బండెడు ఆశలు | tomorrow modi government railway budget | Sakshi
Sakshi News home page

బండెడు ఆశలు

Published Mon, Jul 7 2014 12:17 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

బండెడు ఆశలు - Sakshi

బండెడు ఆశలు

రేపు ‘మోడీ' రైల్వే బడ్జెట్
* జిల్లాలోని రైల్వేస్టేషన్లలో సమస్యల హాల్ట్
* రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఏటా అన్యాయమే..
* ప్రతిపాదనలు పంపిన ఎంపీలు
* తెలంగాణ రాష్ర్టంలోనైనా న్యాయం జరిగేనా?

ఆదిలాబాద్ : మోడీ సర్కారు, రైల్వే శాఖ మంత్రి సదానందగౌడపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ప్రయోజనం చేకూరుస్తారని ఆశిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చొరవతో జిల్లాకు విస్తృత రైల్వే కనెక్టివిటీ పెరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. పలు కొత్త రైల్వే మార్గాలు, కొత్త రైళ్లను ప్రారంభించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నారు.

పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో కాకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులను భరించి జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిచేయాలని అంటున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, పెద్దపల్లి ఎం పీ బాల్క సుమన్ జిల్లాకు సంబంధించి పలు ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి కేంద్రానికి వెళ్లిన ప్రతిపాదనలకు మోక్షం కలుగుతుందా! లేదా అనేది మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో తేటతెల్లం అవుతుంది.
 
పొడిగింపుపై ఆశలు

* నాందేడ్-ముంబాయి మార్గంలో రోజూ పయనించే తపోవన్ ఎక్స్‌ప్రెస్ ఆదిలాబాద్ వరకు పొడిగించాలి. తద్వారా ఆదిలాబాద్ నుంచి ముంబాయికి మరో రైలు సదుపాయం కలుగుతుంది.
* నాందేడ్-బెంగళూరు మార్గంలో వారానికి ఒకసారి వెళ్లే రైలును ఆదిలాబాద్‌కు పొడిగించాలి.
* ఢిల్లీ-విశాఖ మధ్యలో నడిచే స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ను మంచిర్యాలలో ఆపాలి.
* జనతా, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లకు రామకృష్ణాపూర్‌లో హాల్టింగ్ కల్పించాలి.
* నవజీవన ఎక్స్‌ప్రెస్, తమిళనాడు, కేరళ ఎక్స్‌ప్రెస్‌లకు మంచిర్యాలలో హాల్టింగ్ కల్పించాలి.
 
 కొత్త రైళ్ల అవసరం

* ఆదిలాబాద్-హైదరాబాద్‌కు ఇంటర్‌సిటీ ట్రైన్ నడపాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది.
* ఆదిలాబాద్-నాగ్‌పూర్‌కు ఇంటర్‌సిటీ ట్రైన్ కల్పించాలి.
* గత బడ్జెట్‌లో మంజూరైన హౌర-పూరి ఎక్స్‌ప్రెస్‌ను వారానికి రెండు రోజులు నడపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీన్ని అకోల-అమరావతి మీదుగా నడపాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్ మీదుగా నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
* హౌరా-నాగ్‌పూర్-వర్దా జంక్షన్, ఆదిలాబాద్-ముత్కేడ్ జంక్షన్, నిజామాబాద్-హైదరాబాద్-విజయవాడ-పూరి మార్గంలో పయనిస్తే ఆదిలాబాద్‌కు అనేక జంక్షన్లతో కనెక్టివిటీ పెరగడం ద్వారా వ్యాపార, వాణిజ్య పరంగానే కాకుండా పర్యాటక, దేవాలయాలకు రైలు మార్గాలు కలుగుతాయి.

* వారణాసి-మైసూర్ మార్గంలో బై వీక్లీ రైలును ఆదిలాబాద్ నుంచి నడపాలి.
* బెంగళూరు-జోధాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను వయా ఆదిలాబాద్ మీదుగా నడపడం ద్వారా రాజస్థాన్‌కు రైలు మార్గం కలుగుతుంది. ఇది వ్యాపార, వాణిజ్య పరంగా ఉపయోగకరం.
* బెల్లంపల్లి-కొత్తగూడెం మధ్యలో కొత్త ట్రైన్‌ను ప్రవేశపెట్టాలి.
* కొత్త ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడపాలి.
* కరీంనగర్-సిర్పూర్(టి) పుష్పుల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 
 రైల్వే డబ్లింగ్

* ఆదిలాబాద్-ముత్కేడ్-సికింద్రాబాద్ మధ్యలో రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. గతంలో ప్రతిపాదనలు పెట్టినా నిధులు మంజూరు కాలేదు. 452 కిలోమీటర్ల పరిధిలో డబుల్ లైన్ చేపట్టాల్సి ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్‌ను ఆనుకొని 50 శాతం మంది ప్రజలు ఉన్నారు.

* ప్రతిరోజూ రైళ్లు వచ్చీ పోయే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద సుమారు 50 సార్లు గేటు వేస్తారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 2005-06 బడ్జెట్‌లో రూ.238 కోట్లు ప్రతిపాదించినా మంజూరు చేయకపోవడంతో మోక్షం కలుగలేదు. ఇప్పుడు దాని బడ్జెట్ నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. మంచిర్యాల ఏసీసీ వద్ద, కాగజ్‌నగర్‌లో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
 
సదుపాయాలు ఏవీ..?

* మంచిర్యాల మీదుగా వెళ్లే భాగ్యనగర్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లను 24 కోచ్‌లకు పెంచాలని డిమాండ్ ఉంది.
* ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్ అయినప్పటికీ సరైన సదుపాయాలు లేవు. ఈ విషయంలో చర్యలు అత్యవసరం.
* తాండూరు మండలం రేచిని స్టేషన్‌లో గేట్ నెంబర్ 66 వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది.
 
 సెంట్రల్ రైల్వేలోకి మార్చితే..


 దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్) పరిధిలోకి వచ్చే నాందేడ్ రైల్వే డి విజన్‌లోనే ఆదిలాబాద్ స్టేషన్ ఉంది. దీంతో పాటు ఉండం, తల మడుగు, కోసాయి స్టేషన్లు కూడా మన జిల్లాలోనివే. ఈ నాలుగు స్టేషన్‌లు మినహాయిస్తే నాందేడ్ డివిజన్‌లోని 262స్టేషన్లు మహా రాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డివిజన్‌పై అటు రైల్వే లైన్ల పరంగా కొత్త రైళ్ల విషయంలోనూ చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో నాందేడ్ డివిజన్‌ను మధ్య రైల్వే(సీఆర్)లోకి మార్చాలనే డిమాండ్ ఉంది. సెంట్రల్ రైల్వేలో విస్తృ త రైల్వే కనెక్టివిటీతో పాటు అన్ని ప్రాంతాలకు రైళ్లు అందుబాటులో ఉ న్న దృష్ట్యా ఇందులో కలిపితే నాందేడ్ డివిజన్ అభివృద్ధి చెందుతుందని రైల్వే బోర్డు నాయకులతో పాటు పలువురు అభిప్రాయ పడుతున్నారు.
 
పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లు
 
* ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని గడ్‌చందూర్ రైల్వే లైన్ సర్వే కోసం 2011-12 బడ్జెట్‌లో రూ.17.70 లక్షలు కేటాయించారు. 62 కిలోమీటర్ల పరిధిలో ఈ లైను కోసం సర్వే చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆది లాబాద్ జిల్లాలో 32 కిలోమీటర్లు మన పరిధిలోకి రాగా, మిగితా కిలోమీటర్లు మహారాష్ట్ర పరిధిలోకి వస్తున్నాయి. సర్వే పూర్తయినా మలి బడ్జెట్‌లో రైల్వే లైన్ నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు.

* పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, పబ్లిక్ 30 శాతం నిధులు వెచ్చించి ఈ నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కొర్రి పెట్టింది. ఇటు సమైక్య రా ష్ట్రంలోనూ దీనిపై పట్టించుకోలేదు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గతేడాది న్యూఢిల్లీలో జరిగిన రైల్వే నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌లో నిధులు వెచ్చించేందుకు సిద్ధపడిం ది. అక్కడ నిర్మాణ పనులకు టెండర్లు కూడా జరిగాయి.

* ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పీపీ పీ పద్ధతిన కాకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి ఈ నిర్మాణం చేపట్టాలని అధికార, ప్రతిపక్ష నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గడ్‌చాందూర్‌కు రైల్వేలైన్ పూర్తయిన పక్షంలో ఆదిలాబాద్ రైల్వే ప్రయాణికులకు విస్తృత రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది. గడ్‌చాందూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బల్లార్ష జంక్షన్ ఉండడంతో ఉత్తర, దక్షిణ భారతదేశాలకు అనేక రైలు సదుపాయాలు ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది.

* ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి 1572 కిలోమీటర్ల పరిధిలో కాచిగూడ మీదుగా వెళ్తోంది. గడ్‌చాందూర్ లైన్ పూర్తయితే ఆదిలాబాద్ మీదుగా న్యూఢిల్లీ వెళ్లేందుకు 242 కిలోమీటర్లు తగ్గుతుంది. ఈ ట్రాక్ నిర్మాణం ఇటు ఆదిలాబాద్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుండగా రైల్వేకు లాభం కూడా మిగుల్చుతుంది.
   
* ఆదిలాబాద్ నుంచి పటాన్‌చెరు రైల్వే లైన్ సర్వే కోసం 2010-11లో రూ.47.55 లక్షలు మంజూరయ్యాయి. 2013లో సర్వే పూర్తయ్యింది. ఆదిలాబాద్, తలమడుగు, నిర్మల్, ఆర్మూ ర్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ మీదుగా పటాన్‌చెరుకు 371 కిలోమీటర్లలో ఈ లైన్‌ను గుర్తించారు. అయితే సాంకేతిక సమస్యలు, మరేమోగానీ దీనివైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రతి బడ్జెట్‌లో దీని ఊసే ఉండడం లేదు.
   
* ఆదిలాబాద్-ఉట్నూర్-మంచిర్యాల రైల్వే లైన్ కోసం 2013-14 బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు మంజూరు చేసి సర్వే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు రైల్వేలైన్ ఏర్పడితే ఉట్నూర్ ప్రాంత గిరిజనులకు కూడా రవాణా సదుపాయాలు పెరుగుతాయి.
   
* ఆదిలాబాద్-నిర్మల్-ఆర్మూర్ రైల్వేలైన్‌దీ ఇదే పరిస్థితి. దీని సర్వే పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇది జరిగితే హైదరాబాద్‌కు మహారాష్ట్ర మీదుగా తిరిగి వెళ్లాల్సిన దుస్థితి తప్పుతుంది.
* వశిం, మహోర్,ఆదిలాబాద్,ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
* మంచిర్యాల-చెన్నూరు మధ్యలో కొత్త రైల్వే లైన్ నిర్మించాలని డిమాండ్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement