♦ నేరాలు అరికట్టడానికి కొత్త నిర్ణయం
♦ కమిషనర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం
♦ హమాలీలు, స్టాల్స్ యజమానులను చేర్చుకోవాలని నిర్ణయం
సాక్షి, ముంబై : లోకల్ రైళ్లు, ప్లాట్‌ఫారాలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ముంబై రైల్వే విభాగం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ‘పోలీసు మిత్ర’ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. రైల్వే కూలీలు, ప్లాట్‌ఫారాలపై ఉపాధి పొందుతున్న తినుబండారాలు, పుస్తకాలు విక్రయించే స్టాల్ యజమానులను పోలీసు మిత్రులుగా చేర్చుకోవాలని నిర్ణయించింది. పథకాన్ని రైల్వే పోలీసు కమిషనర్ మధుకర్ పాండే చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ దీపాలి అంబురే చెప్పారు. లోకల్ రైళ్లలో నేరాల సంఖ్య ప్రస్తుతం బాగా పెరిగింది.
రాత్రులందు మహిళల బోగీలలో ప్రత్యేక పోలీసులను నియమించినప్పటికీ ప్లాట్‌ఫారాలు, స్టేషన్ ఆవరణలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే పోలీసుల కొరత కారణంగా అంతట దృష్టి సారించలేకపోతున్నారు. అయితే హమాలీలు, బూట్ పాలీష్ చేసేవాళ్లు, స్టాల్స్ యజమానులు ఎక్కువ కాలం ప్లాట్‌ఫారాలపైనే ఉంటారు. వచ్చిపోయే ప్రయాణికులపై దృష్టి సారించే ందుకు వీరికి అవకాశం ఎక్కువ. కాబట్టి వీరిలో కొందరిని పోలీసు మిత్రులుగా చేర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు.
అనుమానితుల కదలికలపై వీరు నిఘా పెడతారు. అనుమానాస్పద బ్యాగులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు. ఫిర్యాదుదారులను నేరుగా పోలీసుల వద్దకు తీసుకెళ్లడం, రహస్య సమాచారం చేరవేయడం లాంటి బాధ్యతలు వీరిపై ఉంటాయి. ప్రతీ ప్లాట్‌ఫారంపై ముగ్గురు, స్టేషన్ ఆవరణలో 10 మందిని పోలీసు మిత్రులుగా నియమించనున్నట్లు అంబురే చెప్పారు.
ముంబై రైల్వే ‘పోలీస్ మిత్ర’
Published Tue, Apr 21 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM
Advertisement