సాక్షి, ముంబై: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది లోకల్ రైళ్లలో నేరాల సంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. రైళ్లలో చోరీలు, మహిళా ప్రయాణికులను వేధించడం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వీటి సంఖ్య పెరిగిందని అధికారి తెలిపారు. అయితే హత్యల సంఖ్య తగ్గిందన్నారు. సెంట్రల్ లైన్‌లోని కుర్లా, ఠాణే, కళ్యాణ్ అదేవిధంగా హర్బర్ మార్గంలోని మాన్‌కుర్డ్, వడాలా మార్గాలలో ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి. చాలామంది నిరుద్యోగులు మురికివాడల్లో ఉంటూ ఈ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారని ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు.
ఇదిలా వుండగా నేరాలను నియంత్రించేందుకు జీఆర్పీకి చెందిన మహిళా పోలీసు అధికారులను మహిళా బోగీల్లో నియమిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీరిని బృందాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో బృందంలో ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక అధికారి ఉంటారన్నారు. వీరు యూనిఫాంలో కాకుండా సివిల్ డ్రస్సుల్లో రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎవరైనా ఆ బోగీల్లోకి చొరబడి ప్రయాణికుల విలువైన వస్తువులు, బ్యాగులు అపహరించేందుకు చూసినా లేదా ఆభరణాలు చోరీ చేయడానికి ప్రయత్నించినా వారిని వెంటనే పట్టుకుంటారని తెలిపారు.
ఇదిలా ఉండగా, బాంద్రా, మాహిమ్ ఏరియాల్లో రైల్ ఫుట్‌బార్ వద్ద నిల్చొని ఉన్న ప్రయాణికుల బ్యాగులు, ఇతర విలువైన వస్తువుల చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే, కొంతమంది యువకులు ఎలిఫిన్‌స్టన్, దాదర్ రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కి ప్రయాణికులపై దాడిచేసి దోచుకుంటున్నారు. వీరు ప్లాట్‌ఫాంపై ఉన్న భద్రతా సిబ్బందిపై కూడా చేయి చేసుకోవడమే కాకుండా మహిళా ప్రయాణికులను కూడా వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది బాంద్రా టర్మినస్ వద్ద ప్రీతీ రాథీ అనే మహిళపై జరిగిన యాసిడ్ దాడి కేసును పరిష్కరించడంలో విఫలమైనట్లు రైల్వే క్రైం బ్రాంచ్‌కు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ డీడీ వద్‌మారే తెలిపారు.
‘లోకల్’లో పెరిగిన నేరాలు
Published Wed, Dec 18 2013 12:09 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
Advertisement
Advertisement