును పరిష్కరించడంలో విఫలమైనట్లు రైల్వే క్రైం బ్రాంచ్‌కు చెందిన సీనియర్ ఇన్స్పెక్టర్ డీడీ వద్మారే తెలిపారు. -
లోకల్ రైళ్లలో 'బాబా'లు ప్రకటనలు అతికిస్తే చర్యలు
సాక్షి, ముంబై: మంత్రతంత్రాల పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తున్న బాబాలు లోకల్ రైళ్లలో తమ ప్రకటనలు అతికిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ రైల్వే శాఖ నిర్ణయించింది. మంత్రతంత్రాలు, మాయలతో సమస్యలు పరిష్కరిస్తామని మోసగిస్తూ లోకల్ రైళ్లలో అనేకమంది బాబాలు ప్రకటనలు అతికిస్తున్న విషయం తెలిసిందే. ప్రేమవివాహం, పనులు జరుగుతాయని, వశం చేసుకోవడం, అప్పులు తొలగిపోవడం, సంతానప్రాప్తి తదితర సమస్యలకు 100 శాతం పరిష్కార సమాధానం లభిస్తుందని కొందరు బాబాల పేరిట ప్రకటనలు గుప్పిస్తారు. వారి ప్రలోభానికి లొంగి అనేకమంది మోసపోతారు. ఈ బాబాల అకృత్యాలను అరికట్టేందుకు రైల్వే శాఖ అనేక ప్రయత్నాలు చేసినా ప్రకటనలు అతికించడాన్ని అరికట్టలేకపోయింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రతంత్రాలకు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేయడంతో బాబాగిరీ చేసేవారు ఆందోళనలో పడిపోయారు. ఈ బిల్లుతో రైల్వేకు సహకారం దొరికినట్లయింది. అమాయకులను మోసం చేసే ప్రకటనలు అతికించే వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. పశ్చిమ రైల్వే మార్గంలో జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రకటనలతో ప్రయాణికులను మోసం చేస్తున్న సుమారు 156 మందిపై చర్యలు తీసుకుంది. ఈ చర్యల్లో రూ.1.52 లక్షల జరిమానా వసూలు చేసింది. అంతేకాకుండా ఆరుగురికి జైలు శిక్ష విధించింది. ఈ చర్యలను మరింత బలపర్చడం కోసం పశ్చిమ రైల్వే మోసం చేసే ప్రకటనలు అతికించేవారిపై ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. -
పురిటి నొప్పులొస్తే రైలు ఆపొచ్చు
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు మొదలయ్యే గర్భిణుల కోసం వెంటనే రైలు ఆపేందుకు మోటార్‌మెన్లకు రైల్వేశాఖ అనుమతి ఇవ్వనుంది. ప్రయాణికులను సమయానికి చేరవేయడం కంటే ప్రసవం తర్వాత తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడడమే ముఖ్యమని రైల్వే భావించి ఈ నిర్ణయం తీసుకుందని సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. కర్జత్, కల్యాణ్, ఠాణే తదితర శివారు ప్రాంతాల్లో ఉంటున్న పేదలు, గర్భిణులు వివిధ పరీక్షల కోసం ముంబైలోని కార్పొరేషన్, ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తారు. రోడ్డు మార్గం కంటే రైలు ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. పైగా సమయం, చార్జీలు కలిసివస్తాయి. దీంతో ట్యాక్సీలు, ఆటోలకు బదులుగా అనేక మంది గర్భిణులు ప్రసవానికి రోజులు దగ్గరపడడంతో ముందుగానే అడ్మిట్ అయ్యేందుకు ఆస్పత్రికి వస్తుంటారు. కానీ ప్రసవ వేదనను అదుపుచేయడం ఎవరి చేతిలో లేదు. అనేక మంది గర్భిణులు నడిచే లోకల్ రైలులోనే ప్రసవించే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు ఫాస్ట్ లోకల్ రైళ్లనే ఆశ్రయిస్తారు. అనేక సందర్భాలలో రైలు నడుస్తుండగానే గర్భిణులకు ప్రసవ వేదన మొదలవుతుంది. కానీ ఎక్కిన రైలు ఫాస్ట్ లోకల్ కావడంతో నిర్దేశించిన స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అప్పటికే పురిటి నొప్పులు మొదలు కావడంతో రైలు స్టేషన్లో ఆగేంత వరకు సమయం ఉండదు. తోటి ప్రయాణికుల సహాయంతో ప్రసవం సుఖంగా జరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో తల్లి, బిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలుంటాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రసవ వేదన మొదలైతే గొలుసు లాగితే వచ్చే స్టేషన్లో వారిని భద్రంగా దింపేంత వరకు రైలుకు ‘ఎమర్జెన్సీ హాల్టు’ ఇచ్చేందుకు మోటార్‌మెన్లకు అనుమతి ఇవ్వనుంది. అనౌన్స్మెంట్ చేసి స్టేషన్ మాస్టర్‌ను అప్రమత్తం చేసే సౌకర్యం కూడా ఈ మోటార్‌మెన్లకు కల్పించనున్నారు. నడుస్తున్న లోకల్ రైలులో 2012లో తొమ్మిది మంది, 2013 సెప్టెంబర్ వరకు 12 ఇలా 19 మంది గర్భిణులు పురుడు పొసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. ‘సాధారణంగా ప్రసవానికి సమయం దగ్గరపడ్డ నిండు చూలాలును విమానాల్లో అనుమతించారు. కానీ రైళ్లలో అలాంటి నిబంధనలు, ఆంక్షలేమీలేవు. పైగా సుఖప్రయాణం కావడంతో అత్యధిక శాతం గర్భిణులు వాహనాల కంటే రైళ్లలోనే వెళ్లేందుకు ఇష్టపడతారు. విదేశాల్లో రైలులో ప్రసవిస్తే దీన్ని శుభంగా భావించి ఆ బిడ్డకు జీవితాంతం ఉచితంగా రైలులో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. కానీ మన దేశంలో అలాంటి ప్రతిపాదనలేమి లేవని, తల్లిని, బిడ్డను క్షేమంగా ఆస్పత్రులకు చేరవేసే ప్రయత్నాలు చేయడం తప్ప మరేమీ లేద’ని పోలీసులు అంటున్నారు. రెండేళ్ల కాలంలో దాదర్‌లో 3, ఠాణేలో 2, కల్యాణ్‌లో 5, సెంట్రల్ ముంబైలో 4, ఛత్రపతి శివాజీ టెర్మినస్, అంధేరి, బోరివలి, విరార్, వసయి రోడ్ స్టేషన్లలో ఒక్కొక్కరు చొప్పన ఇలా 19 మంది బిడ్డలను ప్రసవించారు. -
పట్టాలు తప్పిన లోకల్ రైలు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్ : డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యుత్ లోకల్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన గుమ్మడిపూండిలో మంగళవారం ఉదయం జరిగింది. చెన్నై నుంచి సోమవారం రాత్రి గుమ్మిడిపూండికి వచ్చిన లోకల్ రైలు షెడ్డులో ఉంది. ఈ రైలు మంగళవారం ఉదయం 4.30 గంటలకు గుమ్మిడిపూండి నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉంది. 4.20 గంటల ప్రాంతంలో డ్రైవర్ లేకపోవడంతో సహాయ డ్రైవర్ షెడ్డు నుంచి 4వ నెంబరు ప్లాట్‌ఫాం మీదకు రైలును తీసుకువస్తున్నాడు. ఆ సమయంలో మామూలుగా 5 కిలోమీటర్లు వేగంతో రావాలి. మలుపు వద్ద 20 కిలో మీటర్ల వేగంతో బండి నడవడంతో 7వ బాక్స్ చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో పెద్ద చప్పుడుతో దుమ్ము, కంకర లేచింది. ఆ సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ సంభాలు నేలకొరిగి పట్టాలకు అడ్డంగా పడిపోయాయి. విద్యుత్ లైన్ తెగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి గుమ్మిడిపూండి వైపు వెళ్లే బండ్లు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చెన్నై రిస్కు టీమ్ ప్రత్యేక రైలులో వచ్చి పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని బిగించారు. ఈ సంఘటన కారణంగా 5 గంటల సేపు గుమ్మిడిపూండికి వచ్చే, వెళ్లే బండ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్ర వైపు నుంచి వస్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును గుమ్మిడిపూండి, పొన్నరి స్టేషన్లో ఆపి ప్రయాణికులను చెన్నైకి తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు చెన్నై నుంచి వచ్చే లోకల్ రైళ్లు పొన్నేరి వరకు నడిచాయి. అధికారులు సకాలంలో స్పందించడంతో ఉదయం 11 గంటలకు రైళ్లు యధావిధిగా నడిచాయి. ఈ సంఘటన వలన ఉదయం వివిధ పనులకు వెళ్లే ఉద్యోగాలు, వ్యాపారులు, విద్యార్థులు, తీవ్ర ఇబ్బంది పడ్డారు. చెన్నై - గుమ్మిడిపూండిల మధ్య ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఏటీవీఎంలకు ఆదరణ
సాక్షి, ముంబై: లోకల్‌రైళ్ల టికెట్ల బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టిన వివిధ పథకాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా సాధారణ కౌంటర్ల వద్ద టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికుల సంఖ్య 50 శాతానికి తగ్గిందని అధికారులు వెల్లడించారు. ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ఏటీవీఎం), జన్సాధారణ్ టికెట్ బుకింగ్ సేవక్ (జేటీబీఎస్) ద్వారా టికెట్లు కొనే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటిని ప్రవేశపెట్టిన తరువాత ప్రయాణికులు టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలో నిల్చొని టికెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే సెంట్రల్ రైల్వే పరిధిలోని స్టేషన్లలో నిత్యం దాదాపు 9.5 లక్షల మంది ప్రయాణికులు టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. వీరిలో 55 శాతం మంది టికెట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాది టికెట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా 65 శాతం మంది ప్రయాణికులు టికెట్లు కొనుగోలు కేయగా, ఈ ఏడాది 55 శాతం మంది మాత్రమే కొనుగోలు చేశారని అధికారి ఒకరు తెలిపారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే చాలా మంది ప్రయాణికులు ఏటీవీఎంలు, జేటీబీఎస్‌ల ద్వారానే టికెట్లను కొనుగోలు చేస్తున్నట్టు స్పష్టమవుతోందని సెంట్రల్రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి కల్లా జేటీబీఎస్, ఏటీవీఎంల టికెట్ల విక్రయాన్ని పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రయాణికులు టికెట్ల కౌంటర్ల వద్ద క్యూల్లో నిల్చుని టికెట్ కొనుగోలు చేసే సమయం లేకపోవడంతో వీటికి ఆదరణ తగ్గిందని ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే గతంలో 66 శాతం మంది ప్రయాణికులు రైల్వే ప్రవేశపెట్టిన టికెట్ కొనుగోల యంత్రాలు, విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదుపాయాలను నవీకరించడంతో పరిస్థితి మెరుగుపడిందని సీఆర్ అధికారి ఒకరు తెలిపారు. గత రెండు నెలల క్రితం వివిధ రైల్వే స్టేషన్లలో 130 ఏటీవీఎంలను ఏర్పాటు చేశామన్నారు. ముంబై డివిజన్లో ప్రస్తుతం 385 ఏటీవీఎంలు ఉన్నాయని పాటిల్ తెలిపారు. ఈ ఏడాదిలోపు కూపన్ వాలిడేటింగ్ మెషీన్లను (సీబీఎం) తొలగించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. గత రెండేళ్లుగా సీవీఎంల ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఇదిలా ఉండగా సెంట్రల్ రైల్వే పరిధిలో 164 జేటీబీఎస్‌లు ఉన్నాయి. 2012 సెప్టెంబర్ నుంచి ఈ పథకం ద్వారా టికెట్ కొనుగోలు చేసే వారి సంఖ్య 50 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దుకాణాలు, ఇతర ప్రైవేట్ సంస్థలు జేటీబీఎస్‌ల ద్వారా టికెట్ విక్రయించుకోవడానికి రైల్వే అనుమతించింది. అంతేకాకుండా సీజన్పాస్ల నవీకరణ కోసం కూడా అనుమతించింది. ఫలితంగా దుకాణదారులు ఒక్కో పాస్‌కు రూపాయి చొప్పున కమీషన్ పొందవచ్చు.