డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యుత్ లోకల్ రైలు పట్టాలు తప్పింది.
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్ : డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యుత్ లోకల్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన గుమ్మడిపూండిలో మంగళవారం ఉదయం జరిగింది. చెన్నై నుంచి సోమవారం రాత్రి గుమ్మిడిపూండికి వచ్చిన లోకల్ రైలు షెడ్డులో ఉంది. ఈ రైలు మంగళవారం ఉదయం 4.30 గంటలకు గుమ్మిడిపూండి నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉంది. 4.20 గంటల ప్రాంతంలో డ్రైవర్ లేకపోవడంతో సహాయ డ్రైవర్ షెడ్డు నుంచి 4వ నెంబరు ప్లాట్‌ఫాం మీదకు రైలును తీసుకువస్తున్నాడు. ఆ సమయంలో మామూలుగా 5 కిలోమీటర్లు వేగంతో రావాలి.
మలుపు వద్ద 20 కిలో మీటర్ల వేగంతో బండి నడవడంతో 7వ బాక్స్ చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో పెద్ద చప్పుడుతో దుమ్ము, కంకర లేచింది. ఆ సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ సంభాలు నేలకొరిగి పట్టాలకు అడ్డంగా పడిపోయాయి. విద్యుత్ లైన్ తెగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి గుమ్మిడిపూండి వైపు వెళ్లే బండ్లు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చెన్నై రిస్కు టీమ్ ప్రత్యేక రైలులో వచ్చి పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని బిగించారు. ఈ సంఘటన కారణంగా 5 గంటల సేపు గుమ్మిడిపూండికి వచ్చే, వెళ్లే బండ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆంధ్ర వైపు నుంచి వస్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును గుమ్మిడిపూండి, పొన్నరి స్టేషన్‌లో ఆపి ప్రయాణికులను చెన్నైకి తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు చెన్నై నుంచి వచ్చే లోకల్ రైళ్లు పొన్నేరి వరకు నడిచాయి. అధికారులు సకాలంలో స్పందించడంతో ఉదయం 11 గంటలకు రైళ్లు యధావిధిగా నడిచాయి. ఈ సంఘటన వలన ఉదయం వివిధ పనులకు వెళ్లే ఉద్యోగాలు, వ్యాపారులు, విద్యార్థులు, తీవ్ర ఇబ్బంది పడ్డారు. చెన్నై - గుమ్మిడిపూండిల మధ్య ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.