సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపులు, ఉద్యోగుల పీఆర్‌సీ అమలు, కరోనా థర్డ్‌వేవ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది జీతాల పెంపు, ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహణ, ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉండటంతో అన్ని వర్గాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్ధులు కేబినెట్‌లో తీసుకునే కీలక నిర్ణయాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ భేటీలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ అమలుపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. గతంలో సీఎం శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు గత ఏప్రిల్ నుంచే ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడిప్పడే కరోనా తగ్గుముఖం పడుతూ, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో పీఆర్సీపై సానుకూల ప్రకటన వెలువడుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేస్తారా.. సడలింపు పొడిగిస్తారా?
కరోనా రెండో వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పగటి పూట పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో మినహాయింపు సమయాన్ని పొడిగించవచ్చని తెలుస్తోంది. కల్తీ విత్తనాలు, రసాయన మందులు విక్రయించే వారిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు వీలు కల్పిస్తూ అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వానాకాలం సాగు, ఎరువులు, విత్తనాలు, రసాయన మందులను అందుబాటులో ఉంచడం, రైతు బంధు సాయం పంపిణీ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ధరణి ఫిర్యాదుల పరిష్కారం, కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధత, వైద్య సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.
ఇంటర్ పరీక్షల రద్దుపై..
కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా సెకండియర్‌లోని ఆయా సబ్జెక్టుల్లో వేసి అందరినీ పాస్ చేయాలని ప్రతిపాదించింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి కేబినెట్ సమావేశం ముందుంచడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కేబినెట్ చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే ఆలోచనతో ఉంది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం తేదీలు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, ఆన్‌లైన్/డిజిటల్ క్లాసుల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలపై సైతం మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై కూడా చర్చ జరగనున్నట్టు తెలిసింది.
చదవండి: హుజూరాబాద్ మరో ఉద్యమానికి నాంది కాబోతోంది: ఈటల
Comments
Please login to add a commentAdd a comment