సాక్షి, ముంబై: ముంబైకర్ల సహనం కట్టలు తెంచుకోకముందే లోకల్ రైళ్లలో సామాన్యులందరికి ప్రయాణాలకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా అందరికోసం లోకల్ రైళ్లు ప్రారంభిస్తే ఎంతో మంచిదని ఆ లేఖలో పేర్కొన్నారు. సాధారణ ప్రజానీకం సహనం నశించకముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ తరువాత లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పేద, సామాన్య ప్రజలు, కూలీలు, కార్మికులు, కష్టజీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యం రూ.100–150 బస్సు చార్జీలు చెల్లించే ఆర్థిక స్థోమత లేక సతమతం అవుతున్నారు. దీంతో అనేక మంది విధులకు వెళ్లలేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. ప్రస్తుతం ముంబైలోని దాదాపు అన్ని కార్యాలయాలు, షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అందరికి ఇంటి నుంచి విధులు నిర్వహించే సౌకర్యం లేదు. లోకల్ రైళ్లలో అనుమతి లేకపోవడంతో శివారు ప్రాంతాల నుంచి ముంబైకి విధులకు రావాలంటే చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, రాష్ట్రంలో ఇంకా లాక్‌డౌన్ కొనసాగింపుపై రాజ్ ఠాక్రే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లాక్‌డౌన్ ఇంకా ఎన్ని నెలలు అమలులో ఉంటుంది..? గత ఏడాదిన్నర నుంచి సామాన్యులు, పేదలు లోకల్ రైలు సేవలను ఉపయోగించుకోలేక పోతున్నారు.
గంటల తరబడి రోడ్డు మార్గం ద్వారా ముంబైకి చేరుకుంటున్నారు. బస్సుల్లో అనుమతిస్తున్నప్పటికీ రద్దీ విపరీతంగా ఉంటోంది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. రద్దీవల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమూ లేకపోలేదు. వారి సహనం, ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే లోకల్ రైళ్లలో అనుమతించాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్ పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అర్ధరాహిత్యమని ఆ లేఖలో రాజ్ ఠాక్రే విమర్శించారు. ప్రభుత్వానికి లాక్‌డౌన్ అమలు చేయడం తప్ప ఇతర ప్రత్యామ్నాయ ఆలోచనలు రావడం లేదా అంటూ నిలదీశారు. ‘ఇదివరకే ముంబైకర్లందరి కోసం లోకల్ రైలు సేవలు ప్రారంభించాల్సి ఉంది. జాప్యం జరిగినప్పటికీ ప్రజలు ఎంతో సహనం పాటించారు.
ఇక వారి ఓపిక నశించి ఉండవచ్చు’అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా వ్యవహరించని పక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. లోకల్ రైళ్లలో అనుమతించాలని డిమాండ్ చేస్తూ సామాన్యులు, కూలీలు, కష్టజీవులు, ఇతర ప్రయాణికులు ఆందోళనలు చేపడితే ఎమ్మెన్నెస్ వారికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అందరినీ కాకుండా కనీసం కరోనా రెండు డోసుల టీకాలు తీసుకున్న వారినైనా లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని రాజ్ ఠాక్రే ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment