సాక్షి, ముంబై: నగరవాసులకు మోనో రైలుపై మోజు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఎంతో ఆదరణ చూపించిన ముంబై జనం ఇప్పుడు ముఖం చాటేశారు. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండటంతో ఈ విషయం బయటపడింది. భార తదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన మోనోరైలు సేవలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో ప్రతిరోజు సరాసరి 18 వేల నుంచి 20 వేల వరకు ప్రయాణించేవారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు భావించాయి. కాని తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సరాసరి 13 వేల నుంచి 15 వేల వరకు ప్రయాణిస్తున్నారు.
మోనో రైళ్లు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే తిరిగేవి. గత మంగళవారం నుంచి ఈ సేవలను రాత్రి ఎనిమిది గంటల వరకు విస్తరించారు. రైళ్ల సమయాన్ని పెంచితే ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావించారు. కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. అంతేగాక ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల్లో అత్యధిక శాతం కేవలం రైలు ప్రయాణాన్ని ఆస్వాదించడానికే అందులో వెళుతున్నారు. కాగా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి వేసవి సెలవులే కారణమని, ప్రజలు స్వగ్రామాలకు తరలిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు సమర్థించుకుంటున్నారు.
మోనో రైలుపై తగ్గిన మోజు
Published Thu, Apr 17 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM
Advertisement