
పట్టాలు తప్పిన ఇంటర్ సిటీ, 10మంది మృతి!
బెంగళూరు : కర్ణాటక హోసూరు వద్ద శుక్రవారం ఉదయం బెంగళూరు-ఎర్నాకులం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 10మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మరో వందమందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళుతుండగా బెంగళూరు-తమిళనాడు సరిహద్దులోని అనేకల్ సమీపంలో ఉదయం 7.40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. D-8 బోగీ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు 10 అంబులెన్స్ల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా బోగీల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, రైల్వే సిబ్బంది... బయటకు తీసి చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.