కన్నీళ్లు తుడుస్తూ.. ఓదార్పునిస్తూ! | Wipe the tears .. odarpunistu! | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు తుడుస్తూ.. ఓదార్పునిస్తూ!

Published Sun, Nov 16 2014 3:38 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

కన్నీళ్లు తుడుస్తూ.. ఓదార్పునిస్తూ! - Sakshi

కన్నీళ్లు తుడుస్తూ.. ఓదార్పునిస్తూ!

నంద్యాల టౌన్: టీడీపీ బనాయించిన అక్రమ కేసులో జైలు పాలైన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, అభిమానుల కుటుంబ సభ్యులకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కొండంత ఓదార్పునిచ్చారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఇలాంటి కుట్రలు కొట్టుకుపోతాయని.. న్యాయం తప్పక గెలుస్తుందనే భరోసానిచ్చారు. అత్యంత చిన్న వయస్సులో శాసనసభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ఎమ్మెల్యే, తన తల్లి శోభా నాగిరెడ్డిని తలపిస్తూ బాధిత కుటుంబాల్లో సభ్యురాలిగా కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు.

రాజకీయాల్లోనే కాకుండా ప్రజల మనిషిగా తనదైన శైలిని కనబరిచే నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డి బాటలో అఖిలప్రియ అందరికీ అండగా మేమున్నామంటూ ధైర్యం చెప్పడం విశేషం. శనివారం సాయంత్రం ఆమె నంద్యాల సబ్‌జైలులోని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు శివశంకర్, దిలీప్‌కుమార్, కరీముల్లా, పార్టీ నేతలు ఏవీఆర్ ప్రసాద్, వడ్డె శీను, వడ్డెమనోజ్, దేవనగర్ మధు, చంటి, అజ్మీర్‌బాషా తదితరులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఇళ్ల వద్ద కలుసుకుని ఓదార్చారు.

 భూమాపై కేసు సులోచన అహంకారానికి నిదర్శనం
 సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భూమా నాగిరెడ్డిపై బనాయించిన కేసు మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన అహంకారానికి నిదర్శనమని కౌన్సిలర్ శివశంకర్‌యాదవ్ తల్లి శివమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల ప్రియ.. శివశంకర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా శివమ్మ పైవిధంగా స్పందించారు. భూమాతో కలిసి తన కుమారుడు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా జైలుకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు. భూమాను రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమ కేసు బనాయించారన్నారు.

 అక్కా.. నాన్నను చూపించవా
 ‘అక్కా.. నాన్నను చూసి చాలా రోజులైంది. ఒక్కసారి చూపించవా..’ అంటూ దేవనగర్ మధు కుమారుడు శ్రీనివాస్ ఏడుస్తూ అఖిల ప్రియను హత్తుకున్నాడు. జైలులో ఉన్న దేవనగర్ మధు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ఆమె వారింటికి వెళ్లారు. తండ్రిని చూడాలనిపిస్తుందంటూ శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె చలించిపోయారు. వీలైనంత త్వరగా మీ నాన్నను మీ వద్దకు తీసుకొస్తానంటూ అఖిలప్రియ భరోసానిచ్చారు. మధు భార్యకు కూడా ధైర్యం చెప్పారు.

 ప్రజల కోసమే జైలుకు వెళ్లారు
 సబ్‌జైలులోని దిలీప్‌కుమార్ కుటుంబ సభ్యులను అఖిల ప్రియ పరామర్శిస్తూ.. ప్రజల కోసమే తన తండ్రితో పాటు మరికొందరు జైలుకు వెళ్లారన్నారు. అధికార పార్టీ కక్ష సాధింపుతో అక్రమ కేసులు బనాయించిందన్నారు. అయితే ఈ కేసులు కోర్టులో నిలబడవన్నారు. నాలుగైదు రోజుల్లో బెయిల్ వస్తుందని.. అంతా ధైర్యంగా ఉండాలని చెప్పారు.

 కంటతడి పెట్టిన శశిరేఖ
 వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఏవీఆర్ ప్రసాద్ భార్య, కౌన్సిలర్ శశిరేఖ కంటతడి పెట్టారు. భూమా అఖిలప్రియ ఆమెను ఓదార్చేందుకు ఇంటికి వెళ్లగా.. ‘‘తన భర్త ప్రసాద్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారని, ఎవరినీ దూషించేవారు కాదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల ప్రియ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని.. ప్రజల మద్దతుతో అధికార పార్టీ కుట్రలను తిప్పికొడదామన్నారు.

 అచ్చం అమ్మలాగే ఉన్నావ్..
 ‘‘అమ్మా.. నీవు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావ్..’’ అంటూ అఖిల ప్రియను శోభానాగిరెడ్డితో పోల్చారు కొండారెడ్డి కుటుంబ సభ్యులు. కొండారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వెళ్లిన సమయంలో వారు ఆవిధంగా స్పందించారు. నిన్ను చూస్తే మాకెంతో ధైర్యం వస్తోందని చెప్పడం విశేషం.

 చట్టపరంగా పోరాటం
 అధికార పార్టీ నేతలు బనాయించిన అక్రమ కేసులకు భయపడబోమని భూమా అఖిల ప్రియ అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న రోడ్ల విస్తరణ, పందుల నిర్మూలన ఇతరత్రా సమస్యలపై భూమా నాగిరెడ్డి రాజీలేని పోరాటం సాగిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గత నెల 31న కౌన్సిల్ హాల్‌లో ప్రజల సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేయగా.. చైర్మన్ దేశం సులోచన అడ్డుకుని వివాదానికి తెర తీశారన్నారు.

తన తండ్రి ప్రమేయం లేకపోయినా అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ఇదే సమయంలో చైర్మన్‌పై అట్రాసిటీ కేసు నమోదైనా పోలీసులు అరెస్టుకు వెనుకంజ వేస్తున్నారన్నారు. భూమా నాగిరెడ్డి కుమార్తెగా నంద్యాల ప్రజలకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి పోరాటం సాగిస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement