intercity train
-
South Central Railway: వందే భారత్ సరే... ఇంటర్సిటీ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: సుమారు పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు, లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఆరు కిలోమీటర్ల మేర అదనపు సదుపాయం అందుబాటులోకి వచ్చినా రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఠంచన్‌గా కేంద్ర బడ్జెట్ మాత్రం వచ్చిపోతూనే ఉంది. కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం రెడ్ సిగ్నలే పడడం గమనార్హం. రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణలో భాగంగా స్టేషన్ల ఆధునికీకరణ వంటి కొన్ని లాభదాయకమైన ప్రాజెక్టులు మినహాయించి లక్షలాది మంది ప్రయాణికలు ఆధారపడిన కొత్త రైళ్లు, లైన్ల విస్తరణకు మాత్రం నిధులు లభించడం లేదు. మరో వారం పది రోజుల్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసే ఎంపీల సమావేశం కూడా ఈసారి ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రవేశపెట్టనున్న కేంద్రబడ్జెట్లో హైదరాబాద్ ప్రజల రైల్వే ప్రయాణ అవసరాలు ఏ మేరకు ప్రతిబింబిస్తాయనే సందేహంగా మారింది. మరోవైపు గతంలో ప్రారంభించిన పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు మధ్య ఏర్పడిన పీటముడి కారణంగా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. వందే భారత్ సరే...ఇంటర్సిటీ ఏదీ... సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రూ.100 నుంచి రూ.150 వరకు చార్జీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వందేభారత్‌లో ప్రయాణం చేయాలంటే వరంగల్ వరకు కనీసం రూ.450 చెల్లించాలి. సికింద్రాబాద్ నుంచి నేరుగా విశాఖకు వెళ్లే ప్రయాణికులకు కూడా చార్జీలు భారమే అయినా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొంటే భారత్ ప్రయోజనకరమే. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ప్యాసింజర్లుగా నడిచిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా పేరు మార్చి చార్జీలు పెంచారు. అదే సమయంలో హాల్టింగ్ స్టేషన్లను తగ్గించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్సిటీ రైళ్లను పెంచాలనే ప్రతిపాదన ఆచరణకు నోచడం లేదు. వందేభారత్ కంటే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన ఇంటర్సిటీ, ప్యాసింజర్ రైళ్లను ఈ బడ్జెట్లోనైనా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రెండో దశకు పన్నెండేళ్లు .... రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే నగరంలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యతనివ్వాలని అప్పట్లో కేంద్రం భావించింది, ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. మొదటిదశలో పట్టాలెక్కిన రైళ్లు తప్ప కొత్తగా ఒక్క రైలు కూడా అందుబాటులోకి రాలేదు.పైగా గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటిని 78కి తగ్గించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల ఆధునికీకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. తాజాగా భారత్ అమృత్ స్టేషన్స్ పథకం కింద హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, లింగంపల్లి స్టేషన్లను గుర్తించారు. మిగతా 23 స్టేషన్లలో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు వంటివి కూడా తగినన్ని లేకపోవడం గమనార్హం. సుమారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు స్టేషన్లతో అనుసంధానమయ్యే రెండో దశ వల్ల రవాణా సదుపాయాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఆరు మార్గాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మూడు లైన్లు మాత్రం పూర్తయ్యాయి. ఈ మార్గాల్లో నడిపేందుకు రైళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. నగరంలో నాలుగో టర్మినల్‌గా భావించే చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌పైన ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఒక్క స్టేషన్ నుంచే రోజుకు 200 రైళ్లు నడుస్తున్నాయి. పుణ్యక్షేత్రాలకు రైళ్లు లేవు.. నగరం నుంచి యాదాద్రికి వెళ్లేందుకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాయగిరి స్టేషన్ అభివృద్ధికి మాత్రం రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. లక్షలాది మంది భక్తులు సందర్శించే యాదాద్రికి ఎంఎంటీఎస్ లేకుండా కేవలం స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అది అలంకారప్రాయమే కానుంది. -
ఇంటర్సిటీ ట్రైన్‌కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. ఉదయం 5:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఆందోళన రేగింది. డయల్ 100కు ఫోన్ చేసి ట్రైన్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో రైల్వే స్టేషన్లోనే ఆ రైలును ఆర్పీఎఫ్ పోలీసులు నిలిపివేశారు. రైలును అణువణువు తనిఖీ చేశారు. ఆర్పీఎఫ్ సీనియర్ డివిజన్ కమిషనర్ గాంధీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని తెలిపారు. అదేవిధంగా బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌ను ఫేక్ కాల్‌గా గుర్తించారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
కాచిగూడ రైల్వే ప్రమాద సీసీ టీవీ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం కర్నూల్-సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ఢీకొన్న విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడగా, వారిలో ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్ క్యాబిన్లో చిక్కుకున్న లోకో పైలెట్ చంద్రశేఖర్‌ను ఎనిమిది గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10.39 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చదవండి: కాచిగూడ స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీ మరోవైపు ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఉదయం ఇళ్ల నుంచి ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దుర్ఘటన దృష్ట్యా లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించే వాటిని సికింద్రాబాద్‌కే పరిమితం చేయడంతో సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు వెళ్లవలసిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే నాంపల్లి నుంచి ఫలక్‌నుమాకు కూడా సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్నింటిని దారిమళ్లించారు. ఆకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు. -
లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో సుమారు ఎనిమిది గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. రైలు ఇంజిన్‌లో ఇరుక్కొన్న లోకో పైలెట్ శేఖర్‌ను ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఇంజిన్ భాగాలను తొలగించి లోకో పైలెట్‌ను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కాచిగూడ రైల్వేస్టేషన్లో ఆగి వున్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను...అదే ట్రాక్ వచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 30 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. చదవండి: కాచిగూడ : ఆగివున్న ట్రైన్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ -
హైదరాబాద్ : కాచిగూడలో ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్
-
కాచిగూడ స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీ
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆగివున్న ఉన్న ప్యాసెంజర్ (ఇంటర్సిటీ) రైలు ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్ ట్రైన్ మూడు కోచ్‌లు ధ్వంసమయ్యాయి. మరో ఆరు కోచ్‌లు పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీస్ ట్రైన్ డ్రైవర్ శేఖర్ ఇంజన్లో ఇరుక్కుపోయారు. అతన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘటన నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లింగంపల్లిలో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లింగంపల్లిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో లింగంపల్లి రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న ఇంటర్సిటీ రైలు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలు డీజల్ ఇంజిన్‌కు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు ఎగసిపడ్డాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడం ఉత్కంఠ రేపింది. అయితే, సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. తెల్లజారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ
-
పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ, 10మంది మృతి!
బెంగళూరు : కర్ణాటక హోసూరు వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 10మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మరో వందమందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళుతుండగా బెంగళూరు-తమిళనాడు సరిహద్దులోని అనేకల్ సమీపంలో ఉదయం 7.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. D-8 బోగీ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు 10 అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా బోగీల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, రైల్వే సిబ్బంది... బయటకు తీసి చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.