మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం
స్లీపర్ సర్వీసును ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్న అధికారులు
ఆ కేటగిరీ అయితే.. కొంత జాప్యం జరిగే చాన్స్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్–పుణే మధ్య త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ మార్గాన్ని రైల్వేబోర్డు నోటిఫై చేసినా.. రైల్ రేక్ సిద్ధంగా లేకపోవటంతో ప్రారంభించలేదు. ఈ క్రమంలో త్వరలో ఈ రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అది ముగిశాక ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది సర్వీసు కొనసాగుతోంది. అది రోజూ మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. వందే భారత్‌ను ఉదయమే బయలుదేరేలా నడిపే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి.
స్లీపర్ కేటగిరీపై పరిశీలన!
వందే భారత్ రైళ్లలో స్లీపర్ కేటగిరీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇటీవలే నమూనా రైలు సిద్ధమైంది. ఆ రైలు రేక్స్ తయారవుతున్నాయి. ట్రయల్‌రన్ తర్వాత వాటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 16 రూట్లను ఈ రైళ్లకోసం ఖరారు చేశారు. మరిన్ని మార్గాలను కూడా ఎంపిక చేయనున్నారు. సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపే అంశాన్ని కూడా రైల్వే బోర్డు పరిశీలిస్తోంది.
ఈ నగరాల మధ్య ప్రస్తుతమున్న పుణే శతాబ్ది రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతోంది. కానీ రాత్రివేళ సర్వీసు పెట్టాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ క్రమంలో రాత్రివేళ వందే భారత్ స్లీపర్ సర్వీసును ప్రారంభించి.. ఆ తర్వాత సాధారణ వందే భారత్‌ను శతాబ్ది స్థానంలో ప్రవేశపెట్టాలన్నది రైల్వే యోచన అని సమాచారం.
నాగ్‌పూర్ సర్వీసు విఫలంతో..
సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య 20 కోచ్‌లతో వందే భారత్ రైలు సేవలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నగరాల మధ్య నిత్యం నాలుగు రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్‌కు డిమాండ్ లేకుండా పోయింది. ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కూడా ఉండటం లేదు. నెల గడుస్తున్నా దీనికి ఆదరణ పెరగకపోవటంతో కోచ్‌ల సంఖ్యను తగ్గించి.. ఎనిమిది కోచ్‌లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుణే సర్వీసు ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
సికింద్రాబాద్–పుణే మధ్య సర్వీసులు తక్కువ. పైగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాలు కావడం, ప్రయాణికుల డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ సర్వీసు విఫలమయ్యే చాన్స్ లేదని ప్రాథమికంగా తేల్చారు. వందే భారత్‌ను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. సాధారణ వందే భారత్ సర్వీసా? స్లీపర్ సర్వీసా? అన్నదానిపై మహారాష్ట్ర ఎన్నికల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment