Mumbai railway section
-
ముంబై రైల్వే ట్రాక్‌లపై 3వేల మంది మృతి
ముంబై: ముంబై మెట్రోపాలిటన్ సిటీలోని సబ్-అర్బన్ సహా వివిధ రైలు మార్గాల్లో 2017 సంవత్సరంలో జరిగిన ప్రమాదాల్లో మూడువేలమందిపైగా ప్రయాణికులు మృతిచెందినట్లు రైల్వే శాఖ తెలిపింది. పశ్చిమ, సెంట్రల్, హార్బర్, సబ్ అర్బన్ మార్గాల్లో వీరు చనిపోయినట్లు నగరానికి చెందిన సమాచార కార్యకర్త సమీర్ జవేరి దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రభుత్వ రైల్వే పోలీసులు సమాధానమిచ్చారు. 1651మంది పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని మృతిచెందారని, 654మంది నడుస్తున్న రైళ్ల నుంచి జారిపడి మృతిచెందారని పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం, రైళ్ల నుంచి జారి పడడం, రైళ్లు ఢీకొని మృతిచెందడం వంటి మూడు కారణాలతో ఇంతమంది చనిపోతున్నారని, వీటిలో ఆత్మహత్యలను నివారించలేమని, మిగతా రెండింటిని నిరోధించగలమని సెంట్రల్ రైల్వే జీఆర్పి ఏసీపీ మచ్చీంద్ర చవాన్ చెప్పారు. అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజి మహరాజ్ టెర్మినస్(సీఎస్ఎంటీ), దాదర్, బైకుల్లా స్టేషన్లు ఉన్న సెంట్రల్ లైన్లో1534మంది చనిపోయారని తెలిపారు. కాగా, వెస్టర్న్ లైన్లో 1540మంది గాయపడ్డారని, 1435మంది సెంట్రల్ లైన్లో, 370మంది హార్బర్ లైన్లో గాయపడ్డారని ఆ నివేదిక పేర్కొంది. ఈ విధంగా రోజుకు 9మంది చనిపోతున్నారని, దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వివిధ ప్రదేశాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని ఏసీపీ వివరించారు. -
ముంబై రైల్వే ‘పోలీస్ మిత్ర’
♦ నేరాలు అరికట్టడానికి కొత్త నిర్ణయం ♦ కమిషనర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం ♦ హమాలీలు, స్టాల్స్ యజమానులను చేర్చుకోవాలని నిర్ణయం సాక్షి, ముంబై : లోకల్ రైళ్లు, ప్లాట్‌ఫారాలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ముంబై రైల్వే విభాగం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ‘పోలీసు మిత్ర’ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. రైల్వే కూలీలు, ప్లాట్‌ఫారాలపై ఉపాధి పొందుతున్న తినుబండారాలు, పుస్తకాలు విక్రయించే స్టాల్ యజమానులను పోలీసు మిత్రులుగా చేర్చుకోవాలని నిర్ణయించింది. పథకాన్ని రైల్వే పోలీసు కమిషనర్ మధుకర్ పాండే చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ దీపాలి అంబురే చెప్పారు. లోకల్ రైళ్లలో నేరాల సంఖ్య ప్రస్తుతం బాగా పెరిగింది. రాత్రులందు మహిళల బోగీలలో ప్రత్యేక పోలీసులను నియమించినప్పటికీ ప్లాట్‌ఫారాలు, స్టేషన్ ఆవరణలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే పోలీసుల కొరత కారణంగా అంతట దృష్టి సారించలేకపోతున్నారు. అయితే హమాలీలు, బూట్ పాలీష్ చేసేవాళ్లు, స్టాల్స్ యజమానులు ఎక్కువ కాలం ప్లాట్ఫారాలపైనే ఉంటారు. వచ్చిపోయే ప్రయాణికులపై దృష్టి సారించే ందుకు వీరికి అవకాశం ఎక్కువ. కాబట్టి వీరిలో కొందరిని పోలీసు మిత్రులుగా చేర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. అనుమానితుల కదలికలపై వీరు నిఘా పెడతారు. అనుమానాస్పద బ్యాగులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు. ఫిర్యాదుదారులను నేరుగా పోలీసుల వద్దకు తీసుకెళ్లడం, రహస్య సమాచారం చేరవేయడం లాంటి బాధ్యతలు వీరిపై ఉంటాయి. ప్రతీ ప్లాట్‌ఫారంపై ముగ్గురు, స్టేషన్ ఆవరణలో 10 మందిని పోలీసు మిత్రులుగా నియమించనున్నట్లు అంబురే చెప్పారు.