సాక్షి ముంబై: సెంట్రల్ రైల్వే పరిధిలోని ఠాణే-కల్యాణ్ మార్గంలోని లోకల్‌రైళ్లలో పదింటిని తొలగించారు. రైళ్ల ఇంజిన్ల కరెంటును మార్చడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మార్గంలోని లోకల్ రైళ్ల సమయసూచికలోనూ భారీ మార్పులు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ‘ఏసీ-డీసీ’ విద్యుత్ ప్రవాహం మార్పు వల్ల ఠాణే-కల్యాణ్ మార్గంలో కొత్త సమస్యలు తలెత్తాయి. మోటార్‌మెన్ల సమ్మె, పట్టాలకు పగుళ్లు పడటం, సిగ్నల్ సమస్య తలెత్తడం తదితర సమస్యలతో ఈ మార్గంలో రైళ్లకు తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘ఏసీ’ విద్యుత్‌తో లోకల్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయి. ముంబై సీఎస్టీ నుంచి కళ్యాణ్ వరకు సేవలు అందించే లోకల్‌రైళ్లు ‘డీసీ’ కరెంటుతో నడుస్తున్నాయి. దీంతో సెంట్రల్ రైల్వే విభాగం రైళ్లలో కరెంటు సరఫరాను ‘డీసీ’ నుంచి ‘ఏసీ’కి మార్చే పనులను ప్రతి ఆదివారం నిర్వహించే మెగాబ్లాక్ రోజున చేపట్టింది. మొదటి విడతలో ఠాణే నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు ఐదు, ఆరో లైన్లను ‘డీసీ’ నుంచి ‘ఏసీ’ విద్యుత్‌కు మార్చారు.
రెండో విడతలో ఠాణే నుంచి కల్యాణ్ వరకు పనులు పూర్తి చేశారు. ఈ పనుల వల్ల సెంట్రల్ రైల్వేకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఇకపై ‘డీసీ’ కరెంటుతో ప్రయాణించే 10 లోకల్ రైళ్లు కేవలం సీఎస్టీ నుంచి ఠాణే వరకు మాత్రమే నడుస్తాయి. ఠాణే తర్వాత ఏసీ కరెంటు లభించదు కాబట్టి వీటి సేవలు ఉండబోవు. ఇది వరకు మొత్తం 75 లోకల్ రైళ్లు ఠాణే తరువాత కూడా నడిచేవి. ఇప్పులు కేవలం 65 మాత్రమే సేవలు అందిస్తాయి. మరో సమస్య ఏమిటంటే.. లోకల్ రైళ్ల టైమ్ టేబుల్‌లో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘డీసీ’ రైళ్ల సంఖ్య తగ్గింది కాబట్టి ఇతర రైళ్లతో టైమ్ టేబుల్‌ను కలపాల్సి వస్తుంది. దీంతో లోకల్ రైళ్ల సమయాలు చాలా వరకు మారిపోనున్నాయి. ఒక లోకల్ రైలు రోజుకు 10 ట్రిప్పులు వేస్తుంది. ఆ ప్రకారంగా సుమారు 100 ట్రిప్పులపై ప్రభావం పడనుంది. సీఎస్టీ-ఠాణే మార్గంలో ప్రతి రోజు ‘డీసీ’ లోకల్ రైళ్లు 218 ట్రిప్పులు ఉండేవి. వాటిలో సీఎస్టీ-కుర్లా, సీఎస్టీ-ఘాట్కోపర్, దాదర్-ఠాణే రైళ్లు కూడా ఉన్నాయి. సీఎస్టీ వరకు అన్ని లైన్లలో ‘ఏసీ’గా మార్చేందుకు సెంట్రల్ రైల్వేకు మే నెల వరకు సమయం పడుతుంది.
10 లోకల్ రైళ్లు పాక్షికంగా రద్దు
Published Sun, Jan 12 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement