సాక్షి, ముంబై: ‘‘ఎమ్మెల్యేలకు బెదిరింపులు వస్తున్నాయి. పట్టపగలే నేరాలు జరుగుతున్నాయి. పోలీసుల ఇళ్లలో మాద కద్రవ్యాలు దొరుకుతున్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’ అని మాజీ ముఖ్యమంత్రి అజీత్ పవార్ ప్రశ్నించారు. అసెంబ్లీలో గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పవార్ నిలదీశారు. ఇటీవల హత్యకు గురైన కమ్యునిస్టు సీనియర్ నేత గోవింద్ పాన్‌సరే హంతకులు ఇంతవరకు పట్టుబడలేదని, రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, రాష్ట్ర ఉప రాజధాని, ఫడ్నవీస్ నియోజకవర్గమైన నాగపూర్‌లో సైతం నేరాలు అధికమవుతున్నాయని విమర్శించారు. పెరుగుతున్న నేరాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫడ్నవీస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పవార్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. మోడీకి ముస్లింలు కూడా ఓటు వేశారనే విషయం గుర్తుంచుకోవాలని చురకలంటించారు. ధన్‌గర్ సమాజానికి ఇచ్చిన హామీ నెరవేర్చడంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు.
గవర్నర్ ప్రసంగంపై విమర్శల వర్షం
గవర్నర్ ప్రసంగంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. స్వైన్ ఫ్లూ రాష్ట్రంలో స్వైర విహారం చేస్తోందని, అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ తన ప్రసంగంలో ఏమాత్రం ఫ్లూ గురించి ప్రస్తావించలేదన్నారు. శివాజీ పేరు చెప్పుకుని ఓట్లడిగిన బీజేపీ, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన స్మారకం నిర్మించే ఊసే ఎత్తడం లేదన్నారు. ఆర్.ఆర్.పాటిల్ వృుతితో ఖాళీ అయిన తాస్‌గావ్ శాసనసభ నియోజకవర్గంలో ఉపఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా చూడాలని ఈ సందర్భంగా అన్ని పార్టీలను కోరారు.
ఠాక్రేను మర్చిపోకండి
ముంబై: శివసేన సుప్రీం బాల్‌ఠాక్రే సహకారాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మర్చిపోకూడదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో పవార్ మాట్లాడుతూ.. ఠాక్రేకోసం ప్రతిపాదించిన స్మారకం గురించి ప్రభుత్వం మాట్లాడలేదని విమర్శించారు. గో వధ గురించి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న పశువులకోసం ప్రభుత్వం రైతులకు ఏం చేయబోతోందని ప్రశ్నించారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఠాక్రే స్మారకం నిర్మాణానికి తమకు పవార్ సిఫార్సు అవసరం లేదన్నారు. ముంబైలో ఠాక్రే కోసం అద్భుతమైన స్మారకాన్ని నిర్మిస్తామన్నారు. ఎన్నికల ముందు బీజేపీ-శివసేన పొత్తు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఠాక్రే సహకారం తమకు గుర్తుందన్నారు. గవర్నర్ ప్రసంగంలో శివాజీ స్మారకం గురించి ప్రస్తావించలేదన్న ప్రతిపక్ష మాటలకు స్పందిస్తూ..పదిహేనేళ్లుగా స్మారకం గురించి తాము ప్రస్తావిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఏం జరుగుతోంది?
Published Thu, Mar 12 2015 10:59 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM
Advertisement