రైలూ లేదు.. జోనూ లేదు
- రైల్వే బడ్జెట్‌లో వాల్తేరు రైల్వేకు మొండిచేయి
- జోన్ ఊసేలేదు.. కొత్త ప్రాజెక్టులు అసలే లేవు
విశాఖపట్నం: రైల్వే జోన్ అదిగో ఇదిగో అంటూ ఇన్నాళ్లు ఊరించి ఇప్పుడు ఆ ప్రస్తావనే తేలేదు. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు, వాల్తేరు రైల్వేకి అన్యాయమే జరిగింది. జోన్ వస్తుందో లేదో కూడా స్పష్టం చేయలేదు. ఒడిశా రాజకీయ లాబీయింగ్ ముందు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరలేదు. దశాబ్దాల రైల్వే జోన్ డిమాండ్ మళ్లీ మొదటికొచ్చినట్టయింది.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, విశాఖ ఎంపీ హరిబాబుల సంయుక్త ప్రకటనలు సైతం కార్యరూపం దాల్చలేదు. విశాఖ వాసుల రైల్వే జోన్ కల మళ్లీ కల్లలైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రైల్వే జోన్ గ్యారంటీగా వస్తుందని స్పష్టం కావడంతో దాన్ని విశాఖ కేంద్రంగానే ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో
స్పష్టం చే సింది.
తూర్పు కోస్తాలో అన్యాయమవుతున్న విశాఖను జోన్ చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలంటూ రైల్వే మంత్రికి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసి ఇద్దరి సభ్యులకు కమిటీలో స్థానం కట్టబెట్టినా జోన్ విషయం బడ్జెట్ పుస్తకంలోకి ఎక్కకపోవడాన్ని నగరవాసులు ఆక్షేపిస్తున్నారు. వెంకయ్యనాయుడు రైల్వే జోన్ కావాలని రైల్వే మంత్రికి, రైల్వే బోర్డు చైర్మన్‌కు చెప్పిన తర్వాత ఆయన మాట కొట్టేయలేరని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. అందుకే ఈ బడ్జెట్‌పై ఉత్తరాంధ్రవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ బడ్జెట్ అందర్నీ నిరాశపరిచింది.
ప్రాజెక్టులేవీ..
కొత్త ప్రాజెక్టుల కోసం ఉత్తరాంధ్ర వాసులు కలలుగన్నారు. డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రికల్ లోకోషెడ్‌లను విస్తరిస్తారనుకున్నారు. అగనంపూడి వద్ద వ్యాగన్ వర్క్‌షాప్ మంజూరవుతోందని భావించారు. స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా మరిన్ని రైల్వే పరిశ్రమలు విశాఖకు వస్తాయనుకున్నారు. కానీ ఒక్క ప్రాజెక్టూ రాకపోయేసరికి అంతా ఉసూరుమన్నారు.