సెంట్రల్ మార్గంలో లోకల్ రైళ్లలో ప్రయాణించేవారికి త్వరలో రద్దీ నుంచి ఊరట లభించనుంది.
సాక్షి, ముంబై: సెంట్రల్ మార్గంలో లోకల్ రైళ్లలో ప్రయాణించేవారికి త్వరలో రద్దీ నుంచి ఊరట లభించనుంది. ఈ మార్గంలో మరో ఆరు నెలలోల 12, 15 బోగీల రైళ్లను ప్రారంభించనున్నారు. దీంతోపాటు ట్రిప్పుల సంఖ్యను కూడా పెంచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అదీగాక ఈ మార్గంలో గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో నడిచే ఫాస్ట్ రైళ్లను అందుబాటులోకి తేవాలని కూడా యోచిస్తున్నట్లు చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సమయం కూడా చాలావరకు ఆదాకానుంది. ఇందుకోసమే ప్రస్తుతం డెరైక్ట్ కరెంట్(డీసీ) నుంచి ఆల్టర్‌నేట్ కరెంట్(ఏసీ)కు మార్చే పనులు చేస్తున్నారని చెప్పారు. ఆదివారం కల్యాణ్-ఠాణే-లోకమాన్య తిలక్ టెర్మినస్ సెక్షన్లలో విద్యుత్‌ను డీసీ నుంచి ఏసీకి మార్చారు. దీంతో ప్రస్తుతం కంటే మరింత వేగంగా రైళ్లు నడువనున్నాయి.
ముఖ్యంగా రద్దీ సమయాలలో ఈ ఫాస్ట్ రైళ్లు మరిన్ని ఎక్కువ ట్రిప్పులతో సేవలు అందించనున్నాయి. బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఇకపై చాలా తక్కువగా ఉంటుందని సెంట్రల్ రైల్వే అధికార ప్రతినిధి అతుల్ రాణే తెలిపారు. కల్యాణ్-ఎల్‌టీటీ మార్గాల మధ్య ఫాస్ట్ రైళ్లను ప్రారంభించడంతో ప్రయాణికుల సమయం దాదాపు 10 నిమిషాల వరకు ఆదా అయ్యే అవకాశముందన్నారు. డీసీ నుంచి ఏసీకి మార్చడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. గతంలోనే కొత్తగా రెండు రైళ్లను ప్రారంభించాల్సి ఉన్నా అది సాధ్యం కాలేదని, తాజా ప్రతిపాదనలతో ఈ మార్గంలో ప్రయాణించేవారికి అనేకరకాలుగా ప్రయోజనం కలగనుందన్నారు. మరో ఆరు నెలల్లో సీఎస్‌టీ వరకు డీసీ నుంచి ఏసీకి మార్పులు చేయనున్నట్లు ఆయన తెలిపారు.