రైల్వే మంత్రికి సీఎం వినతిపత్రం
- రాష్ట్రానికి దూర ప్రాంతాల రైళ్లు, అదనంగా 50 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్
- కొత్త ప్రాజక్టులు మంజూరుచేయకపోవడంపై విచారం
సాక్షి, ముంబై : లోకల్ రైళ్లను ఆధునికీకరించనున్నారు. ఈ మేరకు రైళ్లకు ఆటోమెటిక్ డోర్లను అమర్చనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులను సీఎం పృథ్వీరాజ్ చవాన్ కోరారు. అలాగే రైల్వే ప్లాట్‌ఫారాల ఎత్తును కూడా పెంచాలని సూచించారు. సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రమాదాల బారిన పడి ప్రతి యేటా సుమారు 3,300 మంది మృతిచెందుతుండటంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం తగినన్ని మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరారు.
రైల్వేమంత్రికి ముఖ్యమంత్రి వినతి
2014-15 రైల్వే బడ్జెట్‌కు గాను ముఖ్యమంత్రి ఓ మెమొరాండం తయారు చేసి రైల్వే మంత్రి డి.వి.సదానంద్ గౌడ్‌కు గత వారం అందజేశారు. పలు రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిందిగా ఈ నివేదికలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎంయూటీపీ-2 (ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్) కోసం నిధులను సమకూర్చాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు రూ.375 కోట్లు కేటాయించగా ఇంకా రూ.500 కోట్లు అవసరం.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో భౌగోళికంగా పోల్చితే నగరంలో రైల్వే నెట్‌వర్క్‌లో చాలా తక్కువ సదుపాయాలు ఉన్నాయి. ఓ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటికి తమ వంతు వాటా చెల్లించేందుకు రాష్ట్రం కూడా సిద్ధంగా ఉందని చవాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంయూటీపీ-11 ప్రాజెక్ట్ కోసం రూ.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు. రైల్వే నెట్‌వర్క్‌ను మరింత శక్తివంతంగా తీర్చి దిద్దేందుకు అదనంగా కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు అమల్లోకి తేనున్నారు.
సబర్బన్ ప్రాజెక్టు పనులకు..
ఇప్పటికే కొనసాగుతున్న కల్యాణ్-కసారా మూడవ లైన్, నెరూల్-అర్బన్ రైల్వే లైన్, ఇతర సబర్బన్ ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించాల్సిందిగా రైల్వే మంత్రిని సీఎం కోరారని ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారి తెలిపారు. ఎంయూటీపీ-3లో భాగంగా రూ.100 కోట్లతో చేపట్టనున్న ఐరోలి-కల్వా ఎలివేటెడ్ లింక్, పన్వేల్-కర్జన్ డబుల్ లైన్ ప్రాజెక్ట్‌లకు అనుమతులివ్వాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సూచించారని చెప్పారు. ఇటీవల ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
రాష్ట్రానికి దూర ప్రాంతాలకు సంబంధించి మరిన్ని రైళ్ల కోసం కూడా డిమాండ్ చేశారన్నారు. అదనంగా 50 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేశారు. 15 బోగీలకు చెందిన మరిన్ని రైళ్లను కూడా ప్రవేశపెట్టాల్సిందిగా ముఖ్యంత్రి డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నుంచి ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు రైల్వే మంత్రి మంజూరు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం 50 శాతం ఖర్చు భరిస్తున్నప్పటికీ వీటి అనుమతికి, అదేవిధంగా బడ్జెట్‌లో వీటి నిధుల కోసం డిమాండ్ చేశారని వివరించారు.
నిధులు కేటాయించాలి
Published Sat, Jul 5 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement