దివా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల విధ్వంసం - పలు వాహనాలకు నిప్పు
⇒ఆరు గంటలపాటు నిలిచిపోయిన లోకల్ రైళ్లు
⇒పోలీసుల లాఠీచార్జీ
⇒పలువురికి గాయాలు
సాక్షి, ముంబై: ముంబై మహానగరానికి జీవం ఇక్కడి లోకల్ రైళ్లు. అవే రైళ్లు తరచు సాంకేతిక లోపాలతో, ఇతర కారణాల వల్ల నిలిచిపోతూ ఉంటే.... ఏడాది కాలంగా ఈ తంతు కొనసాగుతుండడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొత్త సంవత్సరంలో కూడా ‘లైఫ్‌లైన్’కు అంతరాయాలు తప్పకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. వారి కోపాగ్నికి ఓ పోలీసు జీపుతో పాటు మూడు ప్రైవేటు వాహనాలు దగ్ధమయ్యాయి. కొన్ని లోకల్ రైళ్లు, మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల అద్దాలు పగిలిపోయాయి. దివా స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం ఓ లోకల్ రైలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం 6.50 గంటలకు టాకూర్లి, డోంబివలి రైల్వేస్టేషన్ల మధ్య అప్ స్లో మార్గంపై బద్లాపూర్ లోకల్ రైలు పెంటాగ్రాఫ్ తెగిపోయింది. దీంతో 6.50 గంటల నుంచి 7.26 గంటల వరకు కళ్యాణ్, దివా రైల్వేస్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేసి పెంటాగ్రాఫ్ మరమ్మత్తులు చేశారు.
ఈ కారణంగా సెంట్రల్ రైల్వేమార్గంలో రైళ్ల రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. దీంతో కళ్యాణ్ నుంచి ఠాణే వరకు దాదాపు అన్ని రైల్వేస్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంత ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. కొత్త సంవత్సరంలో కూడా ఇలాంటి సంఘటన పునరావృతం కావడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఎంతసేపటికీ రైళ్లు రాకపోవడంతో ఓపిక నశించిన ప్రయాణికులు ఉదయం 8.20 గంటల సమయంలో దివా రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్‌లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇలా ప్రారంభమైన ఆందోళన చూస్తుండగానే హింసాత్మకంగా మారింది. దివా రైల్వేస్టేషన్‌లోని ఏటీవీఎంలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. ప్రయాణికులు రాళ్లు రువ్వడంతో ఓ రైల్వే ఉద్యోగి గాయపడ్డారు. దీంతో రైల్వే సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. మోటార్‌మెన్ యూనియన్ ఇచ్చిన సమ్మె పిలుపుతో అటు సెంట్రల్ రైల్వేమార్గంలో ఇటు హార్బర్ మార్గంపై కూడా రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి.
పలువురికి గాయాలు...
దివా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకు చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. ఇంతలో కొందరు రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో పోలీసులు కూడా లాఠీలకు పని కల్పించారు. ఈ సంఘటనలో ఆర్ కె చావడా, హెచ్ జీ పటేల్ అనే ఇద్దరు మోటర్‌మెన్‌లు, జైస్వాల్ అనే ఆర్‌పీఎఫ్ అధికారి, ఓ హెడ్‌కానిస్టేబుల్, మరో నలుగురు సిబ్బందికి గాయలయ్యాయి. వీరిలో ఆర్ కె చావడా పరిస్థితి విషమించడంతో అతడిని బైకలా రైల్వే ఆసుపత్రికి తరలించారు.
వాహనాలతోపాటు సామగ్రి ద్వంసం....
ప్రయాణికుల ఆగ్రహానికి దివా రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఓ పోలీసు వాహనంతోపాటు మూడు ప్రైవేట్ వాహనాలు దగ్ధమయ్యాయి. ఏడు ఏటీవీఎం యంత్రాలు, మూడు బుకింగ్ కౌంటర్లు, లెవల్ క్రాసింగ్ గేట్ ధ్వంసమయ్యాయి. మరోవైపు డోంబివలి రైల్వేస్టేషన్‌లో కూడా కొందరు ప్రయాణికులు రెండు బుకింగ్ కౌంటర్లతోపాటు ఆరు ఏటీవీఎం యంత్రాలను ధ్వంసం చేశారు. పది లోకల్ రైళ్ల బోగీలకు కూడా నష్టం వాటిల్లింది. ఠాణే జిల్లా ఇన్‌చార్జీ మంత్రి ఏక్‌నాథ్ శిందే, కళ్యాణ్ ఎంపీ శ్రీకాంత్ శిందే సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులకు నచ్చజెప్పారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా జోక్యం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం మళ్లి రైళ్ల రాకపోలు ప్రారంభమయ్యాయి.
దూరప్రాంతాల రైళ్లపై ప్రభావం....
ఆందోళన ప్రభావం దూరప్రాంతాలకు వెళ్లే ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లపై పడింది. అనేక రైళ్ల సమయాలలో మార్పులు చేశారు. ముంబై-పుణే సింహగడ్ ఎక్స్‌ప్రెస్, ముంబై-నాగపూర్ సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్, ముంబై-ఫిరోజ్‌పూర్ పంజాబ్ మెయిల్, ముంబై-హౌరా ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్ల సమయాలలో మార్పులు చేయగా అనేక రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
134 లోకల్ రైళ్లు రద్దు....
దివా రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళన కారణంగా 134 లోకల్ రైళ్లను రద్దు చేశారు. వీటిలో 70 డౌన్ లోకల్స్, 54 అప్ లోకల్స్ ఉండగా పది ఠాణే షటిల్స్ ఉన్నాయి.
ఇకపై జాగ్రత్త వహిస్తాం : సీఎం
సాక్షి, ముంబై: దివాలో శుక్రవారం జరిగిన ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ పేర్కొన్నారు. దివా రైల్వేస్టేషన్ వద్ద జరిగిన సంఘటనపై తాము సమీక్షించామని అయితే ప్రయాణికులకు మున్ముందు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తపడతామన్నారు. లోకల్ రైళ్లకు ఎదురవుతున్న అంతరాయాలపై రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభుతో కూడా చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, రైల్వేమంత్రి సురేష్ ప్రభు మహారాష్ట్రలో కొత్తగా ఎస్‌వీపీ (స్పెషల్ పర్పస్ వెహికల్)ను తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈ సమస్యకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నె ల 9న ప్రభు ఠాణేను సందర్శించి ప్రయాణికుల సమస్యలపై చర్చించనున్నారు.
‘లైఫ్‌లైన్’కు అంతరాయాలపై ఆగ్రహజ్వాల
Published Fri, Jan 2 2015 10:41 PM | Last Updated on Tue, Aug 21 2018 6:13 PM
Advertisement
Advertisement