సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు మొదలయ్యే గర్భిణుల కోసం వెంటనే రైలు ఆపేందుకు మోటార్‌మెన్లకు రైల్వేశాఖ అనుమతి ఇవ్వనుంది. ప్రయాణికులను సమయానికి చేరవేయడం కంటే ప్రసవం తర్వాత తల్లి, బిడ్డ ప్రాణాలు కాపాడడమే ముఖ్యమని రైల్వే భావించి ఈ నిర్ణయం తీసుకుందని సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. కర్జత్, కల్యాణ్, ఠాణే తదితర శివారు ప్రాంతాల్లో ఉంటున్న పేదలు, గర్భిణులు వివిధ పరీక్షల కోసం ముంబైలోని కార్పొరేషన్, ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తారు. రోడ్డు మార్గం కంటే రైలు ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. పైగా సమయం, చార్జీలు కలిసివస్తాయి.
దీంతో ట్యాక్సీలు, ఆటోలకు బదులుగా అనేక మంది గర్భిణులు ప్రసవానికి రోజులు దగ్గరపడడంతో ముందుగానే అడ్మిట్ అయ్యేందుకు ఆస్పత్రికి వస్తుంటారు. కానీ ప్రసవ వేదనను అదుపుచేయడం ఎవరి చేతిలో లేదు. అనేక మంది గర్భిణులు నడిచే లోకల్ రైలులోనే ప్రసవించే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు ఫాస్ట్ లోకల్ రైళ్లనే ఆశ్రయిస్తారు. అనేక సందర్భాలలో రైలు నడుస్తుండగానే గర్భిణులకు ప్రసవ వేదన మొదలవుతుంది. కానీ ఎక్కిన రైలు ఫాస్ట్ లోకల్ కావడంతో నిర్దేశించిన స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అప్పటికే పురిటి నొప్పులు మొదలు కావడంతో రైలు స్టేషన్‌లో ఆగేంత వరకు సమయం ఉండదు. తోటి ప్రయాణికుల సహాయంతో ప్రసవం సుఖంగా జరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుంది.
దీంతో తల్లి, బిడ్డ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలుంటాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రసవ వేదన మొదలైతే గొలుసు లాగితే వచ్చే స్టేషన్‌లో వారిని భద్రంగా దింపేంత వరకు రైలుకు ‘ఎమర్జెన్సీ హాల్టు’ ఇచ్చేందుకు మోటార్‌మెన్లకు అనుమతి ఇవ్వనుంది. అనౌన్స్‌మెంట్ చేసి స్టేషన్ మాస్టర్‌ను అప్రమత్తం చేసే సౌకర్యం కూడా ఈ మోటార్‌మెన్లకు కల్పించనున్నారు. నడుస్తున్న లోకల్ రైలులో 2012లో తొమ్మిది మంది, 2013 సెప్టెంబర్ వరకు 12 ఇలా 19 మంది గర్భిణులు పురుడు పొసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. ‘సాధారణంగా ప్రసవానికి సమయం దగ్గరపడ్డ నిండు చూలాలును విమానాల్లో అనుమతించారు.
కానీ రైళ్లలో అలాంటి నిబంధనలు, ఆంక్షలేమీలేవు. పైగా సుఖప్రయాణం కావడంతో అత్యధిక శాతం గర్భిణులు వాహనాల కంటే రైళ్లలోనే వెళ్లేందుకు ఇష్టపడతారు. విదేశాల్లో రైలులో ప్రసవిస్తే దీన్ని శుభంగా భావించి ఆ బిడ్డకు జీవితాంతం ఉచితంగా రైలులో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. కానీ మన దేశంలో అలాంటి ప్రతిపాదనలేమి లేవని, తల్లిని, బిడ్డను క్షేమంగా ఆస్పత్రులకు చేరవేసే ప్రయత్నాలు చేయడం తప్ప మరేమీ లేద’ని పోలీసులు అంటున్నారు. రెండేళ్ల కాలంలో దాదర్‌లో 3, ఠాణేలో 2, కల్యాణ్‌లో 5, సెంట్రల్ ముంబైలో 4, ఛత్రపతి శివాజీ టెర్మినస్, అంధేరి, బోరివలి, విరార్, వసయి రోడ్ స్టేషన్లలో ఒక్కొక్కరు చొప్పన ఇలా 19 మంది బిడ్డలను ప్రసవించారు.
పురిటి నొప్పులొస్తే రైలు ఆపొచ్చు
Published Sat, Oct 5 2013 12:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement
Advertisement