రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణ ప్రజలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ రైలు సోమవారం నుంచి పట్టాలెక్కనుంది. ఐదేళ్లుగా ఎంఎంటీఎస్ రాక కోసం ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెల్లాపూర్, బీహెచ్‌ఈఎల్, రామచంద్రపురం మూడు స్టాప్‌లను ఏర్పాటు చేశారు. గతంలో ఎంఎంటీఎస్ రైలు లింగంపల్లి వరకు వచ్చేది. గతంలోనే తెల్లాపూర్ మీదుగా రామచంద్రాపురం పట్టణం వరకు ఎంఎంటీఎస్ రైలును పొడిగించారు. పనులు పూర్తయి సుమారు రెండేళ్లు పూర్తి అవుతున్నా రైలు రాక కోసం ప్రజలు ఎదురు చూడాల్సి వచ్చింది. 6 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరలో ఎంఎంటీఎస్ రైలును రప్పించేందుకు కృషి చేస్తామని ఎన్నికల హామీలు సైతం ఇచ్చారు. ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులను సైతం సంప్రదించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుండి రామచంద్రాపురం నుంచి ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం కానుంది.
ఆదివారం రాత్రి ఫలక్‌నుమా నుంచి ఎంఎంటీఎస్ రైలు 11 గంటల 10నిమిషాలకు రామచంద్రపురం రైల్వే స్టేషన్ చేరుకోనుంది. తిరిగి ఉదయం 5 గంటలకు రామచంద్రపురం నుంచి ఫలక్‌నుమా బయలు దేరి వెళ్లనుంది. ఆదివారం ఈ మార్గంలోని రైల్వే స్టేషన్‌లో సాంకేతిక పరమైన పనులను అధికారులు పూర్తి చేశారు. రాత్రి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగే ఎంఎంటీఎస్ రైలును రామచంద్రాపురం రైల్వే స్టేషన్ వద్ద ఆపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్టు తెలిసింది. ఈ మార్గంలో రద్దీని బట్టి రైళ్ల సంఖ్య పేరిగే అవకాశం ఉంది. రెండు రోజులుగా రామచంద్రాపురం రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే ఎంఎంటీఎస్ రైలుకు చెందిన టైం టేబుల్ వాట్సాప్‌లలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై స్థానిక రైల్వే అధికారులను సంప్రదించగా ఎంఎంటీఎస్ రైలు మాత్రం రాత్రి 11 గంటల సమయంలో రామచంద్రపురం రైల్వే స్టేషన్‌లో ఉందని వివరించారు. ఉదయం 5 గంటల సమయంలో ఫలక్‌నుమా బయలుదేరి వెళుతుందని చెప్పారు. పూర్తి వివరాలు తమ పరిధిలో లేవని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment