సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి, ఇబ్బందులు సృష్టించి.. రాజకీయంగా లబ్ధిపొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్థిక సహాయ నిరాకరణ సహా కేంద్రం పెడుతున్న ఇబ్బందులను ప్రజలకు వివరించాలని.. బీజేపీ తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో అంతర్గతంగా రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకోవడంపై దృష్టి సారించాలని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గురు వారం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజకీయ, ఆర్థిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
నిధులకు మోకాలడ్డుతూ.. రాష్ట్రంపై నిందలు
‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులకు మోకాలడ్డుతూ.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపైనే నిందలు మోపుతోంది. పారదర్శకంగా రాష్ట్ర ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూనే ఉన్నా అపోహలు సృష్టించేందుకు కేంద్రం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమయ్యే నిధులు, పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది. కానీ వేతనాల చెల్లింపు, పథకాల అమలుకు అవసరమయ్యే నిధులపై అనుమానాలు రేకెత్తించేందుకు విపక్ష పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి’’ అని సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడినట్టు తెలిసింది. రాబోయే రోజుల్లో ఈ తరహా విష ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్టు సమాచారం.
అందువల్ల మంత్రులు విపక్షాల ఆరోపణలు, అవాస్తవ ప్రచారాలపై ఎప్పటికప్పుడు స్పందించాలని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించినట్టు తెలిసింది. ఇక మునుగోడు ఉప ఎన్నికను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు, ఉప ఎన్నికలు సర్వ సాధారణమని, ఒకట్రెండు ఉప ఎన్నికల ఫలితాలతో ఆందోళన అవసరం లేదని పేర్కొన్నట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని.. ఈ ఎన్నిక ప్రచారంలో విపక్షాల దుష్ప్రచారాన్ని సరైన రీతిలో ఎండగడుతూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో బీజేపీ ఏకాకి అవుతోందని, రాష్ట్రంలోనూ ఆ పార్టీకి అంతగా బలమేమీ లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం.
ఆదాయ సమీకరణపై దృష్టి పెట్టాలి..
కేంద్రం ఆర్థిక దిగ్బంధనం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సరిపడా నిధుల సమీకరణ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ప్రజలపై భారం పడకుండా ఆర్థిక వనరులను సమీకరించుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించినట్టు సమాచారం. అయితే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలికి తరలించడం ద్వారా.. నగరంలో కాలుష్యం తగ్గడంతోపాటు, ఐదు వేల ఎకరాలు అందుబాటులోకి వస్తాయని కేబినెట్ భేటీలో అధికారులు వివరించినట్టు తెలిసింది. దీంతో ఆ స్థలాలను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవచ్చని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక రాజీవ్ స్వగృహ, గృహకల్ప ప్రాజెక్టులకు చెందిన ఇళ్లు, ఖాళీ స్థలాల విక్రయం ద్వారా ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.
చదవండి: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment