Center Funds
-
ఆ విషయంలో గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర తెలియజేస్తూ ‘రిపోర్టు టు పీపుల్ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఇచ్చారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో గత తొమ్మిదేళ్లలోతెలంగాణకు కేంద్ర ఇచ్చిన నిధులపై ప్రజలకు నివేదిక అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, 9 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. కేంద్రం చెప్పే లెక్కలు-రాష్ట్ర చెబుతున్న లెక్కలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ సర్కార్ నిరంతరం సహకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని అన్నారు. కేంద్రం నుంచి వివిధ శాఖలు 5 లక్షల కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. ‘మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్దపల్లి మినహా అన్ని జిల్లాలకు నేషనల్ హైవేల అనుసంధానం చేశారు . వీటి కోసం 1లక్ష 8వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేసింది. హైదరాబాద్‌కు గేమ్ చెంజర్‌గా కానున్న రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించిన భూ సేకరణ తొందరగా పూర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి తెలిపారు. చదవండి: ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: సీఎం కేసీఆర్ ఆదేశం రైల్వేస్.. ►9 ఏళ్లలో రాష్ట్రంలో 37 వేల కోట్లకు పైగా రైల్వే లైన్లను డబ్లింగ్ ఏర్పాటు చేశాం. ►సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించాం. ►రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండవ దశ చాలా రోజు ఆలస్యం అయ్యింది. ►కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ►దీంతో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. ►ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందే భారత్ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయి. ►ప్రజల అభిప్రాయ డిజైన్ మేరకు అనేక రైల్వే స్టేషన్ల అబివృద్ధి చేస్తున్నాం . పౌర విమానయానం ►భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం. ►2014 తర్వాత తెలంగాణలో 11 సాగు నీటి ప్రాజెక్ట్ లకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసింది. ►ఇళ్ళ నిర్మాణానికి తెలంగాణకు నిధులు మంజూరు చేసినా ఖర్చు చేయలేదు. ►రోడ్ల నిర్మాణంలో గుజరాత్ కంటే ఎక్కువ నిధులు తెలంగాణకే కేటాయించారు. -
South Central Railway: వందే భారత్ సరే... ఇంటర్సిటీ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: సుమారు పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు, లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఆరు కిలోమీటర్ల మేర అదనపు సదుపాయం అందుబాటులోకి వచ్చినా రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఠంచన్‌గా కేంద్ర బడ్జెట్ మాత్రం వచ్చిపోతూనే ఉంది. కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం రెడ్ సిగ్నలే పడడం గమనార్హం. రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణలో భాగంగా స్టేషన్ల ఆధునికీకరణ వంటి కొన్ని లాభదాయకమైన ప్రాజెక్టులు మినహాయించి లక్షలాది మంది ప్రయాణికలు ఆధారపడిన కొత్త రైళ్లు, లైన్ల విస్తరణకు మాత్రం నిధులు లభించడం లేదు. మరో వారం పది రోజుల్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసే ఎంపీల సమావేశం కూడా ఈసారి ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రవేశపెట్టనున్న కేంద్రబడ్జెట్లో హైదరాబాద్ ప్రజల రైల్వే ప్రయాణ అవసరాలు ఏ మేరకు ప్రతిబింబిస్తాయనే సందేహంగా మారింది. మరోవైపు గతంలో ప్రారంభించిన పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు మధ్య ఏర్పడిన పీటముడి కారణంగా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. వందే భారత్ సరే...ఇంటర్సిటీ ఏదీ... సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రూ.100 నుంచి రూ.150 వరకు చార్జీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వందేభారత్‌లో ప్రయాణం చేయాలంటే వరంగల్ వరకు కనీసం రూ.450 చెల్లించాలి. సికింద్రాబాద్ నుంచి నేరుగా విశాఖకు వెళ్లే ప్రయాణికులకు కూడా చార్జీలు భారమే అయినా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొంటే భారత్ ప్రయోజనకరమే. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ప్యాసింజర్లుగా నడిచిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా పేరు మార్చి చార్జీలు పెంచారు. అదే సమయంలో హాల్టింగ్ స్టేషన్లను తగ్గించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్సిటీ రైళ్లను పెంచాలనే ప్రతిపాదన ఆచరణకు నోచడం లేదు. వందేభారత్ కంటే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన ఇంటర్సిటీ, ప్యాసింజర్ రైళ్లను ఈ బడ్జెట్లోనైనా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రెండో దశకు పన్నెండేళ్లు .... రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే నగరంలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యతనివ్వాలని అప్పట్లో కేంద్రం భావించింది, ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. మొదటిదశలో పట్టాలెక్కిన రైళ్లు తప్ప కొత్తగా ఒక్క రైలు కూడా అందుబాటులోకి రాలేదు.పైగా గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటిని 78కి తగ్గించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల ఆధునికీకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. తాజాగా భారత్ అమృత్ స్టేషన్స్ పథకం కింద హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, లింగంపల్లి స్టేషన్లను గుర్తించారు. మిగతా 23 స్టేషన్లలో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు వంటివి కూడా తగినన్ని లేకపోవడం గమనార్హం. సుమారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు స్టేషన్లతో అనుసంధానమయ్యే రెండో దశ వల్ల రవాణా సదుపాయాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఆరు మార్గాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మూడు లైన్లు మాత్రం పూర్తయ్యాయి. ఈ మార్గాల్లో నడిపేందుకు రైళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. నగరంలో నాలుగో టర్మినల్‌గా భావించే చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌పైన ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఒక్క స్టేషన్ నుంచే రోజుకు 200 రైళ్లు నడుస్తున్నాయి. పుణ్యక్షేత్రాలకు రైళ్లు లేవు.. నగరం నుంచి యాదాద్రికి వెళ్లేందుకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాయగిరి స్టేషన్ అభివృద్ధికి మాత్రం రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. లక్షలాది మంది భక్తులు సందర్శించే యాదాద్రికి ఎంఎంటీఎస్ లేకుండా కేవలం స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అది అలంకారప్రాయమే కానుంది. -
సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి!.. కేంద్రం రూ.1,100 కోట్ల నిధులు ఆపేసింది
సాక్షి, హైదరాబాద్: ‘సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులు ఆపేశారు. అందుకే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైతు కల్లాలకు రూ.150 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుగా భావించి, ఆ డబ్బులు ఆపేశారు. ఈ విషయమై సర్పంచ్‌లకు అధికారులు అవగాహన కలి్పంచాలి’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రం కావాలనే నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ విధంగా నిధులు ఆపడం సరికాదని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని చెప్పారు. కొంతమంది సర్పంచులు బీజేపీ మాయలోపడి ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయా గ్రామాలకు అందిన నిధుల వివరాలతో ప్రతీ పంచాయతీలో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో తొలుత సమావేశమై, ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, మండల పంచాయతీ ఆఫీసర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లతో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనల జాబితాలు అందజేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది బాగా పనిచేయడం వల్ల పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు వచ్చిందని, జాతీయస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని.. ఇదే స్పూర్తిని ఇకముందు కూడా కొనసాగించాలని కోరారు. కొత్తగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయాల పనులను వేగంగా చేయాలని సూచించారు. చదవండి: ‘అన్మ్యాన్డ్’.. సబ్స్టేషన్లు!.. టీఎస్ఎస్పీడీసీఎల్ ‘హైటెక్’ బాట -
Telangana Cabinet Meeting: కేంద్రం ఇచ్చింది 3శాతం కంటే తక్కువే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రాయోజిత పథకాల (సీసీఎస్) కింద గత ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి రూ.47,312కోట్లు మాత్రమే వచ్చాయని.. అదే రాష్ట్ర ప్రభు త్వం కేవలం నాలుగేళ్లలోనే, ఒక్క రైతుబంధు కిందే రైతులకు రూ.58,240 కోట్లను అందించిందని కేబినెట్‌కు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.84 లక్షల కోట్లు ఖర్చుచేయగా.. అందులో సీఎస్ఎస్ కింద అందింది రూ.5,200 కోట్లు మాత్రమేనని.. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇది 3శాతం కంటే తక్కువని నివేదించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉన్నతాధికారులు కూడా పాల్గొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. కేంద్రం తీరుతో రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడు తోందని అధికారులు కేబినెట్‌కు వివరించారు. ‘దేశంలో రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినా.. దేశ ఆదాయంలో 5% మన రాష్ట్రం నుంచే అందింది. సొంత పన్నుల ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఏడేళ్లలోనే మూడు రెట్ల వృద్ధితో దేశంలో అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం సాధించిన ప్రగతికి కేంద్ర తోడ్పాటు కూడా ఉంటే.. రాష్ట్ర జీఎస్డీపీ విలువ మరో రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.14.50 లక్షల కోట్లకు చేరుకునేది..’’అని అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఇప్పటివరకు రాష్ట్ర ఆదా యం 15.3 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని తెలిపారు. కేంద్ర పథకాల నిధులు తగ్గినా తగిన వృద్ధి రేటు నమోదు చేయడం గర్వకారణమని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. ఐటీలో లక్షా 55 వేల కొత్త ఉద్యోగాలు తెలంగాణ గత ఏడాది ఐటీ రంగంలో లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించి దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కేబినెట్‌కు వివరించారు. ఐటీలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు కంటే ఇది ఎక్కువన్నారు. కేబినెట్ నిర్ణయాలివీ.. ►రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్ల మంజూరుకు ఆమోదం. ఇప్పటికే 36 లక్షల మంది పెన్షన్లు అందుకుంటుండగా.. ఆ సంఖ్య 46 లక్షలకు చేరనుంది. ►స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల. ►కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 10 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్టీ టవర్ నిర్మాణం. ►సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో అధు నాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణం. ►కోఠి వైద్యారోగ్యశాఖ సముదాయంలోనూ అధునాతన ఆస్పత్రి నిర్మాణం ►రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు. ►స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఈ నెల 21న చివరి ముహూర్తం ఉండటం, భారీ సంఖ్యలో వివాహ, శుభ కార్యక్రమాలు ఉండటంతో.. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సమావేశాల రద్దుకు నిర్ణయం. ►స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. ►రాష్ట్రంలో జీవో 58, 59ల కింద పేదలకు స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశం. ►గ్రామకంఠం స్థలాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం విషయంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం. అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక తీసుకోవాలని నిర్ణయం. ►వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు. ►తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలం కేటాయింపు. ►షాబాద్‌లో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో షాబాదు బండల పాలిషింగ్ యూని ట్ల కోసం 45 ఎకరాలు కేటాయింపు. చదవండి: రాష్ట్రంపై కేంద్రం నిందలను తిప్పికొడదాం.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి, ఇబ్బందులు సృష్టించి.. రాజకీయంగా లబ్ధిపొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్థిక సహాయ నిరాకరణ సహా కేంద్రం పెడుతున్న ఇబ్బందులను ప్రజలకు వివరించాలని.. బీజేపీ తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో అంతర్గతంగా రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకోవడంపై దృష్టి సారించాలని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గురు వారం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజకీయ, ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నిధులకు మోకాలడ్డుతూ.. రాష్ట్రంపై నిందలు ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులకు మోకాలడ్డుతూ.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపైనే నిందలు మోపుతోంది. పారదర్శకంగా రాష్ట్ర ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూనే ఉన్నా అపోహలు సృష్టించేందుకు కేంద్రం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమయ్యే నిధులు, పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది. కానీ వేతనాల చెల్లింపు, పథకాల అమలుకు అవసరమయ్యే నిధులపై అనుమానాలు రేకెత్తించేందుకు విపక్ష పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి’’ అని సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడినట్టు తెలిసింది. రాబోయే రోజుల్లో ఈ తరహా విష ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్టు సమాచారం. అందువల్ల మంత్రులు విపక్షాల ఆరోపణలు, అవాస్తవ ప్రచారాలపై ఎప్పటికప్పుడు స్పందించాలని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించినట్టు తెలిసింది. ఇక మునుగోడు ఉప ఎన్నికను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు, ఉప ఎన్నికలు సర్వ సాధారణమని, ఒకట్రెండు ఉప ఎన్నికల ఫలితాలతో ఆందోళన అవసరం లేదని పేర్కొన్నట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని.. ఈ ఎన్నిక ప్రచారంలో విపక్షాల దుష్ప్రచారాన్ని సరైన రీతిలో ఎండగడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో బీజేపీ ఏకాకి అవుతోందని, రాష్ట్రంలోనూ ఆ పార్టీకి అంతగా బలమేమీ లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఆదాయ సమీకరణపై దృష్టి పెట్టాలి.. కేంద్రం ఆర్థిక దిగ్బంధనం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సరిపడా నిధుల సమీకరణ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ప్రజలపై భారం పడకుండా ఆర్థిక వనరులను సమీకరించుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించినట్టు సమాచారం. అయితే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలికి తరలించడం ద్వారా.. నగరంలో కాలుష్యం తగ్గడంతోపాటు, ఐదు వేల ఎకరాలు అందుబాటులోకి వస్తాయని కేబినెట్ భేటీలో అధికారులు వివరించినట్టు తెలిసింది. దీంతో ఆ స్థలాలను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవచ్చని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక రాజీవ్ స్వగృహ, గృహకల్ప ప్రాజెక్టులకు చెందిన ఇళ్లు, ఖాళీ స్థలాల విక్రయం ద్వారా ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. చదవండి: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్ -
పోలవరానికి రూ.3 వేల కోట్లు!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రూ.మూడు వేల కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ శుక్రవారం పంపిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. నవంబర్ మొదటి వారంలో నాబార్డ్ ద్వారా నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖకు సమాచారం ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే.. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.16,935.6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు (ఏప్రిల్ 1, 2014కు ముందు) రూ.5,135.87 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చాక ఏప్రిల్ 1, 2014 నుంచి ఇప్పటిదాకా రూ.11,799.73 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయగా రూ.5,072.47 కోట్లను రీయింబర్స్ చేయాల్సి ఉంది. సీఎం వైఎస్ జగన్ సమీక్షతో కదలిక గతేడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు రూ.393.51 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్ 1, 2014కు ముందు పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన నిధులకు సంబంధించి ఆడిట్ చేయించి.. స్టేట్మెంట్ను పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. కానీ ఏప్రిల్ 1, 2014కు ముందు చేసిన పనుల వ్యయానికి సంబంధించి ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపకుండా టీడీపీ సర్కార్ జాప్యం చేస్తూ వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన తొలి సమీక్ష సమావేశంలోనే.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ఆరా తీశారు. ఏప్రిల్ 1, 2014కు ముందు చేసిన వ్యయానికి ఆడిటెడ్ స్టేట్మెంట్ను కేంద్ర ఆర్థిక శాఖకు పంపాల్సి ఉందని అధికారులు చెప్పారు. దాంతో ఆడిటెడ్ స్టేట్మెంట్ను పంపాలని ఆదేశించారు. ఆ మేరకు ఆడిటెట్ స్టేట్మెంట్ను కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పంపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆడిటెడ్ స్టేట్మెంట్పై కేంద్ర ఆర్థిక శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలని ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన రూ.5,072.47 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ మరోసారి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర జల్‌శక్తి తొలి విడతగా రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపడంతో నిధుల విడుదలకు అడ్డంకులు తొలిగాయి. విడుదల చేసిన నిధులకు యూసీ (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు)లు పంపితే క్రమం తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. -
ఆర్థిక చేయూతనివ్వండి
కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు అందించి ఆర్థికంగా చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్రంలో చేపట్టనున్న పథకాలకు సాయం అందించాలని, మరికొన్ని సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేటీఆర్ టీఆర్ఎస్ ఎంపీ వినోద్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడుతో కలసి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్, గ్రామీణాభివృద్ధి మంత్రి భీరేంద్రసింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరిలతో వేర్వేరుగా భేటీ అయి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రులతో భేటీ వివరాలను వెల్లడించారు. వాటర్‌గ్రిడ్‌కు ఆర్థిక సాయం.. ఇంటింటికీ రక్షిత నీరు అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభిస్తోందని, ఇందుకయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్రం భరించాలని కేంద్ర మంత్రి భీరేంద్రసింగ్ను కోరినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఉపాధి హామీ పథకాన్ని కుదించరాదని, అవసరమైతే పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. స్పందించిన కేంద్రమంత్రి ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఆర్థిక ఏడాది చివరి త్రైమాసిక నిధులు రూ.223 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు బీఆర్జీఎఫ్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.228 కోట్లు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రానికి వచ్చే పింఛన్ కోటాను పెంచాలని కోరామని, దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయమన్నాం.. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్, దుబ్బాక, పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లలో ఎక్కడైనా హ్యాండ్లూమ్ క్లసర్లు ఏర్పాటుచేయాలని జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్‌ను కోరినట్టు కేటీఆర్ తెలిపారు. టీ-హబ్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించాలని కేంద్రమంత్రి సుజానా చౌదరికి, సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న ఈఎస్ఐ డిస్పెన్సరీని 200 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు విన్నవించామన్నారు. కేంద్ర సహకారం ఉంటుంది: దత్తాత్రేయ రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. తనతో కేటీఆర్ భేటీ అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. నేడు మహబూబ్‌నగర్‌కు కేటీఆర్ వాటర్‌గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసే ఇంటేక్వెల్ సర్వే, డిజైన్లను ఆయన పరిశీలించనున్నారు.