సాక్షి, ముంబై: ముంబైకర్లకు లైఫ్ లైన్‌గా పేరుగాంచిన లోకల్ రైళ్లు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. గడచిన ఎనిమిది నెలల్లో సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాలలో నడుస్తున్న రైళ్ల నుంచి కిందపడి ఏకంగా 415 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఇదే ఎనిమిది నెలల్లో మూడు రైల్వే మార్గాలపై 1,605 మంది వివిధ కారణాలవల్ల మరణించినట్లు ముంబై లోకల్ రైల్వే పోలీసు రికార్డుల్లో నమోదైంది. అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రైలు నుంచి కిందపడి, వివిధ కారణాలవల్ల మొత్తం 2,020 మంది మరణించినట్లు స్పష్టమవుతోంది.
కరోనా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేసింది. దీంతో ముంబై జనజీవనం యథాతథంగా గాడిన పడింది. కాని లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ గతంతో పోలిస్తే లోకల్ రైళ్లలో ప్రతీరోజు 20 లక్షల మంది ప్రయాణికులు తగ్గిపోయారని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో రద్దీ తగ్గిపోయి డోరు బయట వేలాడే వారి సంఖ్య తగ్గిందని రైల్వే పోలీసులు అంటున్నారు. మరోపక్క ఏసీ లోకల్ రైళ్లు ప్రవేశపెట్టడం వల్ల వాటి డోర్లు మూసుకోవడంతో రైలు నుంచి కిందపడే వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
కాని వాస్తవ పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో (సబర్బన్ రైల్వే స్టేషన్లలో మరియు చుట్టుపక్కల), రైలు సర్వీసులు లేవని భావించి, లైన్లు దాటడం ద్వారా ప్రజలు షార్ట్ కట్‌లను తీసుకుంటారని, ఇదే ప్రమాదానికి కారణమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ఇలాంటి అనేక ప్రమాదాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు.
అయితే, రైల్వే లైన్లలో మరణాలకు అక్రమ ఎంట్రీ పాయింట్లే కారణమని పౌరులు పేర్కొంటున్నారు. ‘రైల్వేలు రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిపే ట్రాక్‌ల మధ్య కంచెలు వేయాలి, ట్రాక్ క్రాసింగ్‌ల సంఖ్యను తగ్గించాలి. రద్దీ, నడుస్తున్న రైళ్ల నుండి పడిపోయే వ్యక్తుల సమస్యను తగ్గించడానికి లోకల్ రైళ్ల తలుపులు మూయడం లాంటి మరిన్ని ప్రయోగాలు చేయాలి’ అని వారు అంటున్నారు.
ఒకప్పుడు లోకల్ రైళ్లలో ఉదయం, సాయంత్రం వేళ్లలో మాత్రమే విపరీతంగా రద్దీ ఉండేది. ఇంటికి తొందర చేరుకోవాలనే తపనతో డోరు వద్ద వేలాడుతూ ప్రయాణించేవారు. కాని ఇప్పుడు అనేక ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్ధలు తమ ఉద్యోగులకు వేర్వేరు షిప్టుల్లో విధులు అప్పగించడంతో పగలు కూడా రద్దీ ఉంటుంది. ఫలితంగా పనులకు చేరుకునే సమయంలో, విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వేలాడుతూ ప్రయాణించక తప్పడం లేదు. దీంతో ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో నడుస్తున్న రైలు నుంచి కందపడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగినట్లు స్పష్టమైతోంది.
ముఖ్యంగా రైలు పట్టాలు దాటుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య మొదటి స్ధానంలో ఉండగా రైలు నుంచి పడి మృతి చెందుతున్నవారి సంఖ్య రెండో స్ధానంలో ఉంది. ఎనిమిది నెలల్లో వివిధ కారణాలవల్ల మొత్తం 1,605 మంది మృతి చెందగా, అందులో పట్టాలు దాటుతూ 767 మంది మృతి చెందిన వారున్నారు. రైల్వే పోలీసులు అందించిన వివరాల ప్రకారం 2019 జనవరి నుంచి ఆగస్టు వరకు నడుస్తున్న రైలు నుంచి కిందపడి 405 మంది మృతి చెందగా అంతే సంఖ్యలో గాయపడ్డారు. అదేవిధంగా 2020లో అదే ఎనిమిది నెలల్లో 306 కిందపడి గాయపడగా 142 మంది మరణించారు.
2021లో 244 మంది గాయపడగా 142 మృతి చెందారు. కాని 2022లో ఎనిమిది నెలల్లో రైలు పట్టాలు దాటుతూ 767 మంది మృతి చెందగా 140 గాయపడ్డారు. గడచిన ఎనిమిది నెలల్లో లోకల్ రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల కిందపడి గాయపడిన, మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మృతుల్లో, గాయపడిన వారిలో పురుషులే ఎక్కువ ఉన్నారు. కాగా ఈ ఎనిమిది నెలల్లో లోకల్ రైలు నుంచి కిందపడి 642 మంది గాయపడగా 415 మంది చనిపోయారు. మృతుల్లో 38 మంది మహిళలుండగా 377 మంది పురుష ప్రయాణికులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment