monorail
-
ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు..!
ముంబయి: ముంబయిలో శనివారం ఓ ఘోర ప్రమాదం తప్పిపోయిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు మోనో రైళ్లు ఒకే రైల్వే ట్రాక్‌పై ఎదురెదురుగా రావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిందన, అదృష్టవశాత్తూ అతి సమీపంలో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారని పోస్టులు చేస్తున్నారు. ఘోర ప్రమాదం ఇలా తప్పిందంటూ సోషల్ మీడియాలో రైళ్ల ఫొటోలను షేర్ చేస్తున్నారు. ముంబై మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) మాత్రం ఇది ప్రమాదం కాదని అందుకు వివరణ ఇచ్చుకుంది. చెంబూరు ఏరియాలో శనివారం సాయంత్రం ఒకే ట్రాక్‌పైకి రెండు మోనో రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో దీనిపై వదంతులు ప్రచారం కావడంతో అధికారులు వివరణ ఇచ్చారు. సాంకేతికలోపం కారణంగా ట్రాక్‌పైనే నిలిచిపోయిన రైల్లోని ప్రయాణికులను తరలించేందుకు మరో రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోనోరైలులో పదే పదే ఇలాంటి సమస్యలు తలెత్తుతుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2011లో నిర్మాణ సమయంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 2012 జూలైలో వాదాలా ఏరియాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే. -
జాయ్ రైడ్‌కే పరిమితమైన మోనో రైలు
ప్రయాణికుల ఆదరణకు నోచుకోని నూతన రవాణా సాధనం * నేటితో ఏడాది పూర్తి సాక్షి, ముంబై: ఎన్నో ఆశలతో, ఎంతో ఆర్భాటంగా దేశంలోనే మొట్ట మొదటిసారిగా నగరంలో ప్రారంభించిన మోనో రైలు ఎందుకోగాని ముంబైకర్ల ఆదరణ పొందలేకపోయింది. ఈ రైళ్లు ప్రారంభమైన తొలిరోజుల్లో వాటిలో ప్రయాణించేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి కనబరిచారు. చెంబూర్-వడాల మధ్య మోనో రైలు సేవలు 2014 ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభమయ్యాయి. రెండు మూడు నెలల పాటు మోనో రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎంతో సందడి చేశారు. నాలుగు బోగీలతో కూడిన ఈ రైళ్లు అటు, ఇటు పరుగులు తీయడం ముంబైకర్లను ఎంతో ఆకట్టుకుంది. రైళ్లన్నీ కిక్కిరిసి పరుగులు తీశాయి. దీంతో భవిష్యత్తులో కూడా ప్రయాణికుల నుంచి ఇలాంటి ఆదరణే లభిస్తుందని ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) వర్గాలు భావించాయి. కానీ కొద్ది రోజుల్లోనే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మోనోరైళ్లకు ప్రజల ఆదరణ తగ్గిపోయింది. ప్రారంభంలో కనిపించిన ఆ సందడంత కేవలం సరదాగా ప్రయాణించడం (జాయ్ రైడ్) కోసమేనని అధికారులు ఆలస్యంగా తెలుసుకున్నారు. కొద్ది నెలలుగా ఈ ప్రాజెక్టు నష్టాల్లో నడుస్తున్నట్లు అనధికార వర్గాలు తెలిపాయి. ఒక మోనో రైలులో సరాసరి 568 మంది ప్రయాణించవచ్చు. కాని ప్రస్తుతం ఒక్కో రైలులో ట్రిప్పుకు సగటున 50 మంది ప్రయాణికులు మాత్రమే వాటిలో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడానికి గల ప్రధాన కారాణాలను తెలుసుకొనేందుకు ఎమ్మెమ్మార్డీయే ప్రయత్నాలు ప్రారంభించింది. అన్ని స్టేషన్లలో గట్టి భద్రత, ఆధునిక టికెట్ కౌంటర్లు, అత్యాధునిక ప్లాట్‌ఫారాలు, తనఖీ సిబ్బంది. సాంకేతిక సిబ్బంది, దీంతో వీటి నిర్వాహణ భారం భారీగా పెరిగిపోయింది. కొద్ది రోజులుగా ఈ రైళ్లలో కుదుపులు కూడా ఎక్కువయ్యాయి. దీంతో పిల్లర్లు, రోలింగ్ స్టాక్, రెండు స్థంబాలను జోడించే విధానంలో లోపాలను పరిశీలించే పనులను ప్రారంభించారు. నివేదిక వచ్చిన తరువాత కుదుపులకు ప్రధాన కారణాలు వెల్లడవుతాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ బి.వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. -
మోనోకు తగ్గిన ఆదరణ
నష్టాల్లో ఎమ్మెమ్మార్డీయే సాక్షి, ముంబై: దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మోనో రైలుపట్ల ప్రయాణికులే కాకుండా ప్రకటనల సంస్థలు కూడా ముఖం చాటేశాయి. మోనో రైళ్లలో, ప్లాట్‌ఫారాలపై, పిల్లర్లపై, ట్రాక్ ప్రహరీ గోడలపై, స్టేషన్ పరిసరాల్లో ప్రకటనలు ఏర్పాటు చేసేందుకు వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థలు ముందుకు రావడం లేదు. దీంతో ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కు భారీ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ప్రయాణికుల నుంచి అనుకున్నంత మేర ఆదాయం రావడంలేదు. దీంతో నష్టాల్లో కొట్టుమిట్టుడుతున్న ఎమ్మెమ్మార్డీయే అదనపు ఆదాయం బాటలో పడింది. అందుకు ఎమ్మెమ్మార్డీయే పరిపాలన విభాగం వివిధ ప్రకటనల సంస్థలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాని వాణిజ్య, వ్యాపార, ఇతర రంగాల నుంచి స్పందన రావడం లేదు. వడాల-చెంబూర్ మధ్య సుమారు తొమ్మిది కి.మీ. మేర ఈ మోనో రైలు మార్గం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ప్రారంభంలో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. కాలక్రమేణా ఈ రైలుపై ముంబైకర్ల మోజు తగ్గిపోయింది. ప్రస్తుతం నామమాత్రంగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆదాయం లేక నిర్వహణ మరింత భారంగా మారింది. రైళ్ల లోపలి భాగంతో పాటు ఏడు స్టేషన్లలో ప్రకటనలు ఏర్పాటు చేసే బాధ్యతలు అప్పగించేందుకు ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియకు ఎవరూ స్పందించడం లేదు. ఇదిలా ఉండగా, వార్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య నడుస్తున్న మెట్రో రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది. కేవలం ఆరు నెలల కాల వ్యవధిలో ఐదు కోట్లకుపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ సంఖ్య ప్రపంచంలోని వివిధ దేశాలతో పోలిస్తే రికార్డు బ్రేక్‌గా మెట్రో రైలు అధికారులు భావిస్తున్నారు. మెట్రో రైలు ఈ ఏడాది జూన్ ఎనిమిదో తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి డిసెంబరు 11వ తేదీ రాత్రి వరకు మొత్తం మెట్రో రైళ్లు 70 వేల ట్రిప్పులు తిరిగాయి. ఒక్కో రైలుకు కేవలం నాలుగు బోగీలు ఉన్నప్పటికీ ఇందులో ఏకంగా ఐదు కోట్లకుపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వర్సోవా-ఘాట్కోపర్‌ల మధ్య మెట్రో రైలు ద్వారా కేవలం 21 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం మీదుగా వెళితే ట్రాఫిక్‌లో కనీసం గంటన్నరకుపైనే సమయం పడుతుంది. దీంతో ప్రజలు మెట్రో రైలుపై మరింత ఆసక్తి కనబరుస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
‘మోనో’కు తగ్గిన ఆదరణ
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్ట మొదటిసారిగా ముంబై నగరంలో ప్రవేశపెట్టిన మోనో రైలుకు ప్రయాణికుల నుంచి అనుకున్నంత మేర స్పందన రావడం లేదు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కూడా ప్రయాణికులు లేక మోనో రైలు ఖాళీగానే తిరుగుతోంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మోనో రైలు నష్టాలను చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రారంభంలో అనేక మంది ముంబైకర్లు ఈ రైలులో రాక పోకలు సాగించారు. ప్రస్తుతం జాయ్ రైడ్ చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇటు ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పడిపోవడంతో రైలు అలంకార ప్రాయంగా మిగిలిపోతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిప్పులు పెరిగినా.. 2014 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రైలు ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో రైలును లాంఛనంగా ప్రారంభించిన ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) ఆదాయంపై ఎన్నో ఆశాలు పెట్టుకుంది. కానీ, మొదటి దశలో నడుస్తున్న చెంబూర్-వడాల డిపోల మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. ఈ మార్గంలో ఏడు స్టేషన్లు ఉన్నప్పటికీ ఇందులో ఆర్సీ మార్గ్, ఫర్టీలైజర్, భారత్ పెట్రోలియం, మైసూర్ కాలనీ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అంతగా లేదు. ప్రయాణికులు సౌకర్యార్థం ఇటీవల సమయాన్ని కూడా పెంచారు. దీనివల్ల కొన్ని ట్రిప్పులు పెరిగినా ప్రయాణికుల సంఖ్య పెరగలేదు. ప్రారంభంలో ఉత్సాహం ప్రారంభంలో రోజుకు తిరిగే 66 ట్రిప్పుల్లో దాదాపు 19 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దీని ద్వారా రోజుకు రూ.రెండు లక్షల వరకు ఆదాయం వచ్చేది. కానీ, కొద్ది రోజులుగా ఈ సంఖ్య 15 వేలకు పడిపోయింది. రోజురోజుకూ ఈ సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఎమ్మెమ్మార్డీయే అధికారులు కలవరానికి గురవుతున్నారు. మొదటి దశలో చేపట్టిన చెంబూర్-వడాలరోడ్ల మధ్య దూరం చాల తక్కువగా ఉంది. రెండో దశలో వడాలరోడ్ నుంచి జేకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) వరకు చేపడుతున్న మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే ప్రయాణ దూరం పెరగనుంది. అప్పుడు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. మొదటిలో నడుస్తున్న మోనో మార్గంలో ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఈ పనులు పూర్తయితేనే.. రెండో దశ మార్గంలో వడాలరోడ్ తరువాత జీటీబీ నగర్, అంటాప్ హిల్, ఆచార్య ఆత్రే నగర్, వడాల బ్రిడ్జి, తూర్పు దాదర్, నాయ్‌గావ్, అంబేద్కర్ నగర్, మింట్ కాలనీ, లోయర్‌పరేల్, చించ్‌పోక్లీ, సాత్‌రాస్తా ఇలా 11 స్టేషన్లు ఉన్నాయి. ప్రారంభంలో ఈ మార్గం పనులు వేగంగా జరిగాయి. కానీ సెంట్రల్ రైల్వే మార్గంలోని కర్రీరోడ్ స్టేషన్ వద్ద మోనో రైలు పిల్లర్ల డిజైన్‌లో రెండుసార్లు మార్పులు జరిగాయి. పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే తప్ప మోనోకు మంచి రోజులు వచ్చే సూచనలు లేవని అధికారులు భావిస్తున్నారు. -
మోనోరైలుకు రిటర్న్ టికెట్
సాక్షి, ముంబై : మోనోరైలు ప్రయాణికులకు శుభవార్త! వీరికి ఇక నుంచి రిటర్న్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఫలితంగా టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ కొంత మేర తగ్గనుందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఒకే టికెట్‌తో గమ్యస్థానం చేరుకొని తిరిగి రావచ్చు. ఎంత మంది ప్రయాణికులు మోనోరైలులో వెళ్లి ఇందులోనే తిరుగు ప్రయాణమవుతున్నారన్న (రిటర్న్ జర్నీ) విషయమై సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. అయితే చాలా మంది ప్రయాణికులు తిరిగి వస్తుండడంతో రిటర్న్ టికెట్ సదుపాయం కూడా కల్పిస్తే బాగుంటుందని అధికారులు భావించారు. ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ పేర్కొన్నారు. ఇదిలా వుండగా ముంబై మెట్రోకు జూలై నుంచి రిటర్న్ టికెట్ సదుపాయం కల్పించారు. దీనికి ప్రయాణికుల నుంచి మంది స్పందన వస్తోందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. జాయ్రైడ్ల కోసం మెట్రోరైళ్లు ఎక్కేవారు ఈ సదుపాయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. మోనో రైలు ప్రయాణికులకు నెలసరి పాస్‌ను కూడా ప్రారంభించాలని ఎమ్మెమ్మార్డీఏ యోచిస్తోంది. ఇందుకోసం ప్రయాణికుల రద్దీపై అధ్యయనం నిర్వహించనున్నారు. ఈ రైలులో ఎంత మంది తిరుగుప్రయాణమవుతున్నారనే దానిపై అధ్యయనం నిర్వహించనున్నారు. ఎక్కువమంది ఈ రైలులో వెనక్కి వచ్చినట్లయితే నెలసరి పాస్‌లను కూడా జారీ చేస్తామని మదన్ తెలిపారు. ఎమ్మెమ్మార్డీఏ అందజేసిన గణాంకాల మేరకు.. మోనో రైలు ప్రయాణికుల్లో దాదాపు 50 శాతం మంది ప్రయాణికులు ఇదే రైలులో తిరుగు ప్రయాణం అవుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. మోనోతో పోల్చితే మెట్రో రైలులో 70 శాతం మంది తిరుగు ప్రయాణం అవుతారని తేలింది. 8.8 కిలోమీటర్ల పొడవుతున్న చెంబూర్-వడాలా కారిడార్‌ను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలుకు అనుకున్నంత మేర స్పందన లభించడం లేదని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు మార్గాన్ని విస్తృతపర్చకపోవడంతోపాటు రద్దీ స్టేషన్లను ఈ మార్గంలో చేర్చకపోవడంతో కూడా స్పందన తక్కువగా ఉంది. రెండోదశ ప్రాజెక్టులో మోనోరైలును జాకబ్ సర్కిల్ వరకు విస్తరించనున్నారు. దీని వల్ల ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య రైల్వేస్టేషన్లు అయిన చెంబూర్, వడాలా, కర్రీరోడ్, మహాలక్ష్మి వంటి స్టేషన్లతో మోనో రైలు సేవలను అనుసంధానించనున్నారు. అంతేగాక మోనోరైలును తూర్పు శివారు ప్రాంతాల నుంచి పశ్చిమ శివారు ప్రాంతాలకు త్వరలోనే అనుసంధానిస్తామని మదన్ పేర్కొన్నారు. -
ఠాణేలో మోనోరైలుకు నో
ముంబై: ఠాణే-భివండీ-కల్యాణ్ మార్గంలో మోనోరైలు ఏర్పాటుకు నిర్వహించిన సాధ్యాసాధ్యాల సర్వేలో వ్యతిరేక ఫలితాలు రావడంతో ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి బదులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి పర్చడానికి మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఆర్టీఎస్) ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. అయితే ఈ ప్రాంతంలోని ప్రయాణ అవసరాలు, రద్దీ, ఆర్థిక, సాంకేతిక విషయాలపై అధ్యయనం నిర్వహించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) టెండర్లను కూడా ఆహ్వానించింది. ఠాణే-భివండీ-కల్యాణ్ ప్రాంతం కోసం ఎంఆర్టీఎస్ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గత నెల సంకేతాలు ఇచ్చారు. ఇక మోనోరైలు ఏర్పాటు కోసం ఎమ్మెమ్మార్డీయే..రైట్స్ అనే సంస్థ సాయంతో 2011లోనే సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహించింది. ఈ మార్గంలో 25 కిలోమీటర్ల మేర మోనోరైలు ఏర్పాటు వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని, రాబడులకు ఎక్కువ అవకాశాలు లేవని సర్వే తేల్చింది. దీనికి బదులు రోడ్డు మార్గాల అభివృద్ధికి ప్రాజెక్టులు ప్రారంభించాలని సిఫార్సు చేసింది. ఈ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక స్థితిగతులు మారడం, విరార్ నుంచి అలీబాగ్ ప్రత్యేక రవాణా మార్గం ఏర్పాటు ప్రతిపాదన నేపథ్యంలో ఎంఆర్టీఎస్ ఏర్పాటుకు తాజాగా సర్వే నిర్వహిస్తున్నామని ఎమ్మెమ్మార్డీయే వివరించింది. ఠాణే, భివండీ, కల్యాణ్‌లో ప్రయాణికుల రద్దీని అంచనా వేయడం ద్వారా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపింది. -
మోనోరైలుకు విశేష స్పందన
సాక్షి, ముంబై : నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన నెల రోజుల్లోనే దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ ల మధ్య 11.4 కి.మీ ప్రయాణించే మెట్రో రైలును జూన్ 8వ తేదీన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన విషయం తెలి సిందే. మంగళవారానికి నెల రోజులు పూర్తవుతోంది. ఈ మెట్రో రైళ్లు మొత్తం 13 వేల ట్రిప్పులు కొట్టాయి. దాదాపు లక్షన్నర కి.మీ ప్రయాణించాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని రిలయన్స్ ఇన్ఫ్రా అభిప్రాయపడింది. సెలవుదినాల్లో చిన్నారులకు ఉచితం ముఖ్యంగా ప్రతీ శని, ఆదివారాల్లో 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించింది. పిల్లలతోపాటు పెద్దలు కూడా అధిక సంఖ్యలోనే వస్తున్నారని ఇన్ఫ్రా స్పష్టం చేసింది. ప్రస్తుతం శని, ఆదివారాలు కార్యాలయలు, పాఠశాలలకు సెలవులు కావడంతో అత్యధిక శాతం జాయ్ రైడ్ కోసమే అందులో ప్రయాణిస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. ప్లాట్‌ఫారాలపై రద్దీకూడా కనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారు మినహా పిల్లలు, జాయ్ రైడ్ చేసే పెద్దల సంఖ్య అంతగా కనిపించడం లేదు. పర్యాటకుల ఆకర్షణ ముఖ్యంగా ఈ మెట్రో రైళ్లు స్థానిక ముంబైకర్లతోపాటు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బోగీలన్నీ మూసి ఉండడంతో బయటి శబ్ధం లోపలికి ఏమాత్రం వినిపించదు. రైలంతా ఏసీ, విశాలమైన కిటికీ అద్దాల్లోంచి బయట నగర అందాలను తిలకించేందుకు వీలుంది. దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా ఈ చివర నుంచి ఆ చివర వరకు వెళ్లేందుకు బోగీలన్నీ జాయింట్ చేశారు. లోపల ఎలక్ట్రానిక్ ఇండికేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం రైలు ఆగిన స్టేషన్, వచ్చే స్టేషన్ పేరు ముందుగానే హిందీ, ఇంగ్లిష్‌లో ప్రకటిస్తుంది. తత్ఫలితంగా ఈ రైళ్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కూర్చునే సామర్థ్యం తక్కువగా ఉంది. నిలబడి ప్రయాణించేందుకు ఎక్కువ స్థలం కేటాయించారు. అతి తక్కువ సమయంలో కోటికిపైగా ప్రయాణికులను చేరవేసిన ఘనత ముంబై మెట్రో రైళ్లు దక్కించుకున్నాయి. -
‘మోనో’కు ముహూర్తం ఖరారు
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని నగరవాసులంతా ఎదురుచూస్తున్న మోనో రైలు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీనుంచి మోనో రైలు సేవలు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. వాయిదాలపై వాయిదాలు పడుతున్న ఈ నెల 13వ తేదీన ఈ రైలుకు చివరిసారిగా ప్రయోగాత్మక పరుగు నిర్వహించనున్నారు. వాస్తవానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ రైలు సేవలు ఏడాదిన్నర క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అనేక పర్యాయాలు వాయిదా వేయకతప్పలేదని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి విడతలో భాగంగా చెంబూర్-వడాలా మధ్య పనులు పూర్తయ్యాయి. గతంలో నిర్వహించిన వివిధ రకాల పరీక్షలు సఫలీకృతమయ్యాయి. అయితే రైల్వే బోర్డు అనుబంధ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ నుంచి భద్రతాపత్రం మంజూరు కాకపోవడంతో ఈ రైళ్లన్నీ యార్డులకే పరిమితమయాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు అసిస్టెంట్ కమిషనర్ అశ్వినిభిడే చెప్పారు. సాధ్యమైనంత త్వరగా భద్రతాపత్రం మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. -
మూడేళ్లలో మోనోరైలు : ముఖ్యమంత్రి షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో 2017 కల్లా మోనోరైలు పరుగులు పెట్టనుందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. ‘మోనోరైలు, లైట్ రైల్ ట్రాన్సిట్’ అనే అంశంపై మంగళవారం జరిగిన ఇండో- జపాన్ సెమినార్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షిత్ మాట్లాడుతూ శాస్త్రి పార్క్-త్రిలోక్‌పురి మధ్య మొదటి మోనో రైలు కారిడార్ 2017 కల్లా సిద్ధం కానుందని చెప్పారు. దీనిపై ఇప్పటికే డీఎంఆర్సీ, ‘రైట్స్’తో కలిసి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిందన్నారు. నగర తూర్పు ప్రాంతంలో మొదటి మోనో రైలు కారిడార్‌ను శాస్త్రిపార్క్- త్రిలోక్‌పురి మధ్య 11 కి.మీ. పరిధిలో నిర్మించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2017 నాటికి నగరంలో మొదటి మోనో రైలు తన సేవలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ఇంకా చాలా మోనోరైలు కారిడార్లను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగర అవసరాలను తీర్చేందుకు ఒక సుదీర్ఘ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆమె వివరించారు. నగరంలో ఇరుకైన ప్రాంతాల్లో, మెట్రో సేవలు అందుబాటులో లేని ఏరియాల్లో ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకు ముందు అదే సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ భారతదేశంలోని పలు నగరాల్లో మోనోరైళ్లను ఏర్పాటు ఆవశ్యకతపై మాట్లాడారు. ఇరుకైన ప్రాంతాల్లో మోనోరైళ్ల ఏర్పాటు ఎంతైనా అవసరమన్నారు. మోనోరైలు ఏర్పాటుకు తక్కువ స్థలం సరిపోతుంది కాబట్టి స్థల సేకరణ కూడా పెద్ద సమస్య కాబోదన్నారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించే మోనోరైళ్ల వల్ల నగరాల్లో ట్రాఫిక్ సమస్యను చాలావరకు అధిగమించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రెండు మోనోరైలు మార్గాలను నిర్మిస్తోందని, ఢిల్లీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అన్ని నగరాల్లో మెట్రో రైలు మార్గాలను ఏర్పాటుచేయడం చాలా కష్టమన్నారు. పది లక్షలకు మించి జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో చిన్నతరహా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని 12వ పంచవర్ష ప్రణాళిక నొక్కిచెప్పిందన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 53 నగరాలను గుర్తించి, అక్కడ మోనోరైళ్లు, బస్సు ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను జపాన్ దేశ సాంకేతిక సహాయంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జపాన్ సీనియర్ మినిస్టర్ హిరోషి కజియామా మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో పనులు బాగా జరుగుతున్నాయని అభినందించారు. -
మెట్రోకు పోటీగా మోనోరైల్
తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పోరు అనేక ఏళ్లుగా సాగుతోంది. డీఎంకే హయూంలో ఒక పథకం మొదలైతే దానికి దీటైన పథకం అన్నాడీఎంకే ప్రభుత్వంలో మొదలు కావాల్సిందే. ఈ పోటీ రైళ్ల వరకు చేరింది. డీఎంకే మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు దీటుగా మోనోరైల్ ప్రాజెక్ట్‌ను అన్నాడీఎంకే ప్రభుత్వం సాధించింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: పరిసరాల్లోని పంచాయతీలను కలుపుకుని చెన్నై కార్పొరేషన్ మహానగరంగా విస్తరించింది. శివారు ప్రాంతాల్లో ఐటీ సంస్థలు, పారిశ్రామికవాడలు, కార్పొరేట్ ఆస్పత్రులు కొలువుదీరాయి. ఈ క్రమంలో నగర ట్రాఫిక్ అత్యంత రద్దీగా మారిపోయింది. సమస్య పరిష్కారం దిశగా మెట్రోరైల్ ప్రాజెక్ట్ కోసం డీఎంకే ప్రభుత్వం 2007 నవంబరు 7న ప్రతిపాదనలు పెట్టింది. ఈ మేరకు 2009 జనవరి 28న కేంద్రం మంజూరు చేసింది. రూ.14 వేల కోట్ల అంచనాతో 41 కిలోమీటర్ల దూరం వరకు సేవలు అందించే దిశగా మెట్రోరైల్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. 2015 నాటికి సేవలు అందించాలనే లక్ష్యంతో పనులు చకచకా సాగుతున్నా రుు. ట్రయల్ రన్ కోసం నాలుగు బోగీలతో కూడిన మెట్రోరైల్ రెండు నెలల క్రితమే జర్మనీ నుంచి చెన్నై చేరుకుంది. రూ.7687 కోట్లతో మోనోరైల్ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు పోటీగా అన్నాడీఎంకే ప్రభుత్వం మోనోరైల్‌కు ప్రతిపాదనలు పెట్టింది. ప్రాజెక్ట్ వ్యయం రూ.7687 కోట్లు. మోనోరైల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దీపాదాస్ మున్షీ పార్లమెంటులో ఇటీవల ప్రకటించారు. మెట్రోరైల్ మార్గంలేని ప్రాంతాలను కలుపుతూ మోనోరైల్ పథకాన్ని అమలు చేయనున్నారు. వండలూరు-వేలాచ్చేరి మధ్య 23 కిలోమీటర్లు, పూందమల్లి- కత్తిపారలను కలుపుతూ 16 కిలోమీటర్లు, పూందమల్లి- వడపళనిని కలుపుతూ 18 కిలోమీటర్ల మార్గాన్ని ఖరారు చేశారు. -
ఇక ఇప్పట్లో మోనో పరుగులు లేనట్లేనంటున్నఅధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: పాత ఢిల్లీలోని శాస్త్రిపార్క్ నుంచి త్రిలోక్‌పురి మధ్య మొట్టమొదటి మోనోరైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫైలును ప్రభుత్వం ఆర్థిక శాఖకు పంపింది. అయితే నిర్మాణ వ్యయంపై స్పష్టత లేని కారణంగా ఫైలు ముందుకు కదలడం లేదు. దీంతో మోనోరైలు పరుగుపై నీలి నీడలు అలముకుంటున్నాయి. మోనోరైలు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఇటీవల మాట్లాడుతూ... ‘ఇది భవిష్యత్తులో చేపట్టబోయే నిర్ణయమ’ని చెప్పడం ద్వారా ఇప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మా ణం జరగదనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న షీలా సర్కారుకు మోనోరైలు ప్రాజెక్టుపై మాత్రం స్పష్టత కొరవడింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంపై ఆర్థికశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. మోనోరైలు నిర్మాణానికి అయ్యే ఖర్చులకు సంబంధించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ ఓ ప్రతిపాదిత నివేదికను ఢిల్లీ సర్కార్ మందుంచింది. దీనిలో మూడు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. మోనోరైలు నిర్మాణానికి రూ.2,235 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం.. ఒక్క రూట్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వంలో అంతర్మథనం కొనసాగుతోంది. ఇంత పెద్ద మొత్తానికి బదులుగా పెద్ద సంఖ్యలో బస్సులు కొనుగోలు చేయవచ్చన్నది సర్కార్‌లోని కొందరు పెద్దల అభిప్రాయం. అయితే షీలాదీక్షిత్ స్వయంగా కలుగజేసుకొని ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే ఫైలు ముందుకు కదిలే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా ఇప్పుడు పనులు ప్రారం భించినా దాని ఫలితం కనిపించాలంటే కనీసం నాలుగేళ్లు పడుతుందని, అది ఎన్ని కల్లో ఎలాంటి ఫలితం ఇవ్వదని భావించే షీలా ప్రభుత్వం వెనక్కు తగ్గిందని పలువురు ఆరోపిస్తున్నారు.