వాడీ – సనత్‌నగర్ మధ్య రైల్వే మార్గం విస్తరణకు ప్రతిపాదన
ఇప్పటికే ఉన్న రెండు లైన్లు.. కొత్తగా మరో రెండు లైన్ల నిర్మాణం
రాష్ట్రంలో తొలి నాలుగు లైన్ల రైల్వే కారిడార్ ఇదే.. రూ.4,446 కోట్ల వ్యయం
రైల్వే బోర్డుకు డీపీఆర్ సమర్పించిన దక్షిణ మధ్య రైల్వే
సాక్షి, హైదరాబాద్ : ఒక్క రైలు మార్గం.. నాలుగు లైన్ల ట్రాక్.. దేశంలోనే అరుదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లేదు. ఇప్పుడు తొలిసారిగా నాలుగు రైల్వే లైన్లతో కూడిన కారిడార్ సిద్ధం కాబోతోంది. సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని వాడీ మధ్య ఉన్న మార్గాన్ని నాలుగు లైన్లకు విస్తరించాలని రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్‌ను సిద్ధం చేసి ఇటీవలే రైల్వే బోర్డుకు పంపింది.
173 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈవిస్తరణకు దాదాపు రూ.4,446 కోట్లు అవసరమని అంచనా వేశారు. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేస్తే.. వచ్చే బడ్జెట్‌లోనే నిధులు కేటాయించేఅవకాశం ఉంది. ఈ విస్తరణతో వంద అదనపు రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం రెండు లైన్లతో..
సికింద్రాబాద్–వాడీ మధ్య ప్రస్తుతం 183 కిలోమీటర్ల మేర రెండు వరుసల రైల్వే కారిడార్ ఉంది. ఇది ముంబైకి ప్రధాన మార్గం కాగా.. బెంగళూరుకు ప్రత్యామ్నాయ మార్గం. ఈ రూట్‌లో నిత్యం 66 ప్రయాణికుల రైళ్లు నడుస్తున్నాయి. ఇక తాండూరు– వాడీ మధ్య పదుల సంఖ్యలో సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా పరిశ్రమలనూ నిర్మిస్తున్నారు. సేడం, నాగులపల్లి ప్రాంతాల్లో స్టీలు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి.
నిత్యం వందల టన్నుల సిమెంటు, స్టీలు ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఇక ఈ ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు తరలుతుంటాయి. వీటన్నింటికీ సంబంధించి నిత్యం 70 వరకు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి.
ఈ మార్గంలో రైల్వే ట్రాఫిక్ 120 శాతంగా ఉంది. అంటే సామర్థ్యం కంటే 20శాతం అదనంగా రైళ్లు నడుస్తున్నాయి. పైగా సరుకు రవాణాకు, ప్రయాణికుల రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. కానీ రైళ్లను పెంచలేని పరిస్థితి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మూడో లైన్ నిర్మించాలని నిర్ణయించారు.
రైల్వే బోర్డు జోక్యంతో నాలుగోలైన్..
దేశవ్యాప్తంగా కీలక కారిడార్లపై ఇటీవల రైల్వే బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో సికింద్రాబాద్–వాడీ సెక్షన్‌ను పరిశీలించింది. ఇక్కడ మూడోలైన్ నిర్మించిన కొంతకాలానికే నాలుగోలైన్ అవసరం ఏర్పడుతుందని, మళ్లీ భూసేకరణ సహా సమస్యలు వస్తాయని గుర్తించింది.
ఒకేసారి రెండు అదనపు లైన్లు నిర్మిస్తే మంచిదని తేల్చింది. పీఎం గతిశక్తిలో భాగంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ దీనికి ఆమోదముద్ర వేసింది. అధికారులు ఇటీవలే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసి, డీపీఆర్ రూపొందించి రైల్వే బోర్డుకు సమర్పించారు.
హఫీజ్‌పేట వరకు 4 లైన్లు.. సనత్‌నగర్ వరకు 3 లైన్లు..
సికింద్రాబాద్ వరకు నాలుగు లైన్లు నిర్మించాలనుకున్నా.. మధ్యలో భారీ నిర్మాణాలు ఉన్నందున భూసేకరణ కష్టమని గుర్తించారు. దీంతో వాడీ నుంచి నగరంలోని హఫీజ్‌పేట వరకు నాలుగు లైన్లకు విస్తరించి.. అక్కడి నుంచి సనత్‌నగర్ వరకు మూడు లైన్లకు పరిమితం చేస్తారు. సుమారు 600 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంటుందని, రూ.330 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఇక ఈ మార్గంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 202 వంతెనలు ఉన్నాయి. ఆయా చోట్ల కొత్త లైన్ల కోసం వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే నెల రోజుల్లో టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
భవిష్యత్‌లో బందరు పోర్టుతో అనుసంధానం
మరో రెండేళ్లలో ఏపీలోని బందరు పోర్టు సిద్ధం కాబోతోంది. తెలంగాణకు దగ్గరి పోర్టు ఇదే కావటంతో నేరుగా అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి డెడికేటెడ్ రైల్వే కారిడార్ కావాలని ఇటీవలే సీఎం రేవంత్ ప్రధానిని కోరారు.
ఆ లైన్ అందుబాటులోకి వస్తే, దానితో వాడీ లైన్‌ను అనుసంధానించే అవకాశం ఉంది. ఈ మార్గంలో వచ్చే సిమెంటు, స్టీలు, వ్యవసాయ ఉత్పత్తులువేగంగా బందరు పోర్టుకు చేరుతాయి.
Comments
Please login to add a commentAdd a comment