‘చోరీ’ సొత్తు అప్పగింత | theft money given back to the victims | Sakshi
Sakshi News home page

‘చోరీ’ సొత్తు అప్పగింత

Published Fri, Dec 5 2014 10:27 PM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM

‘చోరీ’ సొత్తు అప్పగింత - Sakshi

‘చోరీ’ సొత్తు అప్పగింత

సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో ప్రయాణికులు పొగొట్టుకున్న లేదా మర్చిపోయిన సామగ్రిని రైల్వే పోలీసు కమిషనర్ శుక్రవారం బాధితులకు అందజేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిత్యం ఉరుకులు, పరుగులతో రాకపోకలు సాగించే ముంబైకర్లు రైలు దిగే హడావుడిలో చేతి బ్యాగులు, ప్లాస్టిక్ క్యారీ సంచులు ఇలా ఏదో ఒక వస్తువు మర్చిపోవడం పరిపాటిగా మారింది. అదేవిధంగా కిక్కిరిసిన రైళ్లలో జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించి దొరికినంత దోచుకుపోతుంటారు.

ఇదే తరహాలో మహిళా బోగీల్లో సైతం విలువైన సామగ్రి, ఒంటిపై ఉన్న బంగారు నగలు తెంచుకుని దొంగలు నడిచే రైలులోంచి దూకి పారిపోవడం పరిపాటిగా మారింది. ఇలా ప్రతిరోజూ పశ్చిమ, సెంట్రల్, హార్బర్ లోకల్ రైల్వే మార్గాల పరిధిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతాయి. అయితే పొగొట్టుకున్న వస్తువులపై బాధితులు దాదాపు ఆశలు వదిలేసుకుంటారు. ఒకవేళ ఆ వస్తువులు తిరిగి పొందాలంటే చెప్పులరిగేలా రైల్వే పోలీసు స్టేషన్ల చుట్టు తిరగాల్సిందే.

ఇదిలా ఉండగా, కొంతకాలంగా రైల్వే స్టేషన్లలో దొంగలను పట్టుకోవడానికి ఆర్పీఎఫ్ అధికారులు  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన దొంగల నుంచి రికవరీ చేసిన చోరీ వస్తువులను, తమ వద్ద నమోదైన ఫిర్యాదులను బట్టి బాధితులకు సమాచారమందించి తిరిగి వారికి అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం రైల్వే పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కొందరు బాధితులను పిలిచించి, వారి వస్తువులను తిరిగి అప్పగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement