దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2008, నవంబరు 26న జరిగిన ఉగ్ర దాడిని ఎవరూ మరచిపోలేరు. ఈ ఘటన దరిమిలా నగరానికి ఆనుకుని ఉన్న పలు బీచ్‌లలో గట్టి నిఘా ఏర్పాటు చేసేందుకు ముంబై పోలీసులు 46 స్పీడ్ బోట్లను కొనుగోలు చేశారు. అయితే వీటిలో ప్రస్తుతం ఎనిమిది మాత్రమే పనిచేస్తుడటం చూస్తే, ముంబై పోలీసుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతుంది.
నాడు ముంబై పోలీసులు కొనుగోలు చేసిన బోట్లలో పసుపు, నీలి రంగులతో కూడిన ఒక బోటు అటు భూమి.. ఇటు సముద్రం.. రెండింటిలోనూ నావిగేట్ చేస్తుంది. ఇది ముంబై పోలీస్ లాంచ్ సెక్షన్‌లోని పేవర్-బ్లాక్ బ్యాక్‌యార్డ్‌లో ఉంది. ఇదే కార్యాలయం ముందు దాదాపు డజను స్పీడ్‌బోట్‌లు మురికిపట్టిన టార్పాలిన్ షీట్ కింద ఇనుప స్టాండ్‌లకు అతుక్కుని కనిపిస్తాయి.
మహారాష్ట్రలో 2008లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత ముంబై పోలీసులు కొనుగోలు చేసిన 46 బోట్లలో కొన్ని బోట్లు వృథాగా పడివున్నాయి. నగరంలోని 114 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంపై నిఘా ఉంచడం కోసం ఈ బోట్లు కొనుగోలు చేశారు. వీటిలో ఎనిమిది బోట్లు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 2008, నవంబరు 26న 10 మంది పాకిస్తానీ లష్కరే తోయిబా తీవ్రవాదులు కరాచీ నుండి అరేబియా సముద్రం దాటి పోర్ బందర్ మీదుగా వచ్చి, ఫిషింగ్ ట్రాలర్‌ను హైజాక్ చేసి, బుద్వార్ పార్క్ సమీపం నుంచి ముంబై తీరానికి చేరుకున్నారు.
26/11 తీవ్రవాద దాడులలో 160 మంది మరణించారు. 300 మందికి పైగా జనం గాయపడ్డారు. నాటి రోజుల్లో ముంబై పోలీసులకు సముద్రంలో పెట్రోలింగ్ చేయడానికి కేవలం నాలుగు ఫైబర్ గ్లాస్ బోట్లు మాత్రమే ఉండేవి. ముంబై దాడుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైస్పీడ్ బోట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. దాడులు జరిగిన తరువాత మూడేళ్లలో డిపార్ట్‌మెంట్ మొత్తం 46 బోట్లను కొనుగోలు చేసింది.
వీటిలో 23 స్పీడ్ బోట్లు, 19 ఉభయచర బోట్లు, నాలుగు అధునాతన ఉభయచర ‘సీలెగ్’ బోట్లు ఉన్నాయి. పోలీసుల నిఘా కార్యకలాపాలకు ఉపయోగపడే లక్ష్యంతో వీటిని కొనుగోలు చేశారు. ఈ బోట్లు సముద్రంతో పాటు భూభాగంలో అనుమానితులను ట్రాక్ చేయడంలో పోలీసులకు సహాయం అందించనున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బోట్లలో ఎనిమిది స్పీడ్ బోట్లు మాత్రమే పని చేస్తున్నాయి. 19 ఉభయచర బోట్లు, నాలుగు ‘సీలెగ్’లు వృథాగా పడివున్నాయి. ఇకనైనా పోలీసులు మేల్కొని వృథాగా ఉన్న ఈ బోట్లను వినియోగంలోకి తెచ్చి, ముంబైకి ఉగ్రవాదుల ముప్పు నుంచి మరింత రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: పైసా కూడా లేకుండా పోటీకి దిగిన అభ్యర్థులు వీరే!
Comments
Please login to add a commentAdd a comment