పిఠాపురం : పిఠాపురంలో కొందరు దొంగలు ‘సెల్’రేగిపోతున్నారు. నెమ్మదిగా వెళుతున్న రైళ్లలో గేట్ల వద్ద ఉన్న ప్రయాణికుల చేతుల్లో సెల్‌ఫోన్లను లాక్కొని పారిపోతున్నారు. ఆటోలు మోటారు సైకిళ్లపై వెళుతున్న ప్రయాణికుల జేబుల్లో సెల్‌ఫోన్లు రెప్పపాటులో ఎగరేసుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. ఆదమరిచి ఉంటే చాలు రైల్లో ఉన్నా, మోటారు సైకిల్‌పై ఉన్నా, ఆటోలో ఉన్నా సెల్‌ఫోన్లు చిటికెలో మాయమవుతున్నాయి. మంగళవారం సామర్లకోట నుంచి వస్తున్న ఒక రైలులో డోరు వద్ద కూర్చొని తన(రూ 60 వేల విలువైన) సెల్‌ఫోన్లో గేమ్ ఆడుకుంటున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను పిఠాపురం గోర్స రైల్వే గేటు దగ్గరకు వచ్చే సరికి కొందరు యువకులు చాకచక్యంగా తస్కరించారు.
గేమ్ ఆడుకుంటున్న యువకుడి చేతిపై కర్రతో కొట్టడంతో సెల్ ఎగిరిపడగా దానిని అందుకున్న ఆ దొంగలు సెల్ అందుకుని పరారయ్యారు. షాక్‌కు గురైన ఆ యువకుడు తేరుకున్న తరుకున్న తరువాత తన స్నేహితుడి ద్వారా పిఠాపురం పోలీసులకు సమాచారమిచ్చాడు. అయితే అప్పటికే ఆ దొంగలు పరారయ్యారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రెండు రోజుల క్రితం రోడ్డు పక్క ఓ వ్యక్తి గాయాలతో ఉండడం చూసి ఒక ఆటో డ్రైవరు తన ఆటోను ఆపి దెబ్బలు తగిలిన వ్యక్తి దగ్గరకు వచ్చి చూసి మళ్లి ఆటో దగ్గరకు వెళ్లే సరికి తన జేబులో ఉన్న సుమారు రూ.17 వేల విలువైన సెల్‌ఫోన్ మాయమైందని బాధితుడు లబోదిబోమంటూ పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ప్రతిరోజూ పదికి పైగా సెల్‌ఫోన్లు పోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పిఠాపురం రథాలపేట, ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు చెడు వ్యసనాలకు బానిసలై ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వారిపై నిఘా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment