సాక్షి, ముంబై: దేశంలోనే మొట్ట మొదటిసారిగా ముంబై నగరంలో ప్రవేశపెట్టిన మోనో రైలుకు ప్రయాణికుల నుంచి అనుకున్నంత మేర స్పందన రావడం లేదు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కూడా ప్రయాణికులు లేక మోనో రైలు ఖాళీగానే తిరుగుతోంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మోనో రైలు నష్టాలను చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రారంభంలో అనేక మంది ముంబైకర్లు ఈ రైలులో రాక పోకలు సాగించారు. ప్రస్తుతం జాయ్ రైడ్ చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇటు ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పడిపోవడంతో రైలు అలంకార ప్రాయంగా మిగిలిపోతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రిప్పులు పెరిగినా..
2014 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రైలు ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో రైలును లాంఛనంగా ప్రారంభించిన ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) ఆదాయంపై ఎన్నో ఆశాలు పెట్టుకుంది. కానీ, మొదటి దశలో నడుస్తున్న చెంబూర్-వడాల డిపోల మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. ఈ మార్గంలో ఏడు స్టేషన్లు ఉన్నప్పటికీ ఇందులో ఆర్సీ మార్గ్, ఫర్టీలైజర్, భారత్ పెట్రోలియం, మైసూర్ కాలనీ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అంతగా లేదు. ప్రయాణికులు సౌకర్యార్థం ఇటీవల సమయాన్ని కూడా పెంచారు. దీనివల్ల కొన్ని ట్రిప్పులు పెరిగినా ప్రయాణికుల సంఖ్య పెరగలేదు.
ప్రారంభంలో ఉత్సాహం
ప్రారంభంలో రోజుకు తిరిగే 66 ట్రిప్పుల్లో దాదాపు 19 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దీని ద్వారా రోజుకు రూ.రెండు లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ, కొద్ది రోజులుగా ఈ సంఖ్య 15 వేలకు పడిపోయింది. రోజురోజుకూ ఈ సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఎమ్మెమ్మార్డీయే అధికారులు కలవరానికి గురవుతున్నారు.
మొదటి దశలో చేపట్టిన చెంబూర్-వడాలరోడ్‌ల మధ్య దూరం చాల తక్కువగా ఉంది. రెండో దశలో వడాలరోడ్ నుంచి జేకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) వరకు చేపడుతున్న మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే ప్రయాణ దూరం పెరగనుంది. అప్పుడు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. మొదటిలో నడుస్తున్న మోనో మార్గంలో ఏడు స్టేషన్లు ఉన్నాయి.
ఈ పనులు పూర్తయితేనే..
రెండో దశ మార్గంలో వడాలరోడ్ తరువాత జీటీబీ నగర్, అంటాప్ హిల్, ఆచార్య ఆత్రే నగర్, వడాల బ్రిడ్జి, తూర్పు దాదర్, నాయ్‌గావ్, అంబేద్కర్ నగర్, మింట్ కాలనీ, లోయర్‌పరేల్, చించ్‌పోక్లీ, సాత్‌రాస్తా ఇలా 11 స్టేషన్లు ఉన్నాయి. ప్రారంభంలో ఈ మార్గం పనులు వేగంగా జరిగాయి. కానీ సెంట్రల్ రైల్వే మార్గంలోని కర్రీరోడ్ స్టేషన్ వద్ద మోనో రైలు పిల్లర్ల డిజైన్‌లో రెండుసార్లు మార్పులు జరిగాయి. పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే తప్ప మోనోకు మంచి రోజులు వచ్చే సూచనలు లేవని అధికారులు భావిస్తున్నారు.
‘మోనో’కు తగ్గిన ఆదరణ
Published Thu, Sep 11 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement