సాక్షి, ముంబై: మంత్రతంత్రాల పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తున్న బాబాలు లోకల్ రైళ్లలో తమ ప్రకటనలు అతికిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ రైల్వే శాఖ నిర్ణయించింది. మంత్రతంత్రాలు, మాయలతో సమస్యలు పరిష్కరిస్తామని మోసగిస్తూ లోకల్ రైళ్లలో అనేకమంది బాబాలు ప్రకటనలు అతికిస్తున్న విషయం తెలిసిందే. ప్రేమవివాహం, పనులు జరుగుతాయని, వశం చేసుకోవడం, అప్పులు తొలగిపోవడం, సంతానప్రాప్తి తదితర సమస్యలకు 100 శాతం పరిష్కార సమాధానం లభిస్తుందని కొందరు బాబాల పేరిట ప్రకటనలు గుప్పిస్తారు. వారి ప్రలోభానికి లొంగి అనేకమంది మోసపోతారు. ఈ బాబాల అకృత్యాలను అరికట్టేందుకు రైల్వే శాఖ అనేక ప్రయత్నాలు చేసినా ప్రకటనలు అతికించడాన్ని అరికట్టలేకపోయింది.
అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రతంత్రాలకు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేయడంతో బాబాగిరీ చేసేవారు ఆందోళనలో పడిపోయారు. ఈ బిల్లుతో రైల్వేకు సహకారం దొరికినట్లయింది. అమాయకులను మోసం చేసే ప్రకటనలు అతికించే వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. పశ్చిమ రైల్వే మార్గంలో జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రకటనలతో ప్రయాణికులను మోసం చేస్తున్న సుమారు 156 మందిపై చర్యలు తీసుకుంది. ఈ చర్యల్లో రూ.1.52 లక్షల జరిమానా వసూలు చేసింది. అంతేకాకుండా ఆరుగురికి జైలు శిక్ష విధించింది. ఈ చర్యలను మరింత బలపర్చడం కోసం పశ్చిమ రైల్వే మోసం చేసే ప్రకటనలు అతికించేవారిపై ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.