New train Service
-
వచ్చే అయిదేళ్లలో 3 వేల కొత్త రైళ్లు
న్యూఢిల్లీ: రానున్న నాలుగయిదేళ్లలో మూడు వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.వీటివల్ల రైల్వేల ప్రయాణికుల సామర్థ్యం ప్రస్తుతమున్న 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరుగుతుందని వెల్లడించారు. రైళ్ల వేగాన్ని పెంచడం, నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించడం కూడా తమ శాఖ ప్రథమ లక్ష్యమని గురువారం ఆయన రైల్వే భవన్లో మీడియాకు తెలిపారు.ప్రస్తుతం 69 వేల కొత్త కోచ్‌లు అందుబాటులో ఉండగా, ఏటా 5 వేల కోచ్‌లు కొత్తగా తయారవుతున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. వీటితో ఏడాదికి 200 నుంచి 250 వరకు కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని, వీటికి తోడు రానున్న సంవత్సరాల్లో మరో 400 నుంచి 450 వరకు వందేభారత్ రైళ్లు కూడా ఉంటాయని పేర్కొన్నాయి. -
Vande Metro: గుడ్‌న్యూస్.. ఇక వందే మెట్రో రైళ్లు
ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాణికుల కోసం గుడ్ న్యూస్ చెప్పారు. వంద కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రధాన నగరాలను కనెక్ట్ చేసేలా మెట్రో రైల్ వ్యవస్థ ‘వందే మెట్రో’ను ఈ ఏడాది చివర్లోనే పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించారాయన. సుదూర ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ తీసుకొచ్చిన సెమీ హై స్పీడ్ రైళ్లు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు తక్కువ దూరంలోని ప్రధాన నగరాలను అనుసంధానించేలా వందే మెట్రో రైళ్లను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారాయన. ఈ ఏడాది చివర్లోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వందే భారత్‌తో పోలిస్తే వందే మెట్రో డిఫరెంట్‌గా ఉంటుంది. డిసెంబర్ కల్లా ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారాయాన. అంతేకాదు.. వందే భారత్‌కు వస్తున్న స్పందనకు అనుగుణంగానే వందే మెట్రోలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్-లక్నో(90 కిలోమీటర్ల దూరం) నడుమ తొలి రైలు పట్టాలెక్కించాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. వేగంగా, రూట్లో ఫ్రీక్వెంట్‌గా సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది. తద్వారా ఉద్యోగులకు, విద్యార్థుల ప్రయాణాలకు వందే మెట్రో ఉపకరించొచ్చని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అభిప్రాయపడుతున్నారు. ఎనిమిది కోచ్‌లతో వందే మెట్రో రైళ్లను నడపాలని భావిస్తోంది. ఇప్పటికే చెన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి, లక్నోలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్‌కు రైల్వే శాఖ ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
South Central Railway: వందే భారత్ సరే... ఇంటర్సిటీ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: సుమారు పన్నెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు, లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఆరు కిలోమీటర్ల మేర అదనపు సదుపాయం అందుబాటులోకి వచ్చినా రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఠంచన్‌గా కేంద్ర బడ్జెట్ మాత్రం వచ్చిపోతూనే ఉంది. కానీ జంటనగరాల్లోని ప్రాజెక్టులకు మాత్రం రెడ్ సిగ్నలే పడడం గమనార్హం. రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణలో భాగంగా స్టేషన్ల ఆధునికీకరణ వంటి కొన్ని లాభదాయకమైన ప్రాజెక్టులు మినహాయించి లక్షలాది మంది ప్రయాణికలు ఆధారపడిన కొత్త రైళ్లు, లైన్ల విస్తరణకు మాత్రం నిధులు లభించడం లేదు. మరో వారం పది రోజుల్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రతి సంవత్సరం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసే ఎంపీల సమావేశం కూడా ఈసారి ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రవేశపెట్టనున్న కేంద్రబడ్జెట్లో హైదరాబాద్ ప్రజల రైల్వే ప్రయాణ అవసరాలు ఏ మేరకు ప్రతిబింబిస్తాయనే సందేహంగా మారింది. మరోవైపు గతంలో ప్రారంభించిన పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తప్ప పనులు ముందుకు సాగే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు మధ్య ఏర్పడిన పీటముడి కారణంగా మరికొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. వందే భారత్ సరే...ఇంటర్సిటీ ఏదీ... సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రూ.100 నుంచి రూ.150 వరకు చార్జీ ఉంటుంది. కొత్తగా వచ్చిన వందేభారత్‌లో ప్రయాణం చేయాలంటే వరంగల్ వరకు కనీసం రూ.450 చెల్లించాలి. సికింద్రాబాద్ నుంచి నేరుగా విశాఖకు వెళ్లే ప్రయాణికులకు కూడా చార్జీలు భారమే అయినా సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొంటే భారత్ ప్రయోజనకరమే. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో ప్యాసింజర్లుగా నడిచిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా పేరు మార్చి చార్జీలు పెంచారు. అదే సమయంలో హాల్టింగ్ స్టేషన్లను తగ్గించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్సిటీ రైళ్లను పెంచాలనే ప్రతిపాదన ఆచరణకు నోచడం లేదు. వందేభారత్ కంటే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన ఇంటర్సిటీ, ప్యాసింజర్ రైళ్లను ఈ బడ్జెట్లోనైనా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రెండో దశకు పన్నెండేళ్లు .... రాజధాని, శతాబ్ది వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే నగరంలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యతనివ్వాలని అప్పట్లో కేంద్రం భావించింది, ఈ మేరకు ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. మొదటిదశలో పట్టాలెక్కిన రైళ్లు తప్ప కొత్తగా ఒక్క రైలు కూడా అందుబాటులోకి రాలేదు.పైగా గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు వాటిని 78కి తగ్గించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల ఆధునికీకరణ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. తాజాగా భారత్ అమృత్ స్టేషన్స్ పథకం కింద హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, లింగంపల్లి స్టేషన్లను గుర్తించారు. మిగతా 23 స్టేషన్లలో కనీస సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు వంటివి కూడా తగినన్ని లేకపోవడం గమనార్హం. సుమారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు స్టేషన్లతో అనుసంధానమయ్యే రెండో దశ వల్ల రవాణా సదుపాయాలు బాగా విస్తరించే అవకాశం ఉంది. ఆరు మార్గాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు మూడు లైన్లు మాత్రం పూర్తయ్యాయి. ఈ మార్గాల్లో నడిపేందుకు రైళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయి. నగరంలో నాలుగో టర్మినల్‌గా భావించే చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌పైన ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఈ ఒక్క స్టేషన్ నుంచే రోజుకు 200 రైళ్లు నడుస్తున్నాయి. పుణ్యక్షేత్రాలకు రైళ్లు లేవు.. నగరం నుంచి యాదాద్రికి వెళ్లేందుకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్‌కు ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాయగిరి స్టేషన్ అభివృద్ధికి మాత్రం రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. లక్షలాది మంది భక్తులు సందర్శించే యాదాద్రికి ఎంఎంటీఎస్ లేకుండా కేవలం స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అది అలంకారప్రాయమే కానుంది. -
గుంటూరు, తిరుపతి మధ్య కొత్త రైలు
జమ్మలమడుగు (వైఎస్సార్ జిల్లా): నంద్యాల– ఎర్రగుంట్ల మధ్య మరో రైలు పట్టాలెక్కబోతుంది. ఈనెల 18వ తేదీన గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17261/17262) రాబోతుంది. ఇప్పటికే నంద్యాల– ఎర్రగుంట్ల రహదారిలో డెమో రైలు నడుస్తోంది. ప్రస్తుతం మరొకటి రాబోతుండటం.. నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు నంద్యాల, బనగాపల్లి, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడపలో మాత్రమే స్టాపింగ్ పెట్టారు. కొవెలకుంట్ల, జమ్మలమడుగులో స్టాపింగ్ లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహపడుతున్నారు. మూడో రైలు పరుగులు తీయబోతుంది... ఇప్పటికే డెమో.. ధర్మవరం–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లు ఎర్రగుంట్ల–నంద్యాల మీదుగా నడుస్తున్నాయి. కరోనా కారణంగా నంద్యాల– ఎర్రగుంట్ల డెమో రైలు దాదాపు రెండు సంవత్సరాలుగా నిలిపివేశారు. గత నెల 16వతేదీ నుంచి తిరిగి డెమో పునఃప్రారంభమైంది. అదేవిధంగా ధర్మవరం– విజయవాడ రైలు కూడా ఉదయం – రాత్రి పూట నడుస్తుంది. దీనికి అదనంగా రైల్వేశాఖ గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని సంకల్పించింది. గతంలో పాత రైలు నంబర్ 67232/67231 స్థానంలో 17261/17262 నంబర్ గల రైలును నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. 18న గుంటూరులో, 19న తిరుపతిలో ప్రారంభం కడప మీదుగా గుంటూరు–తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు డైలీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేసినట్లు కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరులో ఈనెల 18వ తేదీ ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురంరోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12.45 గంటలకు చేరుకుంటుంది. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4.25 గంటలకు చేరుతుందన్నారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 7.35 గంటలకు తిరుపతిలో బయలుదేరి కడపకు రాత్రి 9.55 గంటలకు చేరుకుంటుంది. ఇదేమార్గంలో మరుసటిరోజు ఉదయం 8.00 గంటలకు గుంటూరుకు చేరుతుందన్నారు. ఈ రైలులో ఏసీ త్రీ టైర్ ఒకటి, స్లీపర్ 10, జనరల్ బోగీలు 2, బ్రేక్వ్యాన్ రెండింటితో కలిపి మొత్తం 15 కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ కేంద్రంలో రైలు ఆపాలి జమ్మలమడుగు ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమల వెంకన్న దర్శనం కోసం,విద్యార్థులు చదువుకోవటానికి తిరుపతికి వెళుతుంటారు. గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 18న ప్రారంభించబోతున్నారు. జమ్మలమడుగు డివిజన్ కేంద్రంగా..నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌గా ఉంది. రైల్వేశాఖ అధికారులు ఇక్కడ రైలును ఆపితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – పి.నాగేశ్వరరెడ్డి, ఎస్పీ డిగ్రీకాలేజీ కరస్పాడెంట్ -
నరసాపురం–విజయవాడ మధ్య కొత్త రైలు సర్వీస్
సాక్షి, నరసాపురం: నరసాపురం–విజయవాడ మధ్య ప్రతిరోజూ నడిచేలా కొత్త రైలు సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. ఈ నెల 17 నుంచి ఈ ప్యాసింజర్ రైలు నడుస్తుందని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 07877 నంబరు గల ఈ రైలు ప్రతిరోజూ విజయవాడ నుంచి ఉదయం 7.10కి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. మళ్లీ నరసాపురం నుంచి 07281 నంబర్‌తో మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. (చదవండి: దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు) ప్రతిరోజూ నరసాపురం–విజయవాడ మధ్య నడిచే ఫాస్ట్ ప్యాసింజర్ రైలును ఇటీవల రైల్వేశాఖ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేసింది. అదీగాక మధ్యాహ్నం పూట నరసాపురం నుంచి విజయవాడకు ఎలాంటి సర్వీసులూ ప్రస్తుతం నడవడం లేదు. దీంతో ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్నం వేళ నరసాపురం నుంచి విజయవాడకు రైలు నడపాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా అది వాయిదా పడుతూ వస్తోంది. మధ్యాహ్నం వేళ నడిచే ఈ రైలు ఎట్టకేలకు ఈ నెల 17 నుంచి పట్టాలెక్కనుంది. (చదవండి: థ్యాంక్యూ టీటీడీ.. మహిళా భక్తురాలు ఈ–మెయిల్) -
ఐఆర్సీటీసీ షేరు.. దూకుడు
వచ్చే నెల(జూన్) 1నుంచీ దేశంలోని వివిధ ప్రాంతాలకు 200 నాన్ఏసీ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించడంతో కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న పీఎస్‌యూ ఐఆర్సీటీసీ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వరుసగా మూడో రోజు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్‌సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు తక్కువకావడంతో రూ. 1400 వద్ద ఫ్రీజయ్యింది. జూన్ 1 నుంచీ ప్రారంభంకానున్న రైళ్లకు ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమైన రెండు గంటల్లోనే దాదాపు 1.5 లక్షల టికెట్లు బుక్‌అయినట్లు ఐఆర్సీటీసీ తాజాగా వెల్లడించింది. సుమారు 2.9 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు పొందినట్లు తెలియజేసింది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ నెల 12న న్యూఢిల్లీ నుంచి వివిధ నగరాలను కలుపుతూ 30 ఏసీ రైళ్లను ప్రవేశపెట్టగా.. ఇటీవల శ్రామిక్ స్పెషల్ రైళ్లను 200 నుంచి 400కు పెంచేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఐఆర్సీటీసీ షేరు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. 118 శాతం ప్లస్ గతేడాది అక్టోబర్‌లో రూ. 644 వద్ద లిస్టయ్యాక ఐఆర్సీటీసీ షేరు ర్యాలీ బాటలో సాగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 1995 వద్ద రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. ఆపై కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో పతనమైన స్టాక్ మార్కెట్ల బాటలో మార్చి 26న రూ. 775కు పడిపోయింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. కోవిడ్-19ను కట్టడి చేసేందుకు మార్చి చివరి వారంలో లాక్‌డవున్ ప్రకటించాక తిరిగి కోలుకోవడం ప్రారంభించింది. ఏప్రిల్‌లో మార్కెట్ల బాటలో జోరు చూపుతూ వచ్చింది. తాజాగా రూ. 1400కు చేరుకుంది. మార్చి కనిష్టం నుంచి ఐఆర్సీటీసీ షేరు 80 శాతం దూసుకెళ్లింది. కాగా పబ్లిక్ ఇష్యూ ధర రూ. 320తో పోలిస్తే 337 శాతం జంప్‌చేసింది. లిస్టింగ్ ధర రూ. 644తో చూసినా 118 శాతం లాభపడటం విశేషం! -
రెండేళ్లలో కొత్త రైళ్లు..
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తానని, రెండేళ్లలో కొత్త రైళ్లు వేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. పలు అభివృద్ధి పనులతోపాటు కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భద్రతపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే ఇంజిన్ కండీషన్, కొత్త రైళ్ల పొడిగింపు, రైల్వేస్టేషన్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రభుత్వానికి బడ్జెట్ కోసం నివేదికను పంపించామని, నిధులు విడుదలైతే రెండేళ్లలో కొత్త రైళ్లతోపాటు ఆయా పనులు చేపడుతామన్నారు. కలకత్తా, బెంగళూరు, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైళ్ల రాకపోకలు సాగించాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి ఉందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రైళ్ల కోసం టెండర్ పనులు ప్రారంభించామని, త్వరలోనే టెండర్లు పూర్తయితే పనులు ప్రారంభిస్తామన్నారు. గతంలో మీటర్‌గేజ్ రైలు, ప్రస్తుతం బ్రాడ్‌గేజ్ రైళ్లు నడుస్తున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం మరింత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి నాందేడ్ వరకు వచ్చే రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని పలువురు విన్నవించారని, ఈ విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పిప్పల్‌కోటి, ముత్ఖేడ్ ఎలక్ట్రేషన్ పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది డబ్లింగ్ పనులు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. చిల్ర్డన్ పార్క్, సోలార్ ప్లాంట్, టీటీఈ రెస్ట్‌రూమ్‌లను ప్రారంభించారు. రైల్వే క్వార్టర్స్‌ను పరిశీలించి అక్కడ ఉంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ పనులను పరిశీలించారు. రోడ్డు సౌకర్యం, బోరు వేయించాలని అందులో ఉంటున్న వారు విన్నవించడంతో సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకనే ఆటంకాలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే రైల్వే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. ప్లైఓవర్, అండర్‌బ్రిడ్జి కోసం రూ.78 కోట్లు అవసరం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని, నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు చేపట్టడం లేదన్నారు. అలాగే ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ జాయింట్ వెంచర్‌కు సంబంధించిందని, ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయమై పలుసార్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిశామని, మరోసారి కలిసి ఈ పనుల విషయమై చర్చిస్తామన్నారు. వినతుల వెల్లువ.. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు పలువురు వినతులు సమర్పించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రైల్వే జీఎంను కలిసి పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరించాలని విన్నవించారు. చిల్ర్డన్ పార్కు, సోలార్ విద్యుత్, రైల్వే సిబ్బంది క్వార్టర్‌ను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి నాందేడ్‌కు వచ్చే వివిధ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ వైస్‌చైర్మన్ రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు విలాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్, రాష్ట్ర నాయకులు బండి దత్తాత్రితోపాటు పలువురు రైల్వే జీఎంను కలిసి వినతిపత్రాలు అందజేశారు. రైల్వేఓవర్, అండర్‌బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ పనులను చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్–ఢిల్లీ రైలు వేయాలని, ఆదిలాబాద్–ముత్ఖేడ్ వరకు డబుల్ రైల్వే లైన్ పనులు చేపట్టాలని, నిజామాబాద్ వరకు వస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని, ఆదిలాబాద్–హైదరాబాద్ వరకు ఉద యం పూట రైలు నడిపించాలని, ఆదిలాబాద్–నాగ్‌పూర్ రైలు సాయంత్రం వేళల్లో నడిపించాలని విన్నవించారు. కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో రెండు స్వీపర్ బోగీలను పెంచాలని కోరారు. -
కశ్మీర్ ప్రగతి ప్రస్థానం షురూ
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కారణంగా ఇప్పటి వరకు నిలిచిన కశ్మీర్ అభివృద్ధి ప్రస్థానం, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి మొదలయిందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గురువారం ఆయన రైల్వే మంత్రి గోయెల్‌తో కలిసి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఢిల్లీ–కత్రా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారం భంతో నవ భారతం, నవ జమ్మూకశ్మీ ర్కు కొత్త చరిత్ర సృష్టించ నున్నాయ న్నారు. ‘ఆర్టికల్ 370 దేశ ఐక్యతకు అవరోధంగా నిలవడమే కాదు, కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద అడ్డుగా మారిందని నా అభిప్రాయం. ఈ ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవా దాన్ని, ఉగ్ర భావజాలాన్ని పూర్తిగా రూపుమా పుతాం’ అని అమిత్ షా ప్రకటించారు. ‘వచ్చే 10 ఏళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా జమ్మూకశ్మీర్ మారనుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఈ ప్రగతి ప్రస్థానం ప్రారంభమైంది. ఈ రైలు ద్వారా అభివృద్ధికి,, ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం లభించనుంది’ అని ప్రకటించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రాకతో ఢిల్లీ–కత్రా ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గనుందన్నారు. వైష్ణోదేవి భక్తులకు బహుమతి: ప్రధాని ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ వైష్ణోదేవి భక్తులకు నవరాత్రి కానుక అని మోదీ అన్నారు. గురువారం ఆయన ట్విట్టర్లో..‘జమ్మూలోని నా సోదరసోదరీమణులకు, వైష్ణోదేవి మాత భక్తులకు నవరాత్రి కానుక. కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో న్యూఢిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయం ఉన్న కత్రాకు అనుసంధానత, ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి కానుంది’ అని పేర్కొన్నారు. వందేభారత్ విశేషాలు.. ► ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం ► మంగళవారం మినహా అన్ని రోజులు ► ప్రయాణ వేగం గంటకు 130 కి.మీ.లు ► ఎయిర్ కండిషన్డు కోచ్‌లు 16 ► ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2 ► కోచ్‌లను కలిపే సెన్సార్ డోర్లు ► కోచ్ మొత్తాన్ని పొడవుగా కలుపుతూ ఒకే మందపాటి కిటికీ ► సూర్య కిరణాలు సోకని, రాళ్లు రువ్వినా పగలని కిటికీలు. ► పశువులు అడ్డుగా వచ్చినా రైలుకు నష్టం కలగని, పట్టాలు తప్పకుండా ఇంజిన్ ముందుభాగంలో పటిష్టమైన అల్యూమినియంతో రక్షణ. ► ప్రతి కోచ్‌లోనూ సీసీటీవీ కెమెరాలు. ► ఫేసియల్ టెక్నాలజీ ద్వారా వ్యక్తుల అనుమానాస్పద కదలికలను గుర్తించేæ సాంకేతికత. ► కోచ్‌ల్లో రివాల్వింగ్ సీట్లు, కొత్త రకం వాష్ బేసిన్లు, ఆటోమేటిక్ డోర్లు, వైఫై. ► ప్రయాణికులు వదిలేసిన లగేజీని గుర్తించే టెక్నాలజీ ► డీప్ ఫ్రీజర్‌తో కూడిన విశాలమైన ప్యాంట్రీ, నీటి శుద్ధి యంత్రం, రెండు బాటిల్ కూలర్స్ ► కోచ్‌ల్లో ప్లాస్టిక్ బాటిల్స్ క్రషర్ మెషీన్లు ► డ్రైవర్, గార్డుల మధ్య నేరుగా సమాచారం అందించుకోవటానికి ప్రత్యేకంగా హ్యాండ్సెట్ ఫోన్లు. -
తిరుపతికి ప్రత్యేక రైలు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైలు నడిపించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు రోజులు రైలు నడుస్తుండగా మూడు నెలలపాటు అదనంగా మరో ప్రత్యేక రైలును నడిపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆది వారం తిరుపతి నుంచి కరీంనగర్‌కు ప్రత్యేక రైలు ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర రైల్వేమంత్రికి ఎంపీ సంజయ్ వినతి కరీంనగర్‌నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిపించాలని కోరుతూ గురువారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తిరుపతికి ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉందని, ప్రస్తుతం గురు, ఆదివారం కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు నడుస్తోందని, ప్రతిరోజు రైలు నడిపించడంతో జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఎంపీ విజ్ఙప్తి మేరకు మంత్రి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్యా ముందుగా మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ప్రత్యేక రైలు నడిపించాలని నిర్ణయించారు. ఈ మూడు నెలల్లో రైలు విజయవంతంగా నడిచినట్లయితే రెగ్యులర్ చేయాలని ఆదేశించారు. ప్రత్యేక రైలులో ఏసీ, స్లీపర్క్లాసులు అందుబాటులో ఉన్నట్లు కరీంనగర్ రైల్వేస్టేషన్ మేనేజర్ రాజశేఖరప్రసాద్ తెలిపారు. పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గుంటూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని వివరించారు. నేడు తిరుపతిలో ప్రారంభం.... కరీంనగర్–తిరుపతి ప్రత్యేక రైలును ఆదివారం తిరుపతిలో ప్రారంభించనున్నారు. తిరుపతి నుంచి ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో నడుస్తుంది. కరీంనగర్ నుంచి మంగళ, బుధ, శుక్రవారాల్లో వెళ్తుంది. తిరుపతి నుంచి ఈ నెల 21,23,25,28,30,ఆగస్టు–1,4,6,8,11,13,15, 18,29,22,25,27,29, సెప్టెంబరు 1,3,5,8,10, 12,15,17,19,22,24,26,29 తేదీల్లో ఉంటుంది. కరీంనగర్ నుంచి ఈ నెల 22,24,26,31,ఆగస్టు 2,5,7,9,12,14, 16,19, 21,23,26,28,30, సెప్టెంబరు 2,4,6,9,11,13, 16,18,20,23,25, 27,30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. -
రైలొస్తోంది
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం పట్టణ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రైలు సోమవారం నుంచి పట్టాలెక్కనుంది. ఐదేళ్లుగా ఎంఎంటీఎస్ రాక కోసం ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెల్లాపూర్, బీహెచ్ఈఎల్, రామచంద్రపురం మూడు స్టాప్‌లను ఏర్పాటు చేశారు. గతంలో ఎంఎంటీఎస్ రైలు లింగంపల్లి వరకు వచ్చేది. గతంలోనే తెల్లాపూర్ మీదుగా రామచంద్రాపురం పట్టణం వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగించారు. పనులు పూర్తయి సుమారు రెండేళ్లు పూర్తి అవుతున్నా రైలు రాక కోసం ప్రజలు ఎదురు చూడాల్సి వచ్చింది. 6 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరలో ఎంఎంటీఎస్ రైలును రప్పించేందుకు కృషి చేస్తామని ఎన్నికల హామీలు సైతం ఇచ్చారు. ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులను సైతం సంప్రదించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుండి రామచంద్రాపురం నుంచి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం కానుంది. ఆదివారం రాత్రి ఫలక్‌నుమా నుంచి ఎంఎంటీఎస్ రైలు 11 గంటల 10నిమిషాలకు రామచంద్రపురం రైల్వే స్టేషన్ చేరుకోనుంది. తిరిగి ఉదయం 5 గంటలకు రామచంద్రపురం నుంచి ఫలక్‌నుమా బయలు దేరి వెళ్లనుంది. ఆదివారం ఈ మార్గంలోని రైల్వే స్టేషన్లో సాంకేతిక పరమైన పనులను అధికారులు పూర్తి చేశారు. రాత్రి లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఆగే ఎంఎంటీఎస్ రైలును రామచంద్రాపురం రైల్వే స్టేషన్ వద్ద ఆపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్టు తెలిసింది. ఈ మార్గంలో రద్దీని బట్టి రైళ్ల సంఖ్య పేరిగే అవకాశం ఉంది. రెండు రోజులుగా రామచంద్రాపురం రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే ఎంఎంటీఎస్ రైలుకు చెందిన టైం టేబుల్ వాట్సాప్‌లలో హల్చల్ చేస్తోంది. దీనిపై స్థానిక రైల్వే అధికారులను సంప్రదించగా ఎంఎంటీఎస్ రైలు మాత్రం రాత్రి 11 గంటల సమయంలో రామచంద్రపురం రైల్వే స్టేషన్లో ఉందని వివరించారు. ఉదయం 5 గంటల సమయంలో ఫలక్‌నుమా బయలుదేరి వెళుతుందని చెప్పారు. పూర్తి వివరాలు తమ పరిధిలో లేవని వివరించారు. -
కాచిగూడ-కరీంనగర్ రైలు ప్రారంభం
నిజామాబాద్‌అర్బన్ : కాచిగూడ - నిజామాబాద్ ప్యాసింజర్ రైలును కరీంనగర్ వరకు పొడగించగా శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణలతో కలిసి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ గుప్తాం మాట్లాడుతూ కరీంనగర్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ రైల్వేస్టేషన్లో మరిన్ని సౌకర్యలు కల్పించాలని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. రైల్వేస్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ప్లాట్‌ఫారాలను పెంచాలని, ఎస్కలేటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్యూబీ పనులను కూడా త్వరగా పూర్తి చేయలన్నారు. అనంతరం కలెక్టర్ రామ్మోహన్రావు మాట్లాడుతూ ఈ రైలు ప్రారంభించడంతో ప్రజలకు సౌకర్యవంతంగా మారిందన్నారు. రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రైళ్లను, రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా రైలు క్యాబిన్లో కూర్చొని రైలు నడిపే విధానాన్ని పరిశీలించారు. రైల్వే అధికారులతో రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, పాల్గొన్నారు. రైలు రాకపోకల వేళలు రైలు నెంబర్ 57601 రైలు కరీంనగర్-జగిత్యాల - నిజామాబాద్ - కామారెడ్డి- మేడ్చల్ - కాచిగూడ మధ్య అన్ని స్టేషన్లలో ఆగుతుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌కు చేరుకుంటుంది. ప్రయాణంలో ఈ రైలు కరీంనగర్ స్టేషన్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. వేల్పూర్‌లో స్వాగతం వేల్పూర్: కాచిగూడ, కరీంనగర్ రైలుకు వేల్పూర్ స్టేషన్ వద్ద శుక్రవారం బీజేపీ మండలాధ్యక్షుడు బట్టు లక్ష్మణ్ స్వాగతం పలికారు. అదే రైలులో ప్రయాణిస్తున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్ రూట్లో మరోరైలు ఇక్కడి ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం మోర్తాడ్ వరకు రైలులో బయలుదేరి వెళ్లారు. -
కొత్త రైలు మార్గంలో తొలి ఎక్స్‌ప్రెస్
కడప : కర్నూలు–వైఎస్సార్ జిల్లాను కలుపుతూ నిర్మితమైన నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైనులో విజయవాడ–ధర్మవరం మధ్య నడిచే రైలు తొలిఎక్స్ప్రెస్ రైలుగా నడిపించనున్నారు. ప్రస్తుతం వారానికి రెండుసార్లు నడుస్తున్న విజయవాడ–ధర్మవరం, ధర్మవరం–విజయవాడ (17215/17216) రైలును నంద్యాల–ఎర్రగంట్ల మార్గంలో మళ్లిస్తున్నారు. ఈనెల 16న తేదిన ధర్మవరం నుంచి విజయవాడకు సాయంత్రం 4గంటలకు (17216) ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. నంద్యాలకు అర్ధరాత్రి 12.06కు చేరుకొని ఇక్కడి నుంచి గిద్దలూరు, మార్కాపురం, గుంటూరు మీదుగా విజయవాడకు మరుసటిరోజు 6.05గంటలకు చేరుతుంది. అలాగే17వతేదిన విజయవాడ–ధర్మవరం ఎక్స్ప్రెస్రైలు (17215) రాత్రి 11 గంటలకు బయలుదేరి నంద్యాలకు 18వతేది తెల్లవారుజామున 5.25చేరుకుంటంది. నంద్యాల నుంచి ఎర్రగంట మార్గంలో బయలుదేరి బనగానపల్లెకు 6.00, జమ్మలమడుగు 7.00, ప్రొద్దుటూరుకు 7.30కు, ఎర్రగుంట్లకు 7.55, తాడిపత్రికి 9.15, గుత్తికి 10.20, అనంతపురం 11.53, ధర్మవరానికి మధ్యాహ్నాం1గంటలకు చేరుకుంటుంది. విజయవాడ–ధర్మవరం రైలును నంద్యాల–ఎర్రగుంటల మార్గంలలో మళ్లిస్తుండటంతో దాదాపు గంట ఆలస్యంగా ఆయా ప్రాంతాలకు ప్రయాణీకులు చేరుకుంటారని గుంతకల్ ఎడీఆర్ఎం సుబ్బరాయుడు ‘సాక్షి’తెలిపారు. రాజధానికి రైలుటిక్కెట్ల ధరలిలా.. ఎర్రగుంట్ల–విజయవాడకు స్లీపర్‌కు రూ250, ధర్డ్‌ఎసీకి రూ670. సెకండ్‌ఎసీకి రూ. 960, ఫస్ట్ ఎసీకి రూ.1620, ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు స్లీపర్‌కు రూ.240, ధర్డ్‌ఎసీకి రూ.650, సెకండ్‌ఎసీకి రూ.930, ఫస్ట్ఎసీకి రూ.1560, జమ్మలమడుగు నుంచి విజయవాడకు స్లీపర్ రూ.235, ధర్డ్‌ఎసీకి రూ625, సెకండ్‌ఎసీకి రూ.895, ఫస్ట్ఎసీకి రూ.1505లు రైల్వే నిర్ణయించింది. జనరల్ టికెట్లో ఎర్రగుంట్ల నుంచి విజయవాడకు రూ.130, ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు రూ.130, జమ్మలమడుగు నుంచి విజయవాడకు రూ.125లుగా నిర్ణయించారు. -
12వేల కిలోమీటర్లు ప్రయాణించింది
న్యూఢిల్లీ: లండన్ నుంచి ఓ రైలు సుమారు 12వేల కిలోమీటర్లు(7500 మైళ్లు) ప్రయాణించి శనివారం చైనా చేరింది. ఈ ట్రైన్ దక్షిణ యూరప్ గుండా ప్రయాణించింది. సుమారు 15 ప్రధాన పట్టణాలను దాటకుంటూ వచ్చింది. దీనిపేరు ఈస్ట్ విండ్. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద రైలు మార్గం. దీనికి సిల్కరోడ్ గా నామకరణం చేశారు 2013లో చైనా వన్ బెల్టు వన్ రోడ్ విధానంలో వివిధ మార్గాలను కలుపుకుంటూ అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగానే లండన్ నుంచి చైనాకు ఈ రైలు మార్గాన్ని నిర్మించింది. ఈ రైలు విస్కీ బాటిళ్లు, పిల్లల పాలు, మందులు, యంత్రాలతో ఏప్రిల్10న లండన్‌లో బయలుదేరింది. ప్రాన్స్, బెల్జియం, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజకిస్థాన్ దేశాల గుండా 20 రోజుల ప్రయాణం అనంతరం తూర్పు చైనాలోని ఈవు పట్టణానికి శనివారం చేరుకుంది. దీనిలో సుమారు 88 షిప్ కంటెనర్లతో ప్రయాణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.