సాక్షి, ముంబై: లోకల్ రైల్వే పరిధిలో నేరాలను నిరోధించేందుకు డోన్‌ల ద్వారా నిఘా వేయాలని, శాంతి భద్రతలు పర్యవేక్షించాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ముంబై రీజియన్ పరిధిలోని రైల్వే యార్డులు, వర్క్ షాపులు, రైల్వే స్టేషన్లు, స్టేషన్ బయట రైల్వే హద్దులో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నారు. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ‘నింజా యూఏవీ డ్రోన్’లను కొద్దిరోజుల ముందే కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఒక డ్రోన్ సెంట్రల్ రైల్వే ఆధీనంలోకి వచ్చింది. మరికొన్ని డ్రోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. లోకల్ రైల్వే హద్దులో రైలు పట్టాల వెంబడి అక్కడక్కడ జూదం అడ్డాలున్నాయి.
అక్కడ మద్యం సేవించడం, పేకాట ఆడటంలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. వీటితోపాటు వర్క్ షాపులు, యార్డులు, లూప్‌లైన్‌లో ఆగి ఉన్న రైలు బోగీల నుంచి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. రైల్వే ట్రాక్‌కు ఆనుకుని ఉన్న మురికివాడల ప్రజలు ఈ చోరీలకు పాల్పడుతున్న వెలుగులోకి వచ్చింది. వర్క్ షాపులు, యార్డుల నుంచి రాత్రి వేళల్లో చోరీలు జరుగుతున్నాయి. అందుకు రైల్వే సిబ్బంది సహకారం ఉంటుందని పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు. అదేవిధంగా రైల్వే ట్రాక్‌లపై, ప్లాటఫారాల పక్కన చెత్త వేయడం, స్టేషన్ బయట రైల్వే హద్దులో అక్రమంగా స్థలం ఆక్రమించుకుని వ్యాపారులు చేసుకోవడం. వచ్చిపోయే ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. వీటిని అరికట్టడంతో పాటు వీటన్నింటిపై నిఘా వేయడానికి రైల్వే డ్రోన్ల సాయం తీసుకుంటోంది.
పశ్చిమలో కొత్త సీసీటీవీ కెమెరాలు
రైల్వే స్టేషన్, పరిసరాల్లో నేరాలను నియంత్రించేందుకు అదనంగా మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే ఇటీవలె నిర్ణయం తీసుకుంది. వీటిని చర్చిగేట్–విరార్ స్టేషన్ల మధ్య లోకల్ రైల్వే హద్దులో ఏర్పాటు చేయనుంది. పాత సీసీటీవీ కెమెరాలు తొలగించి వాటి స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన 2,729 కెమెరాలను అమర్చనున్నారు. దీంతో ఏదైనా నేరం జరిగితే ఈ కెమెరాల ద్వారా దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. రైల్వే పోలీసులు నేరస్తులను సునాయాసంగా పట్టుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ మార్గంలో లోకల్ రైల్వే స్టేషన్ పరిధిలో 1,200 సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిని తొలగించి వాటి స్థానంలో 2,729 అధునాతన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంటే అదనంగా 1,529 సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి.
తెరపైకి మహిళల భద్రత..
రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులపై ప్రధానంగా మహిళలు, యువతులను ఈవ్‌టీజింగ్ చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటివి జరుగుతున్నాయి. దీంతో మహిళా ప్రయాణికుల భద్రత తెరమీదకు వచ్చింది. ఇదివరకే మహిళ బోగీలలో సీసీటీవి కెమెరాలు బిగించారు. కానీ, అనేక సందర్భాలలో అవి పని చేయకపోవడం, రైలు కదలడం వల్ల అందులో రికార్డయిన వీడియో క్లిప్పింగులు స్పష్టంగా కనిపించకపోవడం లేదా కెమెరాల డైరెక్షన్ మారిపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. దీంతో ప్లాట్‌ఫారాలపై, రైల్వే స్టేషన్ ఆవరణలో అదనంగా మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం గతంలోనే తీసుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కెమరాల వల్ల అందులో రికార్డయిన క్లిప్పింగులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో రైల్వే పోలీసులు ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే నేరస్తులను పట్టుకోవడంలో సఫలీకృతులవుతారు. రైల్వే స్టేషన్, పరిసరాల్లో 2,729 ఆధునిక సీసీటీవీ కెమెరాలు అమర్చడంవల్ల మహిళలతోపాటు సామాన్య ప్రయాణికులకు మరింత భద్రత కల్పించినట్లవుతుందని అధికారులు తెలిపారు.
ఆధునిక కెమెరాలు అమర్చే స్టేషన్లు
బోరివలి (అత్యధికంగా)–325, ముంబై సెంట్రల్ టెర్మినస్–315, బాంద్రా టెర్మినస్–170, అంధేరీ–192, చర్చిగేట్–157, గోరేగావ్–137, జోగేశ్వరీ–136, కాందివలి–116, బోయిసర్–115, దహిసర్–113 స్టేషన్లతోపాటు మెరైన్ లైన్స్, చర్నిరోడ్, గ్రాంట్‌రోడ్, మహాలక్ష్మి, లోయర్ పరేల్, ప్రభాదేవి, దాదర్, మాటుంగా, మాహీం, బాంద్రా, ఖార్, శాంతకృజ్, విలేపార్లే, రామ్‌మందిర్, మలాడ్, మీరారోడ్, భాయిందర్, నాయ్‌గావ్, నాలాసోపారా, విరార్ స్టేషన్లలో నూతన కెమెరాలు అమర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment