మెదక్: కుటుంబ కలహాలతో బంధువులే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నేరం ఎక్కడ బయటపడుతుందో అని మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో కట్టి ఓ రహదారి కల్వర్టు కింద పడేశారు. ఐదు నెలల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బుధవారం మృతుడి అస్థి పంజరాన్ని గుర్తించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొల్లారం సీఐ నయీముద్దీన్ కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్రిజేష్ గోస్వామి(26) జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోగల పోచమ్మ బస్తీలో నివాసం ఉంటూ ఓ పరిశ్రమలో పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు.
గతేడాది ఆగస్టు 6న గోస్వామి కనబడటం లేదని అతని భార్య ఆర్తిదేవీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. గోస్వామి హత్యకు గురయ్యాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గోస్వామి బంధువులను తమదైన శైలిలో విచారించారు. దీంతో గోస్వామిని తామే హత్య చేసినట్లు బంధువులు అజయ్, సీతు, రాజన్, విజయ్ అంగీకరించారు. మృతదేహాన్ని ఖాజీపల్లి ప్రధాన రహదారి కల్వర్టు కింద ఓ ప్లాస్టిక్ సంచిలో పడేసినట్లు నిందితులు వెల్లడించారు.
ఎస్సీ రూపేశ్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ నయీముద్దీన్ తోపాటు పోలీ సులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గోస్వామి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరం మాత్రమే కనిపించింది. మృతదేహంపై ఉన్న బట్టల ఆధారంగా కుటుంబ సభ్యులు గోస్వామి మృతదేహంగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కొన్ని కారణాల వల్ల గోస్వామి తన చెల్లిని కాపురం చేసేందుకు పంపకపోవడంతో కక్ష కట్టి అత్తారింటికి చెందిన బంధువులే హత్య చేసినట్లు సీఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment