సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్... సిటీజనులకు అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి లోకల్ ట్రైన్. 2003లో పాతబస్తీలోని ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి స్టేషన్ల నుంచి లింగంపల్లి వరకు ఒక ‘లైఫ్‌లైన్’గా మొదలైన ఎంఎంటీఎస్ రైలు కరోనా కారణంగా మొట్టమొదటిసారి నిలిచిపోయింది. ఇక అన్‌లాక్ తర్వాత మెట్రో రైళ్లు, సిటీ బస్సులను పునరుద్ధరించారు. ముంబయి లోకల్ రైళ్లు మూడు నెలల క్రితమే పట్టాలెక్కాయి. కానీ ఎంఎంటీఎస్ మాత్రం 9 నెలలుగా నిలిచిపోయింది. అంతేకాదు. గ్రేటర్ హైదరాబాద్‌ని శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 8 ఏళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ సైతం ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. కోవిడ్ సాకుతో ఒకవైపు ఇప్పటికే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు పూర్తవుతాయా అనే సందేహం నెలకొంది.
అక్కడ అలా... ఇక్కడ ఇలా...
- లాక్‌డౌన్‌తో అన్ని దూరప్రాంత రైళ్లతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులను మార్చి 23వ తేదీ నుంచి నిలిపివేశారు. నిబంధనల సడలింపు తరువాత దశలవారీగా 200 రెగ్యులర్ రైళ్ల స్థానంలో సుమారు 72 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించారు.
- ఇదే సమయంలో ముంబయి, కోల్‌కత్తా వంటి నగరాల్లో రాకపోకలు సాగించే లోకల్ రైళ్లలో 50 శాతానికి పైగా నడుస్తున్నాయి.
- నగరంలో లింగంపల్లి–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి స్టేషన్‌ల మధ్య నడిచే 121 రైళ్లలో ఇప్పటి వరకు ఒక్క సర్వీసును కూడా పునరుద్ధరించకపోవడం గమనార్హం.
- ఈ 9 నెలల్లో ఎంఎంటీఎస్ రైళ్లపైన దక్షిణమధ్య రైల్వే రూ.కోటి వరకు ఆదాయాన్ని కోల్పోయింది. కానీ అంతకంటే ముఖ్యంగా కేవలం రూ.15 టిక్కెట్‌తో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సదుపాయం నగరవాసులకు దూరమైంది.
- ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎంఎంటీఎస్ రైళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- నెలవారీ పాస్‌లపైన రాకపోకలు సాగించే సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఆ సదుపాయానికి దూరమయ్యారు.
- రెండో దశపైన ప్రతిష్టంభన...
- ఎనిమిదేళ్ల క్రితం 2013లో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
- పటాన్‌చెరు, ఘట్కేసర్,మేడ్చెల్, ఉందానగర్, శంషాబాద్,తదితర నగర శివార్లను కలుపుతూ చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో ఇప్పటి వరకు తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 5.75 కిలోమీటర్‌లు, బొల్లారంమేడ్చెల్ (14 కిలోమీటర్‌లు) మాత్రం పూర్తయ్యాయి.
- బొల్లారంసికింద్రాబాద్ మధ్య రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు కూడా పూర్తి చేసి రైళ్లు నడిపేందుకు అనుకూలమేనని సర్టిఫికెట్ ఇచ్చింది.
- సుమారు రూ.850 కోట్ల అంచనాలతో 88.05 కిలోమీటర్‌ల మేర రెండో దశ కింద చేపట్టారు.
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన సుమారు రూ.500 కోట్లు అందకపోవడం వల్లనే బోగీల కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడిందనీ, దాంతో పూర్తయిన మార్గాల్లో రైళ్లను నడుపలేకపోతున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కానీ రైళ్ల ప్రైవేటీకరణ కారణంగానే కొత్త ప్రాజెక్టులపైన నిర్లక్ష్యం కొనసాగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లడం కష్టమే!)
Comments
Please login to add a commentAdd a comment