సాక్షి, హైదరాబాద్: సుమారు పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు, లింగంపల్లి నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు ఆరు కిలోమీటర్ల మేర అదనపు సదుపాయం అందుబాటులోకి వచ్చినా రైళ్లు పట్టాలెక్కలేదు.
ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఠంచన్‌గా కేంద్ర బడ్జెట్ మాత్రం వచ్చిపోతూనే ఉంది. కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం రెడ్ సిగ్నలే పడడం గమనార్హం. రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణలో భాగంగా స్టేషన్ల ఆధునికీకరణ వంటి కొన్ని లాభదాయకమైన ప్రాజెక్టులు మినహాయించి లక్షలాది మంది ప్రయాణికలు ఆధారపడిన కొత్త రైళ్లు, లైన్‌ల విస్తరణకు మాత్రం నిధులు లభించడం లేదు.
మరో వారం పది రోజుల్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసే ఎంపీల సమావేశం కూడా ఈసారి ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రవేశపెట్టనున్న కేంద్రబడ్జెట్‌లో హైదరాబాద్ ప్రజల రైల్వే ప్రయాణ అవసరాలు ఏ మేరకు ప్రతిబింబిస్తాయనే సందేహంగా మారింది. మరోవైపు గతంలో ప్రారంభించిన పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు మధ్య ఏర్పడిన పీటముడి కారణంగా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి.
వందే భారత్ సరే...ఇంటర్‌సిటీ ఏదీ...
సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రూ.100 నుంచి రూ.150 వరకు చార్జీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వందేభారత్‌లో ప్రయాణం చేయాలంటే వరంగల్ వరకు కనీసం రూ.450 చెల్లించాలి. సికింద్రాబాద్ నుంచి నేరుగా విశాఖకు వెళ్లే ప్రయాణికులకు కూడా చార్జీలు భారమే అయినా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొంటే భారత్ ప్రయోజనకరమే.
నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ప్యాసింజర్‌లుగా నడిచిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా పేరు మార్చి చార్జీలు పెంచారు. అదే సమయంలో హాల్టింగ్ స్టేషన్‌లను తగ్గించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్‌సిటీ రైళ్లను పెంచాలనే ప్రతిపాదన ఆచరణకు నోచడం లేదు. వందేభారత్ కంటే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన ఇంటర్‌సిటీ, ప్యాసింజర్ రైళ్లను ఈ బడ్జెట్‌లోనైనా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
రెండో దశకు పన్నెండేళ్లు ....
రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే నగరంలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యతనివ్వాలని అప్పట్లో కేంద్రం భావించింది, ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. మొదటిదశలో పట్టాలెక్కిన రైళ్లు తప్ప కొత్తగా ఒక్క రైలు కూడా అందుబాటులోకి రాలేదు.పైగా గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటిని 78కి తగ్గించారు. ఎంఎంటీఎస్ స్టేషన్‌ల ఆధునికీకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. తాజాగా భారత్ అమృత్ స్టేషన్స్ పథకం కింద హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, లింగంపల్లి స్టేషన్‌లను గుర్తించారు. మిగతా 23 స్టేషన్‌లలో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు వంటివి కూడా తగినన్ని లేకపోవడం గమనార్హం.
సుమారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు స్టేషన్‌లతో అనుసంధానమయ్యే రెండో దశ వల్ల రవాణా సదుపాయాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఆరు మార్గాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మూడు లైన్‌లు మాత్రం పూర్తయ్యాయి. ఈ మార్గాల్లో నడిపేందుకు రైళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి.
నగరంలో నాలుగో టర్మినల్‌గా భావించే చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌పైన ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఒక్క స్టేషన్ నుంచే రోజుకు 200 రైళ్లు నడుస్తున్నాయి.
పుణ్యక్షేత్రాలకు రైళ్లు లేవు..
నగరం నుంచి యాదాద్రికి వెళ్లేందుకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాయగిరి స్టేషన్ అభివృద్ధికి మాత్రం రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. లక్షలాది మంది భక్తులు సందర్శించే యాదాద్రికి ఎంఎంటీఎస్ లేకుండా కేవలం స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అది అలంకారప్రాయమే కానుంది.
Comments
Please login to add a commentAdd a comment